తెలుగు మూవీ ఆల్ రౌండర్-రానా

- December 14, 2024 , by Maagulf
తెలుగు మూవీ ఆల్ రౌండర్-రానా

ప్రస్తుతం ప్రపంచస్థాయికి ఎదుగుతున్న తెలుగు సినిమా పరిశ్రమకి ‘రానా దగ్గుబాటి’ అనే పేరు తప్పక కావాల్సి వస్తుంది. సౌత్ టు నార్త్ హీరోగా, విలన్‌గా, విజువల్ ఎఫెక్ట్స్ కో-ఆర్డినేటర్‌గా, టెలివిజన్ ప్రెజెంటర్‌గా, నిర్మాతగా సినిమా రంగానికి ఏ విధంగా సేవలు కావాలో ఆ విధంగా అందిస్తూ.. తనతో పాటు సినీ పరిశ్రమను కూడా ముందుకు తీసుకు వెళ్తున్నారు రానా. ‘లీడర్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. బాహుబలితో ఫ్యాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇవాళ రానా దగ్గుబాటి బర్త్ డే. 

రానా అసలు పేరు దగ్గుబాటి రామానాయుడు. 1984,డిసెంబర్ 14వ తేదీన దగ్గుబాటి సురేష్ బాబు, లక్ష్మి దంపతులకు చెన్నైలో జన్మించారు. చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన రానా, హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీ నుంచి ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో డిగ్రీ పూర్తి చేశారు. రానా తాతగారు ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు, తండ్రి సురేష్ బాబు సైతం నిర్మాత, బాబాయ్ వెంకటేష్ టాలీవుడ్ స్టార్ హీరో. 

చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరగడంతో సినిమాల మీద ఆసక్తి పెంచుకున్న రానా, 2004లో బొమ్మలాట చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం జాతీయ అవార్డును తీసుకొచ్చింది. 2005లో సినిమాలకు విఎఫ్ఎక్స్ అందించే Spirit Media సంస్థను స్థాపించి 70 చిత్రాలకు విఎఫ్ఎక్స్ అందించారు. తాత, తండ్రి ప్రోత్సాహంతో 2010లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ చిత్రంతో హీరోగా మారారు. హీరోగా నటించిన తోలి చిత్రం రానాకు నటుడిగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగానే కాకుండా ప్రాధాన్యత ఉన్న రోల్స్ లో నటిస్తూ బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో నటించారు. అయితే, దర్శక ధీరుడు రాజమౌలి దర్సకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్లో చేసిన ప్రతినాయక భల్లాల దేవ పాత్ర ద్వారా ప్యాన్ ఇండియా వైడ్ మంచి గుర్తింపును అందుకున్నారు. 

మాస్ హీరో కట్ అవుట్ కలిగి, స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు అయ్యినప్పటికీ స్టార్ దర్శకులతో కమర్షియల్ సినిమాలు చేయకుండా.. కృష్ణం వందే జగద్గురుమ్, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి వంటి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ‘ఘాజీ’ వంటి అద్భుత సినిమాలను తెరకెక్కించే సంకల్ప్ రెడ్డి లాంటి దర్శకులకు గుర్తింపు కలగాలంటే రానా సహాయం కావాలి. ఆఖరికి ప్రభాస్ వంటి హీరో సినిమా ఇంటర్నేషనల్ వేదిక పైకి వెళ్ళడానికి కూడా రానా సహాయం కావాలంటే.. సినీ పరిశ్రమలో రానా స్థానం ఏంటో అర్ధం చేసుకోండి. బాహుబలి, కల్కి వంటి సరిహద్దులు చెరిపేసే సినిమాలకు రానా సహాయం తప్పక కావాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించే ఆలోచనతో రానా ముందుకు సాగుతున్నారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com