ఆధ్యాత్మిక గాయని-శోభారాజు
- November 30, 2024అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేసిన వారిలో అగ్రభాగాన నిలుస్తారు పద్మశ్రీ శోభారాజు. ఆ పదకవితా పితామహుని కీర్తనల ప్రచారానికి జీవితాన్ని అంకితం చేశారామె. కేవలం విని ఆనందించేందుకే కాదు, కష్టంలో ఉన్న వ్యక్తి సాంత్వన పొందేందుకు, సమాజంలో మార్పు సాధించేందుకు, తద్వారా ప్రపంచ శాంతి స్థాపనకు సంగీతం ఉపయోగపడుతుందని బలంగా నమ్మడంతో పాటు ప్రయోగాత్మకంగా నిరూపించారామె. సంగీత విశ్వవిద్యాలయం ద్వారా వ్యక్తి వికాసంతో పాటు సమాజ సంక్షేమానికి నడుం కట్టిన డాక్టర్ శోభారాజు జన్మదినం ఈరోజు.
శోభారాజు 1957 నవంబర్ 30న చిత్తూరు జిల్లా వాయల్పాడులో జన్మించారు. ఆమె తండ్రి నారాయణ రాజు ప్రభుత్వోద్యోగి. తండ్రి ద్వారా ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరుచుకుంది. తల్లి రాజ్యలక్ష్మి పాటలు పాడేది. తల్లి ఆమెకు తొలి గురువు. ఆమె తాత కూడా వయొలిన్ వాయించేవాడు. ఆమె మావయ్యలకు కూడా సంగీత పరిజ్ఞానం ఉండేది. పైగా వాళ్ళు హరికథకులు కూడా!
నాలుగేళ్ళ వయసు నుంచే స్వంతంగా కూడా పాటలు సాధన చేయడం ప్రారంభించారు. తండ్రి చిత్తూరులో బ్లాక్ డెవలప్మెంటు అధికారిగా పనిచేస్తున్నపుడు డెప్యుటేషన్ మీద కొద్ది రోజులు కుటుంబంతో సహా నేపాల్లో నివాసం ఉన్నారు. చిన్నప్పటి నుంచి కృష్ణుడి మీద భక్తి కలిగిన ఆమె ఆయన మీద నేపాలీ భాషలో తొలిపాట రాసింది. అలా ఆమె సంగీత ప్రయాణం మొదలైంది.
వయెలిన్, కర్నాటక సంగీతాల్లో శిక్షణ తీసుకున్నాను. స్కూలు చదివే రోజుల నుంచి కృష్ణుడితో అనుబంధం ఎక్కువ. తిరుపతిలో డిగ్రీ చదివే రోజుల్లో కృష్ణభక్తి ... వేంకటేశ్వరుని భక్తిగా మారింది. అన్నమయ్య కీర్తనల్లో వున్న లాలిత్యం, సమాజహితం, గొప్ప తత్వం ఆమెను మంత్ర ముగ్ధం చేశాయి. ఎక్కడికి వెళ్లినా ఒకటి రెండు సినిమా పాటలు పాడినా, అన్నమయ్య కీర్తనలు తప్పక పాడేదాన్ని. సంగీతం కూడా నేర్చుకోవడంతో పాఠశాల, కళాశాలల్లో ఏ పోటీల్లో పాల్గొన్నా బహుమతులన్ని ఆమెవే.
1976లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్య ప్రాజెక్టులో భాగంగా ఆయన కీర్తనలకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు వీలుగా ఆమెకు ఉపకారవేతనం మంజూరు చేశారు. అప్పటికే ఆమెకు సినిమా అవకాశాలు తలుపు తడుతున్నా అన్నమాచార్య కీర్తనలు ప్రాచుర్యం చేయడానినే నిర్ణయించుకుంది. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర కర్ణాటక సంగీతంలో ఉన్నత స్థాయి శిక్షణ పొందింది. ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఎస్. రాజేశ్వరరావు చెన్నైకు ఆహ్వానించి రెండు పాటలను కూడా రికార్డు చేశారు. అన్నమాచార్య ప్రాజెక్టు తర్వాత 1982లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రామదాసు ప్రాజెక్టులో పనిచేశారు.
