వెండితెర బ్రహ్మర్షి-బాపు

- December 15, 2024 , by Maagulf
వెండితెర బ్రహ్మర్షి-బాపు

ఆయన అచ్చ తెనుగు సినిమాకి కేరాఫ్ అడ్రస్సు.అసలు పేరు పేరుకేగాని ఆ పేరుతో ఆయన్ని ఎవరు పిలవరు.జాతీయోద్యమ రోజుల్లో జన్మించిన బిడ్డ కావడం వల్ల మహాత్ముడి స్పూర్తితోనూ,తన తండ్రి పేరు కలిసివచ్చేలా ఆయన్ని ముద్దుగా ‘బాపు’ అని పిలుచుకునేవారు ఆయన తల్లి తర్వాతి కాలంలో అదే అసలు పేరుగా చిరస్థాయిగా నిలిచిపోయింది.సినీ దర్శకత్వంలో ఎవరి వద్ద శిష్యరికం చేయకుండానే తన గీతలు రాతల్లాగే ‘బాపుబొమ్మ’ అని సినిమాలకు తనదైన ఓ బ్రాండ్ రూపొందించుకున్నారు.వారి గురించి చెప్పడం మొదలుపెడితే ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. నేడు వెండితెర బ్రహ్మర్షి బాపు గారి జయంతి. 

వెండితెర మీద తెలుగుదనాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మి నారాయణ.  1933 డిసెంబర్ 15న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నిడదవోలులోని అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు.స్వస్థలం మాత్రం నరసాపురం సమీపంలోని కంతేరు గ్రామం. తల్లిదండ్రులు సూర్యకాంతమ్మ,వేణుగోపాలరావు.ఆయనకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి. పెద్ద తమ్ముడు శంకర నారాయణ-బాపు స్పూర్తితోనే పెన్సిల్ రేఖా చిత్రకారుడిగా మంచిపేరు సంపాదించుకున్నారు. తండ్రి వృత్తిరీత్యా కుటుంబం మద్రాసుకు వచ్చి స్థిరపడటంతో బాపు చదువు అక్కడే కొనసాగింది. 

1942లో బాపు వారు ఐదో తరగతి చదువుతూ ఉండగా, ఆ స్కూల్లోనే ఆరవ తరగతి చదువుకుంటున్న ముళ్ళపూడి వెంకటరమణ పరిచయమయ్యారు.ఆ స్నేహబంధం క్షణ క్షణాభివృద్ది చెందుతూ వచ్చి,ఆ తర్వాత బంధుత్వంతో కూడా మరింత గట్టిపడింది.బాపు తండ్రిగారు తమ కుమారుణ్ణి లాయర్ గా చూడాలని ఆశించి ‘లా’ చదివించారు. బి.ఎల్ విజయవంతంగా చదివినా, నల్లకోటు నచ్చక 1955లో ఆంధ్రపత్రికలో పొలిటికల్ కార్టూనిస్టుగా చిత్ర జీవితాన్ని ప్రారంభించారు. 1967కల్లా బాపు చిత్రకారుడిగాను ముళ్ళపూడి వెంకటరమణ సాహిత్య, చిత్ర రంగాల్లో రచయితగా మంచిపేరు సంపాదించుకున్నారు. తను రాసిన ఓ కథ ఆధారంగా బాపు దర్శకత్వంలో ప్రయోగాత్మకంగా ఓ చిత్రం తీయాలని సంకల్పించారు రమణ ఆ చిత్రమే ‘సాక్షి’. 

‘పక్కింటికి నిప్పంటుకుంటే నాకేంటే’ అని ఉదాసీనంగా కూర్చోకు తర్వాత అది నీ కొంపమీదకే వస్తుంది’ అనే సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పడానికి చేసిన ప్రయత్నమే ‘సాక్షి’. కృష్ణ ,విజయనిర్మల హీరో హీరోయిన్లుగా 19 రోజుల్లో షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి అయిన ఖర్చు ఒక లక్షా ఎనభైవేల రూపాయలు! విడుదలైన తర్వాత పెట్టిన ఖర్చును రాబట్టుకుందా చిత్రం. ‘గొప్ప ప్రయోగం’ అన్న పేరుతో పాటు ‘సాక్షి’ చిత్రం అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. 

