విలువలకు మారుపేరు బాబు రాజేంద్ర ప్రసాద్

- December 03, 2024 , by Maagulf
విలువలకు మారుపేరు బాబు రాజేంద్ర ప్రసాద్

ఇండియా రిపబ్లిక్ దేశంగా అవతరించిన తర్వాత మొదటి రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆ పదవిలో ఉన్నంత కాలం తన విధుల పట్ల చూపించిన నిజాయితీ నిబద్ధతల వల్ల భారతీయుల అభిమానాన్ని చురగొని ఆ పదవికే వన్నె తెచ్చిన రాజకీయ వేత్తగా పేరు తెచ్చుకున్నారు.రాష్ట్రపతి కాక ముందు దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్లారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి అధ్యక్షత వహించారు.రాష్ట్రపతిగా తనకున్న పరిమితిని అతిక్రమించకుండా దేశాభివృద్ధికి పాటుపడిన మహనీయుడు.నేడు ఇండియా      
మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ 140వ జయంతి.

రాజన్ బాబుగా సుప్రసిద్దిలైన డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ 1884 డిసెంబర్ 3న బిహార్ లోని జీరాడి గ్రామంలో మహదేవ్ సహాయి, కమలేశ్వరిదేవి దంపతులకు జన్మించారు. వీరు ధనికులైనా నిరాడంబర జీవితాన్ని సాగించేవారు.రాజేంద్రప్రసాద్ జీవితమంతా బిహార్ పౌరుడిగా గడిపినా ఆయన పూర్వీకులు మాత్రం ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుతున్న సమయంలోనే రాజన్ బాబు నాయకత్వ లక్షణాలకు ఆకర్షితులైన విద్యార్థులు స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శిగా భారీ మెజారిటీతో గెలిపించారు. 1910లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఆయన న్యాయ శాస్త్రంలో పట్టభద్రులయ్యారు.  

1917 వరకు కలకత్తా, బిహార్ న్యాయస్థానాలలో న్యాయవాదిగా గడిపారు. రాజేంద్ర ప్రసాద్ న్యాయ పరిజ్ఞానం, వాదనా పటిమలు విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ జస్టిస్ అశుతోష్ ముఖర్జీని ఆకట్టుకోవడంతో యూనివర్సిటీ ‘లా’ విభాగంలో అధ్యాపకునిగా చేరామన్న నిర్ద్వందంగా తిరస్కరించి లాయర్ గానే కొనసాగారు. బిహార్‌లోని ‘చంపారన్‌’ రైతుల దుస్థితిని స్వయంగా పరిశీలించడానికి 1917లో వచ్చిన మహాత్మాగాంధీ వ్యక్తిత్వానికి ఆకర్షితుడైన రాజేంద్రప్రసాద్ ఆయనకు అనుయాయిగా మారారు. అంతవరకు ఆడంబర జీవితం గడిపిన రాజేంద్రప్రసాద్ ఒక్కసారిగా నిరాడంబరుడిగా, సంఘ సేవకుడిగా, ఉదార స్వభావుడిగా రూపాంతరం చెందారు.

మహాత్ముడు 1919లో దేశవ్యాప్తంగా ఇచ్చిన ‘సత్యాగ్రహం’ పిలుపును పురస్కరించుకుని ప్రజా చైతన్యమే లక్ష్యంగా బిహార్‌లోని అన్ని వర్గాల ప్రజలను సమీకరించి సత్యాగ్రహోద్యమాన్ని విజయవంతం చేశారు రాజేంద్రబాబు. బహిరంగ సభలను నిర్వహించి ప్రజలలో చైతన్య దీపికలను రగిలించారు. సహాయ నిరాకరణోద్యమంలో పాలుపంచుకునేందుకు 1920లో న్యాయవాద వృత్తిని, పాట్నా విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యత్వాలను త్యాగం చేశారు. 1921లో ప్రభుత్వ కళాశాలలను బహిష్కరించమని పిలుపునిచ్చి, అదే సంవత్సరం జనవరి 5న తన స్వగృహంలోనే జాతీయ కళాశాలను ప్రారంభించారు. తన జీవితాంతం అనేక విద్యా సంస్థలతో సంబంధ, భాంధవ్యాలను ఏర్పరచుకొని విద్యారంగానికి ఎనలేని సేవలు అందించారు.

