నవలా చక్రవర్తి-యండమూరి

- November 14, 2024 , by Maagulf
నవలా చక్రవర్తి-యండమూరి

యండమూరి వీరేంద్రనాథ్.. ఆ పేరు వింటే చాలు.. ఒకప్పుడు నవలా ప్రియులు చెవికోసుకొనేవారు. తెలుగులో కమర్షియల్ నవలలకు పెద్దపీట వేసి.. పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన మేటి రచయిత ఆయన. కొన్ని రచనలు విమర్శలపాలైనా.. ఒక రచయితగా ఆయన పాపులారిటీ ఎప్పుడూ తగ్గలేదు. నాటి తరానికి పాపురల్ నవలా రచయితగా పరిచయమైతే.. నేటి తరానికి ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా కూడా  సేవలందించారు ఆయన. కొన్నాళ్లు సినీ రచయితగా, దర్శకుడిగా కూడా ఒక్క వెలుగు వెలిగిన యండమూరి తెలుగు రచనా లోకంలో ఎప్పటికే ఒక ప్రభంజనమే..ఆయన రచనలు సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతూనే సగటు పాఠకుని ఆకట్టుకొనే ఆకర్షణీయమైన పదజాలంతో పులకింప చేశాయి. దాంతో కమర్షియల్ గా కూడా యండమూరి రచనలు గ్రాండ్ సక్సెస్ ను చూశాయి. అంతకు ముందు రచయిత్రుల నవలలే విశేషంగా అమ్ముడు పోతూ ఉన్నాయి. వారి రచనల అమ్మకాన్ని మించి యండమూరి వీరేంద్రనాథ్ రచనలు సాగాయి. దాంతో యండమూరి వీరంద్రనాథ్ ‘నవలాచక్రవర్తి’గా కీర్తి గడించారు. నేడు యండమూరి పుట్టినరోజు.

యండమూరి వీరేంద్రనాథ్ తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు 1948,నవంబర్14న జన్మించారు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలకు బదిలీ కావడంతో ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది. ప్రాథమిక విద్య కాకినాడ, రాజమండ్రి లలోనూ, ఆరవ తరగతి జమ్మలమడుగులోనూ, ఏడవ తరగతి అనంతపురం లోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోనూ, బి.కాం కాకినాడ లోనూ చదివాడు. 1972లో సీ.ఏ పూర్తి చేశారు. రచనా రంగంలోకి ప్రవేశించక ముందు కొన్నాళ్లు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో ఛార్టెడ్ అకౌంటెంట్‌గా, పది సంవత్సరాల పాటు ఆంధ్రా బ్యాంకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విభాగానికి అధిపతిగా పనిచేశారు.

వీరేంద్రనాథ్ రాసిన ‘పర్ణశాల’ సీరియల్ ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. ఆ సీరియల్ తో వీరేంద్రనాథ్ కు మంచి గుర్తింపు లభించింది. తరువాత యండమూరి కలం నుండి జాలువారి ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైన ‘తులసి, తులసీదళం’ సీరియల్స్ తెలుగు పాఠకలోకాన్ని ఓ ఊపు ఊపేశాయి. ఆ నవలల విజయంతో యండమూరి టాప్ రైటర్ అయిపోయారు. ఆంధ్రజ్యోతిలో ‘అభిలాష’ సీరియల్ ఆకట్టుకుంది. తరువాత ‘డబ్బు టు ద పవరాఫ్ డబ్బు’, ‘రాక్షసుడు’, ‘మరణమృదంగం’ సీరియల్స్ గానూ, నవలలుగానూ పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఎక్కువగా ప్రేమ.. మగువ..మనసు.. ఈ మూడింటి చుట్టూ తిరిగే యండమూరి రచనలు అనతి కాలంలోనే క్షుద్రశక్తులు, డిటెక్టివ్ పరిశోధనలు మొదలైన అంశాల చుట్టూ కూడా తిరిగాయి. తులసీదళం నవలలో ఆయన రాసిన అంశాలు మూఢనమ్మకాలను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితేనేం.. ఆ తర్వాత రాసిన అనేక ఇతర నవలలు పాఠకులను ఉర్రూతలూగించాయి. తెలుగు రచయితలకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన ఘనత తీసుకొచ్చిన బహుకొద్ది రచయితల్లో యండమూరి కూడా ఒకరు.

యండమూరి సీరియల్స్ ను ఎంత ఆసక్తిగా పాఠకులు చదివారో, అంతే ఆసక్తిగా అవి నవలలుగా వచ్చాక కొనుక్కొని మరీ చదివారు. ఇక ఆయన రచనల ఆధారంగా సినిమాలు వస్తున్నాయంటే, వాటిపై జనం ఎంతో మోజుపడేవారు. అందుకు తగ్గట్టుగానే యండమూరి రచనలతో రూపొందిన పలు చిత్రాలు జనాన్ని అలరించాయి. ఆయన నవలల ఆధారంగా కొన్ని కన్నడ చిత్రాలు తెరకెక్కి ఆకట్టుకున్నాయి. చిరంజీవి ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ చిత్రానికీ యండమూరి కథ సమకూర్చారు.