1983లో అన్నమాచార్య భావనా వాహిని అనే పేరుతో స్వంతంగా ప్రాజెక్టు ప్రారంభించారు. ప్రతి ఏటా అన్నమయ్య వర్ధంతితో పాటు జయంతి, నగర సంకీర్తనం, సంగీత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేలాది మందికి ఉచితంగా సంగీతంలో శిక్షణ ఇచ్చారు. మనుషుల్లో మానసిక పరివర్తన కోసం కూడా సంగీతం ఉపయోగపడుతుందని జైళ్ళకు వెళ్ళి సంకీర్తనలు గానం చేశారు. తంజావూరులోని సరస్వతి గ్రంథాలయంలో పరిశోధన చేసి మరుగున పడిఉన్న 39 అన్నమయ్య సంకీర్తనలు వెలుగులోకి తీసుకువచ్చారు.
భారత ప్రభుత్వం అన్నమయ్యపై తపాలా బిళ్ళ విడుదల చేసేందుకు శోభ కృషి చేశారు. ట్యాంక్‌బండ్ మీద అన్నమయ్య విగ్రహ స్థాపన కోసం కృషి చేశారు. కేవలం భారతదేశంలోనే కాక అమెరికా, బ్రిటన్, కెనడా లాంటి దేశాల్లో కూడా అన్నమయ్య పాటలకు ప్రాచుర్యం తీసుకువచ్చారు. అన్నమయ్య టెలీ సీరియల్ కు రచన, మాటలు, సంగీతంతో పాటు దర్శకత్వం వహించారు.
2010లో కళారంగంలో ఆమె కృషికిగాను భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు పొందారు. 2013లో ఉగాదికి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అందించే హంస పురస్కారాన్ని కూడా అందుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అన్నమాచార్య ప్రాజెక్టు సలహాదారుగా పనిచేయడంతో పాటు దేవస్థాన సంగీత సాంస్కృతిక రంగాల్లో అనేక కీలక పదవులు నిర్వహించారు.
ప్రస్తుత సమాజంలో మన చుట్టూ జరుగుతున్న విపరీత పరిణామాలకు, ఉపద్రవాలకు మూలం చెడు ఆలోచనలు. ఆ ఆలోచనల్ని రూపుమాపి, వాటి స్థానంలో మంచి ఆలోచనలు వచ్చేందుకు తోడ్పడితే సమాజంలో తప్పక శాంతి నెలకొంటుంది. సంగీతంతో ఇది సుసాధ్యం అని నా విశ్వాసం. అందుకే భక్తి సంగీతం ద్వారా భావకాలుష్య నివారణ అనే నినాదంతో నాలుగున్నర దశాబ్దాలుగా పనిచేస్తున్నాను. శతాబ్దాలుగా సంగీత రంగంలో త్యాగయ్య, రామదాసు, ముత్తస్వామి దీక్షితుల వంటి మహనీయుల కీర్తనలు మధురంగా పాడుకునేవాళ్లం. అన్నమయ్య పదాలకు మాత్రం అప్పట్లో అంతగా ప్రచారం లేదు.
కానీ ఈ రోజున అన్నమయ్య పదాలకు విస్తృత ప్రచారం లభించింది. కనీస సంగీత పరిజ్ఞానం ఉన్నవారు కూడా అన్నమయ్య పాటలు పాడుకుంటున్నారు. జ్ఞాన, భక్తి, సరస, వైరాగ్యభరితమైన అన్నమయ్య పదాలపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచానికి తెలియని మరెన్నో అన్నమయ్య కీర్తనలు వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్యకు ఇంతటి ప్రచారం లభించడం నిజంగా తెలుగుపదానికి పట్టాభిషేకంగా భావించాలి. ఆ వేంకటేశ్వరుని కృపాకటాక్షం మూలంగానే ఈ మహాయజ్ఞంలో నేను సైతం కీలక భూమిక పోషిచగలగడం నా అదృష్టం అంటారు ఆమె!
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్‌గాన్ పిల్స్ సీజ్..!!