రాజకీయ చాణక్యుడు-ప్రణబ్ ముఖర్జీ
- December 11, 2024
ప్రణబ్ ముఖర్జీ.. భారత రాజకీయాల్లో ఓ భీష్మ పితామహుడు. ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను, ఎత్తుపల్లాలను తట్టుకొని ఆదర్శనేతగా ఎదిగారు. నిరంతర అధ్యయనం, నిత్య పరిశ్రమ, విషయ పరిజ్ఞానం, నేర్పు, ఓర్పు, సంయమనం, సమయోచితంగా వ్యవహరించడం, దీక్షాదక్షతలో భారత రాజకీయాల్లో ఆయనకు సరిలేరెవ్వరూ. ప్రత్యర్థులను తన వాక్పటిమతో ఒప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. చేపట్టిన పదవులకు తనదైన పనితీరుతో వన్నెతెచ్చిన నాయకుడు. నేటి తరం నాయకులకు ప్రణబ్ ఆదర్శనీయం. సాధారణ క్లర్క్ స్థాయి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన ఆయన ప్రస్థానం చిరస్మరణీయం. నేడు రాజకీయ చాణక్యుడు, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారి 89వ జయంతి.
ప్రణబ్ దాగా, ప్రణబ్ బాబుగా భారతదేశ రాజకీయాల్లో సుపరిచితులైన ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న బెంగాల్‌లోని బీర్భమ్ జిల్లా మిరాటీలో కమద కింకార్ ముఖర్జీ, రాజలక్ష్మీ దంపతులకు జన్మించారు. సురిలోని సురి విద్యాసాగర్ కాలేజీ నుంచి హిస్టరీలో డిగ్రీ, కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ మరియు ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. ఆ తర్వాత కొద్దీ కాలం కలకత్తా పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్ కార్యాలయంలో క్లర్క్ గా పనిచేశారు. అనంతరం కలకత్తా దగ్గర్లోని విద్యానగర్ పట్టణంలో ఉన్న విద్యానగర్ ప్రభుత్వ కళాశాలలో పనిచేశారు. ఇదే సమయంలో "దేశ్ దాక్" సాయంకాల పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు.
ప్రణబ్ తండ్రి కమద కింకార్ ముఖర్జీ స్వాతంత్ర సమరయోధులు మరియు బెంగాల్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. బెంగాల్ మొదటి సీఎం డాక్టర్ బిసిరాయ్, నెహ్రూలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవారు. 1952-64 వరకు బెంగాల్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. తండ్రి స్పూర్తితోనే విద్యార్ధి రాజకీయాల్లోకి ప్రవేశించి వామపక్ష విద్యార్ధి సంఘంలో పనిచేశారు. ప్రణబ్ నాయకత్వ లక్షణాలను గుర్తించిన అజోయ్ ముఖర్జీ తన పార్టీ బంగ్లా కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి ప్రణబ్ తన రాజకీయ ప్రయాణాన్ని బంగ్లా కాంగ్రెస్ తరపున ప్రారంభించారు. 1966-71 వరకు బంగ్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
1967 సార్వత్రిక ఎన్నికల సమయంలో బంగ్లా కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయడంలో ప్రణబ్ ముఖర్జీ కీలకంగా వ్యవహరించారు. 1969లో రాజ్యసభకు ఎన్నికవ్వడం ద్వారా ప్రణబ్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజ్యసభలో బ్యాంకుల జాతీయకరణ గురించి చేసిన ప్రసంగాన్ని విన్న నాటి ఇందిరా గాంధీ ఆయన్ని అభినందించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, బంగ్లా కాంగ్రెస్ అధినేత, తన రాజకీయ గురువైన అజోయ్ ముఖర్జీని విడవడం ఇష్టం లేని ప్రణబ్, ఆమె ప్రతిపాదనను ఆయన వద్ద ఉంచగానే కాంగ్రెస్ పార్టీలో చేరమని అజోయ్ ఆయన్ని ప్రోత్సహించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రణబ్, తనతో పాటుగా 1971 నాటికి బంగ్లా కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించారు.1973లో ఇందిరా మంత్రివర్గంలో కేంద్ర పరిశ్రమల శాఖ ఉపసహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రణబ్, ఆ తర్వాత కొద్దీ కాలానికే ఎమెర్జెన్సీ విధించిన సమయంలో 1976-77 వరకు వాణిజ్య శాఖ సహాయ మంత్రిత్వ శాఖను నిర్వహించారు. 1979-80 వరకు ఇందిరా కాంగ్రెస్ తరపున రాజ్యసభ పక్ష ఉపనేతగా, 1980-82 వరకు వాణిజ్య శాఖ మంత్రిగా, 1980-84 వరకు రాజ్యసభ పక్ష నేతగా పనిచేశారు.1982-84 వరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ప్రణబ్, ఇందిరా ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి ఆమె మెప్పును పొందారు.