చిత్రసీమలో యండమూరి వీరేంద్రనాథ్ తొలుత స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశారు. మృణాల్ సేన్ ‘ఒకవూరి కథ’కు స్క్రిప్ట్ రాశారు. వంశీ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘మంచుపల్లకి’కి మాటలు పలికించారు. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ తొలి చిత్రం ‘అభిలాష’ వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తెరకెక్కిందే. ఈ చిత్రంలో చిరంజీవి కథానాయకుడు. సినిమాకు ఏ.కోదండరామిరెడ్డి దర్శకుడు, ఇళయరాజా సంగీత దర్శకుడు, కె.ఎస్.రామారావు నిర్మాత. ‘అభిలాష’ విజయం తరువాత ఈ నలుగురి కాంబోలో వరుసగా “ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం” చిత్రాలు విడుదలయ్యాయి. చిరంజీవిని నవలానాయకునిగా నిలిపింది యండమూరి అనే చెప్పాలి. మరోవైపు యండమూరి వీరేంద్రనాథ్ నవలల ఆధారంగా “ఒక రాధ ఇద్దరు కృష్ణులు, దొంగమొగుడు, రక్తాభిషేకం, సంపూర్ణ ప్రేమాయణం, ముత్యమంత ముద్దు, కాష్మోరా” వంటి చిత్రాలు తెరకెక్కి అలరించాయి.

తన రచనల ద్వారా తెరకెక్కిన ‘అగ్నిప్రవేశం’, ‘స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్’ చిత్రాలకు తానే మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించారు. రెండు చిత్రాలూ అంతగా అలరించలేదు చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ పరాజయం పాలయింది. దాంతో యండమూరి సినిమా కెరీర్ మునుపటిలా సాగలేదనే చెప్పాలి. చాలా గ్యాప్ తరువాత 2009లో ఏ.కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ‘పున్నమి నాగు’ చిత్రానికి కథ సమకూర్చారు యండమూరి. అదీ అంతగా ఆకట్టుకోలేక పోయింది.

యండమూరి తాను రాసిన "వెన్నెల్లో ఆడపిల్ల" నవలనే దూరదర్శన్ కోసం సీరియల్‌గా కూడా తీశారు. ఆ ధారావాహికానికి నంది పురస్కారం కూడా గెలుచుకున్నారు. ఆయన రచించిన "అంతర్ముఖం" నవల కూడా సీరియల్‌గా రూపొందింది. అలాగే "డైరీ ఆఫ్ మిసెస్ శారద" అనే నవలను నిర్మాత నాగబాబు టీవీ సీరియల్‌గా కూడా తెరకెక్కించారు. యండమూరి వీరేంద్రనాథ్ కేవలం నవలలు మాత్రమే రాయలేదు.. నాటకాలు కూడా రాశారు. ఆయన రాసిన "రఘుపతి రాఘవ రాజారామ్" నాటకం 1982లో సాహిత్య అకాడమీ అవార్డుని గెలుచుకుంది.

సమయానుకూలంగా తన కలాన్ని పరుగులు తీయించడంలో మేటి యండమూరి. కాల్పనిక సాహిత్యంపై పాఠకులకు మోజు తగ్గిన సమయాన్ని కనిపెట్టి, ఆ సమయంలో జనాన్ని ఆలోచింప చేసేలా ‘నాన్-ఫిక్షన్’ రచనలు చేశారు. వాటిలో ‘విజయానికి ఐదు మెట్లు’ ఘనవిజయం సాధించింది. అంతకు ముందు తెలుగులో ప్రచురితమైన ‘పర్సనాలిటీ డెవలప్ మెంట్’ పుస్తకాలన్నిటి కన్నా మిన్నగా ఈ పుస్తకం విక్రయాలు సాగాయి. విజయానికి ఆరవ మెట్టు, విజయ రహస్యాలు, మీరు మంచి అమ్మాయి కాదు, మిమ్మల్ని మీరు గెలవగలరు, విజయంలో భాగస్వామ్యం, మైండ్ పవర్ నెంబర్ ఒన్ అవడం ఎలా? ఆయన రచించిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస గ్రంథాలు. ఇటీవలి కాలంలో యండమూరి వ్యక్తిత్వ వికాసం కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. కళాశాల విద్యార్థులకు వాటిని బోధిస్తున్నారు. ఇప్పటికీ ఏదో విధంగా తన రచనలతో ఆకట్టుకుంటూనే ఉన్నారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com