సంక్రాంతి తరువాత రైతు భరోసా, ఈ నెల 5న యాప్‌ ప్రారంభం

- December 03, 2024 , by Maagulf
సంక్రాంతి తరువాత రైతు భరోసా, ఈ నెల 5న యాప్‌ ప్రారంభం

- హామీలు అమలు చేయకపోతే ప్రజలు నమ్మరు

- రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశాం, రూ.21 వేల కోట్ల వరకు రుణమాఫీ 

- ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు ఇస్తాం

హైదరాబాద్: ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోవాలంటే ఎన్నికల హామీలను నెరవేర్చాలని లేదంటే ప్రజలు నమ్మరు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో జరిగిన ఒక మీడియా సమావేశంల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రజలు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, వారు మమ్మల్ని నమ్మరు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను పాటించడం చాలా ముఖ్యం. ప్రజల విశ్వాసం పొందడం కోసం, మేము మా హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నాము” అని మంత్రి అన్నారు.

ఇంకా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, గ్రామ సర్పంచ్‌ల ఎన్నికలు, మరియు ఇతర సంక్షేమ పథకాలను గురించి కూడా ఆయన వివరించారు. “సంక్రాంతి తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, గ్రీన్ చానెల్‌లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుంది. లబ్ధిదారుల ఖాతాలో నేరుగా నిధులు జమ చేస్తాం” అని మంత్రి తెలిపారు.


ఎన్నికల హామీలో భాగంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన 
ప్రభుత్వం ఈ హామీని పూర్తిగా నెరవేర్చామని తెలిపారు. ఇప్పటికే రూ.21 వేల కోట్ల వరకు రుణమాఫీ చేసి, ప్రజల సంక్షేమం పట్ల తమ కట్టుబాటును చూపించిందనీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

సంక్రాంతి తరువాత రైతులకు భరోసా పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ పథకం రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించి, వారి సంక్షేమాన్ని నిర్ధారించడమే లక్ష్యం అన్నారు. ఈ పథకం అమలు కోసం ఈ నెల 5న కొత్త యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు పొంగులేటి ప్రకటించారు. ఈ యాప్ ద్వారా వివిధ ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ పథకం కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడం ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద ప్రతి ఎకరాకు రూ. 15,000 అందజేస్తారు. ఈ సాయం రైతుల పంటల సాగు ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఈ పథకం అమలు విధివిధానాలను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం రైతుల అభిప్రాయాలను సేకరించి, పథకం అమలు విధివిధానాలను రూపొందించింది. ఈ విధివిధానాల రూపకల్పనలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల వారీగా రైతుల అభిప్రాయాలను సేకరించింది.

ఇల్లు లేని సమస్యను పరిష్కరించడానికి, ప్రతి నియోజకవర్గంలో దశల వారిగా 3,500 ఇళ్లు కేటాయిస్తామని పొంగులేటి తెలిపారు. ఇలా, ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోవడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యను వివరించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు ప్రజలు సహకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలను కోరారు.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com