1984-88 వరకు ప్రణబ్ రాజకీయంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారు. ఇందిరా మరణంతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీతో వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా ప్రణబ్ రాజకీయంగా నష్టపోయారు. రాజీవ్ చూపించిన వివక్ష కారణంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ పార్టీని పెట్టి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని రాజకీయంగా తెరమరుగయ్యే దశలో రాజీవ్ మళ్ళీ ఆపన్న హస్తాన్ని అందించడం ద్వారా తిరిగి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు. 1988 త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో ప్రణబ్ కీలకంగా వ్యవహరించారు.
1989-91 వరకు ప్రణబ్ బెంగాల్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే పనిలోనే నిమగ్నమై ఉన్నారు. 1991లో చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో సైతం ప్రణబ్ పాత్ర కీలకం. 1991 సార్వత్రిక ఎన్నికల ప్రచారం చేస్తూ రాజీవ్ హఠన్మరణం చెందడంతో, ఎన్నికల వ్యవహారాలను తన భుజానికెత్తుకున్న ప్రణబ్, ఆ ఎన్నికల్లో రాజీవ్ మరణంతో వచ్చిన సానుభూతి పవనాలను కాంగ్రెస్ విజయానికి మలచడంలో కీలకంగా కృషి చేశారు. 1991లో ప్రాంతీయ పార్టీల సహకారంతో కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి శరద్ పవార్ తో పాటుగా ప్రణబ్ పోటీపడ్డారు. అయితే, మధ్యే మార్గంగా పివి నరసింహారావు ప్రధాని పీఠాన్ని అధిష్టించడం జరిగింది. పివి ప్రభుత్వ హయాంలో ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. 1995-96 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు.
1996-2004 వరకు ప్రణబ్ రాజకీయ జీవితంలో అనేక ముఖ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ వ్యూహకర్తగా మారి, తమ జాతీయ రాజకీయ ప్రత్యర్థి భాజపాకు అధికారాన్ని దక్కకుండా చేసేందుకు ప్రాంతీయ పార్టీల కూటమిగా పిలిచే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి బయట నుంచి కాంగ్రెస్ మద్దతు పలకడం వెనుక ప్రణబ్ ఉన్నారు.1998లో సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఒకవైపు జాతీయ రాజకీయాల్లో ఉంటూనే 2000వ సంవత్సరంలో బెంగాల్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలోకి పలు ప్రాంతీయ పార్టీలను చేర్చుకోవడంలో ప్రణబ్ పాత్ర చాలా కీలకమైనది. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తన చిరకాల స్వప్నమైన ప్రధాని పీఠాన్ని అధిష్టించాలి అని అనుకున్నా, మన్మోహన్ సింగ్ ను ప్రధాన మంత్రిగా సోనియా నిర్ణయించారు. ఆ విధంగా ప్రణబ్ ప్రధాని కాలేకపోయారు. 2004,2009లలో మన్మోహన్ ప్రభుత్వంలో కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేతగా వ్యవహరిస్తూనే రక్షణ, విదేశాంగం, ఆర్థిక శాఖల మంత్రిగా పనిచేశారు. 2012లో అనూహ్యంగా దేశ 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 2012-17 వరకు భారత రాష్ట్రపతిగా కొనసాగారు.
