'విజయా'ల సారథి-నాగిరెడ్డి

- December 02, 2024 , by Maagulf
\'విజయా\'ల సారథి-నాగిరెడ్డి

తెలుగు చిత్రసీమలో మరపురాని, మరచిపోలేని చిత్రాలను అందించిన సంస్థగా ‘విజయా ప్రొడక్షన్స్’ నిలచిపోయింది.ఆ సంస్థ సారథులు బి.నాగిరెడ్డి–చక్రపాణి కూడా జనం మదిలో అలాగే సుస్థిర స్థానం సంపాదించారు.ఒకే ఆత్మ రెండు శరీరాలుగా నాగిరెడ్డి, చక్రపాణి మసలుకున్నారు.భావితరాలకు ఆదర్శంగా నిలిచారు.చక్రపాణిది ఆలోచన అయితే, దానిని ఆచరించడంలో నాగిరెడ్డి మేటిగా నిలిచేవారు.స్నేహబంధానికి మారుపేరుగా నిలచిన వీరిద్దరూ విలువలకు పట్టం కడుతూ చిత్రాలను నిర్మించారు.అందుకే ఈ నాటికీ ప్రేక్షకులు బి.నాగిరెడ్డిన- చక్రపాణి ద్వయాన్ని స్మరించుకుంటూ ఉన్నారు. వారిలో నేడు బి.నాగిరెడ్డి 112వ జయంతి.

బి.నాగిరెడ్డి పూర్తిపేరు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. 1912 డిసెంబర్ 2న కడప జిల్లాలోని పొట్టిపాడు గ్రామంలో జన్మించారు.ఆయన అన్న బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి చిత్రసీమలో బి.యన్.రెడ్డిగా సుప్రసిద్ధులు. బి.యన్. రెడ్డి దర్శకనిర్మాతగా సాగుతున్న సమయంలో నాగిరెడ్డి, తన తండ్రి వద్ద ఉంటూ వ్యాపారం చూసుకొనేవారు. వారి కుటుంబ వ్యాపారాలు ఆ రోజుల్లో బర్మాదాకా సాగేవి. ఆ వ్యవహారాలు చూసుకుంటూనే తన అభిరుచికి తగ్గట్టుగా ‘ఆంధ్రజ్యోతి’ అనే పత్రికను నడిపారు. తరువాత అన్న బి.యన్.రెడ్డి చిత్రాలకు ప్రచారకర్తగా పలు కొత్త పుంతలు చూపారు. ఓ సినిమా ఓ ఊరిలో ఆడుతూ ఉంటే, ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎడ్ల బండ్లు కట్టి, వాటికి సదరు సినిమాల పోస్టర్స్ అతికించి ప్రచారం చేయించేవారు. అదే పంథాను తరువాతి రోజుల్లో అందరూ అనుసరించడం విశేషం.

నాగిరెడ్డికి మద్రాసులోనే ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. అక్కడకు చక్రపాణి తన రచనలు అచ్చు వేయించుకోవడానికి వచ్చేవారు. అలా వారిద్దరి మధ్య స్నేహబంధం కుదిరింది. అది అనతికాలంలోనే బలపడింది. ఇద్దరి అభిరుచులూ కలిశాయి. సాహిత్యం, సినిమాలపై చర్చించుకుంటూ ఉండేవారు. వారిద్దరూ కలసి ‘చందమామ’ బాలల పత్రికను స్థాపించారు. 1947లో మొదలైన ‘చందమామ’ తరువాతి కాలంలో ఆబాలగోపాలాన్నీ విశేషంగా ఆకట్టుకుంది. 14 భాషల్లో ‘చందమామ’ వెలుగు చూసింది.

