రాజకీయ దురంధరుడు-నలమోతు
- November 21, 2024
ఆయన మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోని స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు రాజకీయాల్లో అడుగుపెట్టి జనహృదయ నేతగా నిలిచారు. ఉమ్మడి మద్రాస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉచ్చ దశలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొడచూపిన నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన తోలి తరం నాయకుడు మాజీ మంత్రి నలమోతు చెంచు రామానాయుడు. తాను చేపట్టిన ప్రతి పదవికి సంపూర్ణ న్యాయం చేసిన అతి కొద్దీ మంది నేతల్లో ఆయన ఒకరు.
ఉమ్మడి మద్రాస్ మరియు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నాయుడు గారిగా ప్రసిద్ధి గాంచిన రాజకీయ దురంధరుడు నలమోతు చెంచు రామానాయుడు ఆనాటి ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని అవిభక్త నెల్లూరు జిల్లాలోని జరుగుమల్లి తాలూకా చింతలపాలెం గ్రామంలోని(నేడు ఆ గ్రామం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో ఉంది) సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు.
ఆయన మేనమామ పోతుల బుచ్చప్ప నాయుడు నాటి మద్రాస్ ప్రావిన్స్ లో శాసనసభ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేత. విద్యార్థి దశలోనే గాంధీజీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. మేనమామ ప్రోద్బలంతో 1936లో కాంగ్రెస్ పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగి నాటి జాతీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు నేరిపారు. 1936- 38 వరకు జరుగుమల్లి పంచాయతీ బోర్డు అధ్యక్షుడిగా , 1938-42 వరకు నెల్లూరు జిల్లా బోర్డు ఉపాధ్యక్షుడిగా, 1949-53 వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పనిచేసిన నాయుడు గారు నెల్లూరు జిల్లా అభివృద్ధికి బాటలు వేశారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉదయగిరి, కందుకూరు, కనిగిరి, కొండపి తాలూకాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ముఖ్యంగా కందుకూరు తాలూకా నందు జస్టిస్ పార్టీలో కీలకమైన పాత్ర పోషిస్తున్న ఉళ్లపాలెం గ్రామ జమిందారీ కుటుంబానికి చెందిన అబ్బాయ్ నాయుడు లాంటి ఆగర్భ శ్రీమంతుడు, రాజకీయ బలవంతుడిని ఢీ కొట్టి మారి పార్టీని విస్తరించారు. తన బంధువు కామేపల్లి మునుసుబు, కొండపి మాజీ ఎమ్మెల్యే చాగంటి రోశయ్య నాయుడు సహకారంతో కందుకూరు, కనిగిరి, కొండపి ప్రాంతాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగారు.
నెల్లూరు జిల్లాలో రాజకీయ ఆధిపత్యం కోసం సంపన్న జమిందారీ వర్గలైన బెజవాడ, తిక్కవరపు, మేనకూరు, పెళ్లుకూరు కుటుంబాలతో పోటీగా నెల్లూరు కేంద్రంగా ఉన్న ఏసి సుబ్బారెడ్డికి నాయుడు గారి సహకారం ఉండేది. ఏసి సుబ్బారెడ్డి నెల్లూరు మున్సపాలిటీకే పరిమితమై ఉన్న సమయంలోనే నాయుడు నెల్లూరు జిల్లా బోర్డు ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఏసి రాజకీయ ఎదుగుదల కోసం నాయుడు గారు తెరవెనుక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే తర్వాత కాలంలో జిల్లా రాజకీయాల్లో నియంతృత్వ పోకడలకు పాల్పడిన ఏసి ని ధిక్కరించి ఆయనకు వ్యతిరేకంగా పోరాడారు.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో రాజగోపాలాచారి, టంగుటూరి ప్రకాశం పంతులు, పూసపాటి కుమారస్వామి రాజా వంటి నాయకులతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆచార్య రంగా, నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు వంటి పలువురు నేతలతో ఆయన మైత్రిని నడిపారు. నీలం తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంలో తన వంతు పాత్ర పోషించారు.
1952 లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి మొదటి సారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. అనంతర కాలంలో 1955 లో కొండపి నుండి, 1962, 1967లలో కందుకూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేడు రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన మరియు కీలకమైన కందుకూరు, కొండపి నియోజకవర్గాలకు తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిగా నాయుడు చరిత్ర సృష్టించారు.
1967-1972 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు మంత్రి వర్గాల్లో అటవీ, మున్సిపల్ , చేనేత శాఖల మంత్రిగా పనిచేశారు. రాజకీయ దిగ్గజం ఆలపాటి వెంకట్రామయ్య తర్వాత పురపాలక శాఖను అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తిగా నాయుడు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖ పరిధిలో ప్రాథమిక , హైస్కూళ్ళ నిర్మాణాలు ఆయన హయాంలోనే జరిగాయి. ఇవే కాకుండా ప్రజలకు మేలు చేయని విధంగా పలు అసంబద్ధ జీవోలను రద్దు చేశారు.