రాజేంద్రప్రసాద్ జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా 1923లో పదవీ భాధ్యతలు చేపట్టారు. 1928లో విదేశీ యాత్రలు ప్రారంభించి అక్కడి ప్రజలతో యుద్ధ వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టారు. భారతదేశ ఉద్యమాల గురించి బహుళ ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ‘సైమన్ గో బ్యాక్’ పిలుపు అందుకొని రాజ్యాంగ సంస్కరణల కమిటీ బహిష్కరణోద్యమాన్ని బిహార్‌లో సమర్థంగా నిర్వహించారు. అనేకసార్లు బ్రిటిష్ ఖాకీల దౌర్జన్యానికి గురయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నడిపారు. 1934 నుంచి 1940 వరకు కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వర్ణోత్సవాలను 1935లో సమర్థంగా నిర్వహించారు. అదే సంవత్సరంలో ‘సంపూర్ణ స్వరాజ్యం’ కోసం పిలుపునిచ్చారు.

1939లో కాంగ్రెస్ నాయకులను సంప్రదించకుండా యుద్ధం ప్రకటించినందుకు నిరసనగా ప్రాంతీయ ప్రభుత్వాల నుంచి కాంగ్రెస్ వాదులు అందరినీ రాజీనామా చేయించారు. అలా యుద్ధ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టారు. 1941 మే నెలలో ఉవ్వెత్తున లేచిన మత కలహాలను తన చర్యల ద్వారా, వాగ్ధాటితో అదుపు చేశారు. బాధితులను స్వయంగా పరామర్శించి కాంగ్రెస్ సేవా దళాలను స్థాపించి ఆదుకున్నారు.

1946లో నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఆహార & వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు కృషి చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు ‘గ్రో మోర్ ఫుడ్’ అనే నినాదాన్ని ఇచ్చారు. 1946 డిసెంబరు 11న రాజ్యాంగ సభకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం తయారీ కోసం ఏర్పడ్డ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.  

1950, జనవరి 26న భారతదేశ రిపబ్లిక్ దినోత్సవం నాడు భారతదేశ తోలి రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. భారతదేశానికి అధ్యక్షునిగా రాజ్యాంగం ప్రకారం భాద్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి చెందకుండా స్వతంత్రుడిగా వ్యవహరించడం ఆయన హయాంలోనే మొదలైంది. 1950-62 వరకు రాష్ట్రపతిగా కొనసాగిన ఆయన ప్రపంచం నలుదిశలా భారతదేశ కీర్తిని వ్యాప్తి చేయడంలో కృషి చేశారు. అధికార వ్యవస్థలో నెహ్రూ నిరంకుశ ధోరణిని, హిందూ వ్యతిరేక వైఖరిని బహిరంగంగానే ఖండించారు. భారత విద్యారంగాన్ని కలుషితం చేసే మేధావులకు నెహ్రూ పెద్దపీట వేయడాన్ని ఆయన బాగా కలచి వేసింది.

విద్యారంగాన్ని వామపక్ష మాయం చేసిన నెహ్రూ మీద సదభిప్రాయంతో ఉండేవారు మాత్రం కాదు. అధికారంలో ఉంటూ నెహ్రూ తనకు తానుగా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించుకోవడాన్ని ఆక్షేపించారు. 1957లో భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన్ని ఓడించేందుకు నెహ్రూ వేరే అభ్యర్థిని నిలబెట్టినా, సునాయాసంగా విజయం సాధించి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. నెహ్రూ వ్యవస్థల మీద పట్టు కోల్పోతున్న దశలో ఆయన అహంకారాన్ని అణచడంలో రాజేంద్ర ప్రసాద్ చాలా కీలకంగా వ్యవహరించారు. భారత దేశంలో సహకార వ్యవసాయ పద్దతిని ప్రవేశపెట్టాలని ఉవ్విళ్ళూరిన నెహ్రూ ఆశలను అడియాసలు చేయడంలో ఆచార్య రంగా, తెరవెనుక రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. 12 సంవత్సరాల పాటు భారత దేశ రాష్ట్రపతిగా సేవలందించి 1962,మే 14న పదవీ విరమణ చేశారు. అనారోగ్యం కారణంగా 78 ఏట 1963,ఫిబ్రవరి 28న కన్నుమూశారు.    

  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com