ప్రణబ్ 5 సార్లు రాజ్యసభకు, 2 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం గాంధీ కుటుంబానికి విధేయుడిగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా, ట్రబుల్ షూటర్ గా, రాజకీయ దూతగా ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఆధునిక చరిత్ర ప్రణబ్ ప్రస్తావన లేకుండా ముగియదు అంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలు చవిచూసినా, నాయకులు పార్టీ వదిలి వెళ్లిపోతున్నా ఈనాటికి దేశ రాజకీయాల్లో విశేషమైన ప్రాబల్యాన్ని కలిగి ఉండటానికి కారణం ప్రణబ్ వేసిన పూనాదులు అని చెప్పవచ్చు. దేశ రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల నేతలతో పనిచేసిన అరుదైన ఘనత ప్రణబ్ ముఖర్జీకి దక్కుతుంది.
ప్రణబ్ ముఖర్జీ గొప్ప పరిపాలనా దక్షుడు. కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే 2004 ఎన్నికల ముందు ఆ పార్టీకి ఓటములతో సతమతమవుతూ ఉన్న తరుణంలో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి ఆయా రాష్ట్రాల్లో పార్టీకి జవసత్వాలు కల్పించే చర్యలు చేపట్టారు. 2004, 2009లలో వరుసగా యూపీఏ కూటమి రెండు సార్లు అధికారంలోకి రావడంలో మన్మోహన్ సర్కార్ తీసుకున్న చర్యలతో పాటుగా, పార్టీ పరంగా ప్రణబ్ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు ముఖ్య కారణం. ఇక కేంద్ర మంత్రిగా చేపట్టిన ప్రతి శాఖను సంస్కరణల బాట పట్టించిన ఘనత ఆయన సొంతం. కేంద్ర ఆర్థిక మంత్రిగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా, నాబార్డ్, దేశవ్యాప్తంగా ప్రాంతీయ బ్యాంకుల స్థాపనలో కీలకంగా వ్యవహరించారు. మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ ను ఆర్బీఐ గవర్నర్ గా చేసింది సైతం ప్రణబ్ ముఖర్జీ కావడం విశేషం. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ప్రణబ్ అందించిన సేవలు మరువలేనివి.
స్వతంత్ర భారత చరిత్రలో సింహభాగం రాజకీయ యవనికపై ప్రణబ్ ముఖర్జీ ముద్ర ప్రత్యేకం. వివిధ అంశాలపై ఆయనకున్న అవగాహన, అసాధారణ నైపుణ్యం అమోఘం. సున్నితంగా చెప్పినట్లు ఉన్నా చురుకుగా తన మనసులోని భావాలను ఎదుటివారికి అర్థం అయ్యేలా చెప్పగలిగే నేర్పరి ప్రణబ్. మిత్రపక్షాలు బెట్టు చేసినా, ప్రత్యర్థి పార్టీలు ఉడుం పట్టు పట్టినా.. నొప్పించక ఒప్పించే శైలి ఆయనకే సొంతం. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, భారత రాష్ట్రపతిగా ప్రతి స్థాయిలోనూ ఆయన చూపిన రాజనీతికి ప్రత్యర్థి పార్టీ నేతలే ముగ్ధులయ్యారు. అనేక సందర్భాల్లో ఆయన్ను కీర్తించారు.దేశానికి ప్రణబ్ ముఖర్జీ చేసిన సేవలకు గాను ఆయన్ను ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది.
ఆరున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏ పదవిలో ఉన్నా, తనదైన ముద్ర వేసిన ప్రణబ్ కరోనా కారణంగా తన 84వ ఏట 2020, ఆగస్ట్ 10వ తేదీన తుది శ్వాస విడిచారు. రాజకీయ అవినీతి పెరుగుతున్న నేటి కాలంలో మచ్చలేని మహావ్యక్తిగా, నిజాయితీపరుడిగా, నిస్వార్థపరుడిగా, విలువలు పాటించే వ్యక్తిగా వెలుగొందిన ప్రణబ్ ముఖర్జీ నేటితరం నాయకులందరికి ఆదర్శం.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి