చుక్కానైన లెక్కల రామయ్య

- November 20, 2024 , by Maagulf
చుక్కానైన లెక్కల రామయ్య

ఓ విద్యార్థి... సామాజిక కార్యకర్తయ్యాడు. ఆ కార్యకర్త నిజాం వ్యతిరేక పోరాటయోధుడయ్యాడు. ఆ యోధుడు విద్యావేత్తయ్యాడు. ఇలా ఎన్నో ప్రాతలు పోషించి పరిపూర్ణుడయ్యాడు. ఎందరో జీవితాలకు చుక్కానైన లెక్కల మాస్టరు చుక్కారామయ్య. తొమ్మిది పదుల వయస్సులోనూ నేర్చుకుంటూ, చదువుకుంటూ, రాసుకుంటూ స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. నేడు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య జన్మదినం.

ఐఐటి రామయ్యగా తెలుగునాట సుపరిచితులైన చుక్కా రామయ్య 1925, నవంబర్ 20న నాటి నైజాం పాలనలో ఉన్న వరంగల్ సుభాలోని జనగామ తాలూకా  గూడూరు గ్రామంలో అనంత రామయ్య, నరసమ్మ దంపతులకు జన్మించారు. రామయ్య 14వ యేట ఆయన తండ్రి కాలం చేయగా, తల్లి ప్రోత్సాహంతో విద్య మీద మక్కువ పెంచుకున్నారు. ప్రాథమిక విద్యను హన్మకొండలో పూర్తి చేసి, ఆ తర్వాత  హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా కళాశాలలో ఇంటర్మీడియట్, బీఎస్సి డిగ్రీ పూర్తి చేశారు.  

చిన్నతనం నుంచే అభ్యుదయ భావాలను కలిగి ఉండటంతో తమ గ్రామంలో జరిగిన అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని బ్రాహ్మణ సమాజం నుంచి వెలివేయబడ్డారు. అప్పటి నుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. వామపక్ష పార్టీ సిద్ధాంత భావజాలం మీద ఆకర్షితుడై భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. ఔరంగాబద్‌ జైలులో ఉన్న సమయంలోనే అక్కడి అధికారి సహాయంతో సామాజిక, రాజకీయ అవగాహన పెంచే పుస్తకాలు చదివారు. విడుదలైన తర్వాత నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.

నిజాం పాలన ముగిసి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జనగామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన రామయ్య అంచెలంచెలుగా ఎదుగుతూ నాగార్జున సాగర్ లోని రెసిడెన్షియల్ కళాశాలకు ప్రిన్సిపాల్ అయ్యారు. కొత్త వారికి అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో  53 ఏళ్లకే పదవి విరమణ చేశారు. పదవి విరమణ తర్వాత విద్యా రంగం మీదున్న మక్కువతో ప్రయివేటు ఉపాధ్యాయుడిగా పనిచేయడం ప్రారంభించారు.చిన్న నాటి నుంచి లెక్కలు ఎంతో ఆసక్తి ఉండటంతో, గణిత శాస్త్ర టీచర్ గా మారి విద్యార్థులకు ప్రయివేట్ ట్యూషన్లు తీసుకుంటూ వచ్చారు.

1980వ దశకం మధ్యలో ఐఐటి ప్రవేశ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులు సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరుగుతూ రావడంతో, గణితం, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ చెప్పే టీచర్లకు డిమాండ్ పెరిగింది. రామయ్య వద్దకు చాలా మంది గణితం కోసం వచ్చేవారు. ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్న తీరు, ప్రతి కాన్సెప్ట్ అర్ధమయ్యే రీతిలో బోధించడం వల్ల ఆయనకు మంచి పేరు రావడం మొదలయ్యింది. కొంతకాలానికి ఆయనే ఐఐటీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు. మొదటి బ్యాచ్ లో ఎనిమిది మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా వారెవరూ ఎంపిక కాలేదు. అయినా నిరాశపడకుండా, కాన్సెప్ట్స్ ను ఇంకా సింప్లిఫై చేస్తూ తర్వాతి బ్యాచ్ విద్యార్థులకు కాన్సెప్ట్స్ చెప్పడం మొదలు పెట్టిన కొద్దీ కాలానికే, వారందరూ ఐఐటీల్లో సీట్లు సాధించారు.

రామయ్య ఐఐటి కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటే ఐఐటిల్లో సీట్ కచ్చితంగా వస్తుందనే నమ్మకం బాగా ఏర్పడటంతో, ఆయన వద్దకు ఎందరో విద్యార్థులు శిక్షణ కోసం వెళ్లేవారు. తన రామయ్య ఇన్‌స్టిట్యూట్ లో చేరేందుకు ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ పరీక్ష కోసం శికణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సంస్థలు కూడా స్థాపించబడ్డాయి. ఐఐటి ప్రవేశ పరీక్షలో తన సంస్థ సాధించిన విజయాల కారణంగా చుక్కా రామయ్య, ఐఐటి రామయ్యగా ప్రసిద్ధి చెందారు.

 నేటి విద్యాబోధన లోపాలు గురించి రామయ్య గారు మాట్లాడుతూ "చదవడం అంటే అక్షరాలు గుర్తుపట్టడం కాదు. వాటిలోని భావాలను అర్థం చేసుకోవడం.సారాన్ని జీవితానికి అన్వయించుకోవడం. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే ప్రయత్నం జరగడం లేదు. టీచర్ల ప్రతిభను పిల్లలు చెప్పే జవాబులతో లెక్క గడుతున్నారు. అలా కాకుండా అధికారులు ఇన్‌స్పెక్షన్‌ అప్పుడు రెండు రోజులు అక్కడే ఉండాలి. తరగతి గదిలో పిల్లలని సమగ్రంగా పరిశీలించాలి. ఈరోజుల్లో ఉపాధ్యాయులు పిల్లలతో చర్చించడం లేదు. పాఠం అంతా చెప్పాక అర్థమైందా..? అంటారు. పిల్లలు తలలు ఊపుతారు. నేనైతే బయటికి వచ్చిన తర్వాత విద్యార్థిని అడిగేవాణ్ని. అప్పుడు అర్థం కాలేదని చెప్పేవాడు. పిల్లలు తమకు అర్థం కావడం లేదని పది మంది ముందు చెప్పలేరు. అందుకే మనం వ్యక్తిగతంగా పర్యవేక్షించాలి. పిల్లల్లో ఆలోచన శక్తిని పెంచే ప్రశ్నలు వేయాలి. వాటి గురించి ఆలోచించే సమయం ఇవ్వాలి. వారు చెప్పిన సమాధానాలపై చర్చించాలి. నేను ప్రాబ్లం ఇచ్చి పిల్లలతోనే సమాధానం చేయించేవాడిని... వారు పలువిధాల దాన్ని పరిష్కరించేవారు. నాకంటే వేగంగా సమాధానాలు కనిపెట్టేవాళ్లు".  

రామయ్య గారు విద్య, విద్యార్థులు, విద్యాబోధన అంశాల మీద అనేక పుస్తకాలు రాశారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలకు గానూ ఆయన ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని పునరుద్ధరణ చేసిన తర్వాత వామపక్ష పార్టీల మద్దతుతో టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసనమండలి సభ్యుడిగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు సంబంధించిన అంశాల మీద మాట్లాడేవారు. అలాగే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమానికి మద్దతు పలికారు. ఇప్పటికి 9 పదులు వయస్సులో సైతం యాక్టివ్ గా ఉంటూ ఎడ్యుకేషన్ సెమినార్లలో పాల్గొంటున్నారు.  

 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)      

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com