మంత్రిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు, కనిగిరి, కొండపి, దర్శి తాలూకాల ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారు. ఈ ప్రాంతాల్లో ప్రజల సాగు, త్రాగు నీటి అవసరాల కోసం సోమశిల , రాళ్ళపాడు ప్రాజెక్ట్ కాలవల విస్తరణ, మోపాడు రిజర్వాయర్, కనిగిరి రిజర్వాయర్ వంటి పలు నీటి పారుదల ప్రాజెక్ట్స్ నిర్మాణాలు ఆయన హయంలోనే జరిగాయి. నేడు ఆ ప్రాజెక్టుల ఆయకట్టు కింద నేటి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని లక్షల ఎకరాల భూములు సాగవుతున్నయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏర్పాటులో సైతం తన వంతు పాత్ర పోషించారు.
తన తరం నాయకుల్లా కాకుండా రాజకీయాల్లో ఎంతో మంది మధ్యతరగతి, రైతాంగ వర్గానికి చెందిన యువకులను ప్రోత్సహించారు. మాజీ స్పీకర్ మరియు మాజీ మంత్రి దివి కొండయ్య చౌదరి, మాజీ మంత్రి ఆనం సంజీవ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యేలు మానుగుంట ఆదెయ్య (ప్రస్తుత కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి తండ్రి గారు), నువ్వుల వెంకటరత్నం నాయుడు (రాపూరు), గొట్టిపాటి కొండప నాయుడు(కావలి), నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (వెంకటగిరి), ధనేకుల నరసింహం(ఉదయగిరి) వంటి ఎందరో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు.
సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఏనాడు ఇతర పార్టీల నాయకులను వ్యక్తిగత శత్రువుల్లా భావించలేదు. అలాగే, కాంగ్రెస్ పార్టీలో తన అభివృద్ధిని చూసి అసూయ చెందిన నాయకులను ఎప్పుడూ పట్టించుకోలేదు. తమ పిల్లల ఉద్యోగాలు లేదా వ్యక్తిగత పనులు కోసం ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా చేసి పెట్టేవారు. తనని రాజకీయ ప్రత్యర్థిగా భావించే మాజీ మంత్రి రొండా నారపరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పులి వెంకట్ రెడ్డి వంటి నేతలకు సైతం రాజకీయంగా సహాయపడ్డారు. మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో తప్పులు వెతికి, ఆయన్ని రాజకీయంగా విమర్శించాలని కంకణం కట్టుకున్న పలువురు నేతలు అనేక మార్లు భంగపాటుకు గురయ్యారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏర్పాటుకు చెంచు రామానాయుడు ఎంతో కృషి చేశారు. పివి నరసింహారావు సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా (గిద్దలూరు, మార్కాపురం, కంభం అసెంబ్లీ సెగ్మెంట్స్), ఉమ్మడి నెల్లూరు జిల్లా (కందుకూరు, కనిగిరి, కొండపి,దర్శి అసెంబ్లీ సెగ్మెంట్స్), ఉమ్మడి గుంటూరు(అద్దంకి, ఒంగోలు,పర్చూరు, చీరాల,సంతనూతలపాడు అసెంబ్లీ సెగ్మెంట్స్ )లలో ఉన్న కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ ను కలిపి 1970లో ఒంగోలు కేంద్రంగా ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేయించడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ జిల్లా ఏర్పాటు కోసం గిద్దలూరుకు చెందిన అప్పటి రాష్ట్ర స్పీకర్ పిడతల రంగారెడ్డితో కలిసి పనిచేశారు.1972 నాటికీ ఒంగోలు జిల్లాను ప్రకాశం జిల్లాగా పేరు మార్చడం జరిగింది.
తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో రాజకీయ అటుపొట్లను ఎదుర్కున్నారు. ఏసి సుబ్బారెడ్డిని ఎదురించడంతో మొదలైన రాజకీయ సవాళ్ళు ఆయన చివరి దశ వరకు వివిధ రూపాల్లో కొనసాగాయి. తాను ఎంతో నమ్మిన దివి కొండయ్య చౌదరి, మానుగుంట ఆదినారాయణ రెడ్డిలు సైతం ఎన్నికల్లో తన ఓటమి కోసం పనిచేసినా ప్రజా బలంతో విజయాలు సాధించారు.అయితే 1972లో జరిగిన ఎన్నికల్లో మాత్రం నాటి రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల సహకారంతో వీరిద్దరూ కలసి ఆయన్ని ఓడించడంలో సఫలికృతం అయ్యారు. అయినా అధైర్య పడకుండా తన చివరి శ్వాస వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