నాగిరెడ్డి కూతురు విజయ పేరు మీద విజయా ప్రొడక్షన్స్ నెలకొల్పారు నాగిరెడ్డి, చక్రపాణి. తమ అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మించాలని నాగిరెడ్డి, చక్రపాణి తొలి ప్రయత్నంగా ‘షావుకారు’ నిర్మించారు. ఈ నాటికీ ‘షావుకారు’ చిత్రం జనాన్ని ఆకట్టుకుంటూనే ఉంది. దీని తరువాత ఆ రోజుల్లో భారీగా నిర్మించిన ‘పాతాళభైరవి’ జానపదం తెలుగు చిత్రసీమలో తొలి స్వర్ణోత్సవ చిత్రంగా నిలచింది. ‘పాతాళభైరవి’ని తమిళంలోనూ తెరకెక్కించారు. అప్పటి నుంచీ విజయా సంస్థ నిర్మించే చిత్రాలను ద్విభాషల్లో రూపొందించేవారు. నాగిరెడ్డి చక్రపాణి నిర్మించిన “పెళ్ళిచేసిచూడు, మిస్సమ్మ, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మ కథ, సి.ఐ.డి.” విశేషాదరణ చూరగొన్నాయి.ఈ చిత్రాలన్నిటా ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఆయనతోనే విజయా సంస్థ “చంద్రహారం, సత్య హరిశ్చంద్ర, ఉమాగౌరీచండీ శంకరుల కథ” వంటి పలు చిత్రాలను కూడా నిర్మించింది.

విజయా సంస్థ ఎన్టీఆర్ తో నిర్మించిన వాటిలో విజయం సాధించిన తొమ్మిది చిత్రాలను ‘నవరత్నాలు’గా భావించేవారు. ఆయన హీరోగా విజయా సంస్థ నిర్మించిన రెండు సినిమాలు తొలుత విజయం సాధించక పోయినా, తరువాతి రోజుల్లో విశేషాదరణ చూరగొన్నాయి.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నాగిరెడ్డి, చక్రపాణి సినిమాలు నిర్మించారు. విజయా సంస్థ నిర్మించిన చిత్రాల ద్వారా ఎందరో మహానటులు తమ అభినయ వైభవం ప్రదర్శించారు. ఇక ఎన్టీఆర్ అంటే నాగిరెడ్డికి ప్రత్యేక అభిమానం.‘విజయవారి విజయసారథి’గా ఎన్టీఆర్ ను అభివర్ణించేవారు నాగిరెడ్డి.

నటరత్న ఎన్టీఆర్ సైతం విజయాధినేతలను బాగా అభిమానించేవారు. తన సినీ ప్రస్థానంలో విజయ సంస్థలో నటించిన చిత్రాలు బ్రహ్మాండమైన రీతిలో ప్రేక్షకులను అలరించాయి. తన సినీగురువైన కె.వి.రెడ్డి గారు పరిచయం అయింది కూడా ఇక్కడే. సంస్థ సారథులైన చక్రపాణి, నాగిరెడ్డి గార్లను తన గాడ్ ఫాదర్స్ అని అనేక మార్లు బహిరంగంగానే చెప్పేవారు. విజయ సంస్థను స్ఫూర్తిగా తీసుకోని తన తమ్ముడు త్రివిక్రమరావు సారథ్యంలో ఎన్.ఏ.టి నిర్మాణ సంస్థను, హైదరాబాద్ నగరంలో రామకృష్ణ సినీ స్టూడియోస్ ను స్థాపించారు.      

విజయావారి ఆస్థాన నటులుగా ఉన్నవాళ్ళు ఎస్వీ.రంగారావు, సూర్యకాంతం, రేలంగి, రమణారెడ్డి తదితరులు. వీరి నటనాప్రతిభ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ కాలంలో నటులు ఇతర సంస్థలు తీసే సినిమాల్లో హీరో వేషం వేయడం కంటే విజయావారి సినిమాల్లో ఎక్స్‌ట్రా వేషం వేయడమే మిన్నగా భావించేవారు. చాలా మంది నటులకు విజయావారి సినిమాల్లో నటించాలనే కోరిక మాయాబజార్తో తీరింది. ఆ సినిమాలో నాటి చిత్రరంగంలోని నటులందరూ కనిపిస్తారు.

అక్కినేని నాగేశ్వరరావుకు విజయావారి సినిమాల్లో నటించే అవకాశం మొదట మిస్సమ్మ సినిమాతో వచ్చింది. చిత్రరంగంలో అడుగుపెట్టడమే హీరోగా అడుగుపెట్టిన ఆయన ఆ సినిమాలో పూర్తిస్థాయి హాస్యపాత్ర పోషించారు. మాయాబజార్ తర్వాత ఆయనకు గుండమ్మకథలో సహనాయకుడి పాత్ర వేసే అవకాశం వచ్చింది. అది ఆయనకు నూరవ సినిమా కూడా. అది గొప్ప అదృష్టంగా భావించిన ఆయన ఆ సినిమాకు పారితోషికం తీసుకోలేదు. కానీ నాగిరెడ్డి ఆయనకు ఇవ్వవలసిన మొత్తాన్ని ఒక విద్యాసంస్థకు విరాళంగా ఇచ్చేశారు.

సినిమా నిర్మాణం కూడా వ్యాపార పరిశ్రమే. పేరుతోపాటు పెన్నిది సమకూర్చేదే సినీ వ్యాపారం అనే సూత్రాన్ని నమ్మి ఆచరించిన వ్యాపారదక్షుడు విజయా సంస్థ అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. యాభై సంవత్సరాలకు పైగా సినిమా అనే అద్భుత కళకి అంకితమైన స్థితప్రజ్ఞుడు నాగిరెడ్డి.తన సినిమా సూత్రాన్ని ‘పాతాళభైరవి’ చిత్రం ద్వారా ‘జనంకోరేది మనం తీయాలిగానీ మనం తీసేది జనం చూడడం కాదు’ అని చెప్పి మరీ సినిమాలు నిర్మించి సమాధానమిచ్చిన మేధావి నాగిరెడ్డి. ఆయన నిర్మించిన చిత్రాలు అధికంగా అంచనాలను మించి ఆర్జించినవే కావడం ఈ సూత్రాన్ని నమ్మి నిర్మించడం వలననే సాధ్యమైంది. ‘మాయాబజార్’ సినిమా కూడా కళాఖండమే…కానీ అది వ్యాపారాత్మక కళాఖండం!! నాగిరెడ్డి కేవలం వాణిజ్యపరంగా మాత్రమే వ్యవహరించేవారు.

ప్రొడక్షన్ పనుల్లో చక్రపాణి చెయ్యిపెడితే నాగిరెడ్డి పెట్టుబడి వ్యవహారాలకే పరిమితమయ్యేవారు. చక్రపాణి తీసుకునే నిర్ణయాలకు ఆయన బద్ధుడై మెలిగేవారు. ‘మిస్సమ్మ’ చిత్రానికి మొదట్లో భానుమతిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. నాలుగు రీళ్ల సినిమా తీశాక భానుమతి ఒకరోజు షూటింగుకు ఆలస్యంగా హాజరైంది. చక్రపాణికి సంజాయిషీ ఇస్తూ ముందురోజే కాగితం రాసి ప్రొడక్షన్ సిబ్బందికి అందజేశానని, వరలక్ష్మివ్రతం కారణంగా ఆలస్యమవుతుందని అందులో పేర్కొన్నానని భానుమతి చెప్పినదానికి చక్రపాణి ఒప్పుకోలేదు.

నిజానికి ఇద్దరూ రచయితలే. ‘ధర్మపత్ని’ సినిమా నుంచి ఇద్దరూ మంచి సాహితీ మిత్రులు. అయినా చక్రపాణి ఉపేక్షించలేదు. భానుమతిని తొలగించి, సావిత్రిని మిస్సమ్మ పాత్రలో పెట్టి సినిమా పూర్తిచేయించారు. నాగిరెడ్డి అందుకు చక్రపాణికి పూర్తి మద్దతు ప్రకటించారు. సమయపాలనకు, క్రమశిణకు వీరిద్దరూ మారుపేర్లే. ఇద్దరూ కృష్ణార్జునులు లాగా వ్యవహరిస్తూ విజయా సంస్థను ముందుకు నడిపారు.

విజయా సంస్థ తెలుగులో నిర్మించిన తొలి రంగుల చిత్రం ‘గంగ-మంగ’. తరువాత చక్రపాణి దర్శకత్వంలో ‘శ్రీరాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ నిర్మించడం ఆరంభించారు. నిర్మాణం ఆరంభం కాగానే చక్రపాణి కన్నుమూశారు. బాపు ఆ సినిమాను పూర్తి చేశారు. మిత్రుడు చక్రపాణి మరణం, నాగిరెడ్డిని కలచి వేసింది. ఆ తరువాత తెలుగులో ఆయన చిత్రాలు నిర్మించలేదు.

1966లో నాగిరెడ్డి ‘విజయచిత్ర’ అనే సినిమా మాసపత్రికను ప్రారంభించారు. రావి కొండలరావు పత్రికా సారధ్య బాధ్యతలను సహాయ సంపాదకుడిగా ఇరవై ఆరు సంవత్సరాలపాటు మోశారు. ఈ పత్రిక నలభై సంవత్సరాలకు పైగా నడిచింది. ప్రలోభాలకు లొంగని నైజం, నిబద్ధతత, అంకితభావంతో ఈ పత్రిక నడిచింది. ఆహ్లాదంతోపాటు విజ్ఞానం అందజేసే ధ్యేయంతో ఈ విజయచిత్ర తన ఉనికిని చాటుకుంది. తొలి సంచికలోనే ‘విజయచిత్ర’ ఉన్న మంచినే చెబుతుంది, ఉన్నా చెడు చెప్పదు’ అనే సూత్రానికి కట్టుబడి పనిచేసింది. పక్షపాతానికి, మొహమాటానికి, అసభ్యరచనలకి, అవాచ్యమైన రాతలకి ఈ పత్రికలో చోటులేదు. ఇదంతా నాగిరెడ్డి అంకితభావమే!

ఒకవైపు సినిమాలు తీస్తున్నా.. చందమామ పత్రికపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు నాగిరెడ్ది. ఆ పత్రిక సాధించిన ఊహించని విజయంతో విజయచిత్ర, వనిత లాంటి పత్రికలు కూడా ప్రారంభించారు. అయితే అవి తర్వాత ఆగిపోయాయి. 1975లో చక్రపాణి మరణించాక, నాగిరెడ్డి గారి జీవితంలో లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. తెలుగులో సినిమాలు తీయడం కూడా తగ్గించారు. 1987లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నాగిరెడ్డిని వరించింది. అదే సంవత్సరం రఘుపతి వెంకయ్య అవార్డు కూడా పొందారు.అంతకు ముందే తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో నాగిరెడ్డిని సత్కరించింది.పలు విశ్వవిద్యాలయాలు నాగిరెడ్డికి డాక్టరేట్లు కూడా అందించాయి.  

నాగిరెడ్డి ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షునిగా నాలుగుసార్లు దక్షతతో కూడిన బాధ్యతలను నిర్వహించారు.ఇందిరా గాంధి, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయి, రాజాజీ, కామరాజనాడార్, నీలం సంజీవరెడ్డి మొదలైన ప్రజానాయకులతో సన్నిహిత సంబంధాలను నెరిపారు.1980లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన ట్రస్టీగా వ్యవహరించారు. ఆ సమయంలోనే  తిరుమలలో ‘వైకుంఠం క్యూ కాంప్లెక్స్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1972లో నాగిరెడ్డి ‘విజయ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ను ఏర్పాటు చేశారు నాగిరెడ్డి. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే మద్రాసులో విజయా హాస్పిటల్, విజయ హెల్త్ కేర్ సెంటర్, విజయా హార్ట్ ఫౌండేషన్ సాగుతున్నాయి.

తమ సంస్థ గత వైభవాలను, తన మిత్రుడు చక్రపాణిని మైత్రిని నెమరువేసుకుంటూ చివరి రోజులు గడిపిన నాగిరెడ్డి గారు అనారోగ్యంతో తన 92వ ఏట 2004, ఫిబ్రవరి 25న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన తనయులు వెంకట్రామిరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి కూడా తండ్రి బాటలోనే కొన్ని చిత్రాలను నిర్మించారు.ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్టూడియోస్ గా విరాజిల్లిన ‘విజయా-వాహినీ స్టూడియోస్’ అధినేతగా, మరపురాని చిత్రాలు అందించిన ‘విజయాధినేత’గా జనం మదిలో నిలచిపోయారాయన.

  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com