రెండవ చిత్రం ‘బంగారు పిచుక’(1968) బాపు రమణల సొంత చిత్రమే. రెండున్నర లక్షల బడ్జెట్ లో తయారైన ఈ చిత్రం అంతంత మాత్రంగానే ఆడింది. విశేషం ఏమిటంటే ఈ జంట ఇదే కథను 1994లో ‘పెళ్ళికొడుకు’ పేరుతో తీశారు. ‘బంగారు పిచుక’లో హీరో చంద్రమోహన్ అయితే ‘పెళ్ళికొడుకు’ లో నరేశ్ కథానాయకుడు. ఈ రెండు చిత్రాలు చూసిన ప్రముఖ రచయిత దర్శకుడు జంధ్యాల-మొదటిది ‘టూ ఎర్లీ’ అనీ, రెండవది ‘టూ లేట్’ అని కామెంట్ చేశారు! మూడవ చిత్రం ‘బుద్దిమంతుడు’ (1969) విజయవంతం కావడంతో బాపు ‘హిట్ లిస్ట్’ లోకి చేరారు! ఇదీ దీని తర్వాత రూపొందిన ‘బాలరాజు కథ’ కూడా సొంతంగా నిర్మించినవే. డూండీ నిర్మాతగా తయారైన ‘ఇంటిగౌరవం’(1970) దర్శకుడిగా బాపు ఐదవ చిత్రం.

బాపు తొలి పౌరాణిక చిత్రం ‘సంపూర్ణ రామాయణం’(1972) చిత్రానికి శోభన్ బాబును రామ పాత్రకు ఎంపిక చేసేసరికి చిత్ర పరిశ్రమలో అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ పాత్రకు ఎన్టీఆర్ సరైన నటుడని అందరూ ఫిక్స్ అయిపోయి ఉంటే, వీళ్ళే వాటి ‘ట్రెండ్’ మారుస్తున్నారని అనుకున్నారు. కానీ బాపు-రమణలు నమ్మిన రాముడు ఆ చిత్రాన్ని విజయపథంలో నడిపించారు. 18లక్షల వ్యయంతో తయారైన ‘సంపూర్ణ రామాయణం’ నిర్మాతలకు(బాపు-రమణ) లాభాలను తెచ్చిపెట్టింది.ఈ చిత్రాన్ని తమిళం,కన్నడం,హింది భాషల్లోకి ‘డబ్బింగ్’ చేసి విడుదల చేయడంతో దర్శకుడిగా బాపు ప్రతిభ ఏమిటో ఇతర ప్రాంతాల వారికి తెలిసింది. సౌత్ ఇండియన్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వారు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన బాపుకు ఆ సంవత్సరపు ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ ఇచ్చి సత్కరించారు. 

అందాల రాముడు(1973) చిత్రం మరో ప్రయోగం. రమణ రాసిన ‘జనతా ఎక్స్ ప్రెస్’ కథలోని పాత్రలను పునాదిగా చేసుకొని తయారైన ఈ చిత్రం ‘సెకెండ్ రన్’ లో హిట్ కావడం విశేషం. పొట్లూరి వెంకటనారాయణ నిర్మాతగా, బాపు దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ (1974)లో ఎన్టీఆర్ రాముడిగా, ఆర్జా జనార్ధనరావు ఆంజనేయుడిగా నటించారు. బాపు దర్శకత్వంలో శోభన్ బాబు శ్రీరాముడిగా నటించిన ‘సంపూర్ణ రామాయణం’ గతంలోనూ ప్రత్యేకంగా వేయించుకొని చూసిన ఎన్టీఆర్ బాపు భుజం తట్టి శోభన్ బాబును మెచ్చుకున్నారు. అందువల్ల ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ లో బాపు- ఎన్టీఆర్ ల అనుబంధం సులువుగా ప్రారంభమై ఆ తరువాత దృఢతరమైంది. 

బాపు దర్శకత్వంలో ఎమ్వియల్ నిర్మించిన ‘ముత్యాలముగ్గు’(1975) ప్రసిద్ధ ఛాయాగ్రహకుడు ఇషాన్ ఆర్య మెరుపులతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మురిపించింది. పన్నెండున్నర లక్షల బడ్జెట్ తో తయారైన ఈ చిత్రం మొదటి రిలీజ్ ఇరవై నాలుగో వారానికి రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది. రమణ గారి డైలాగులు, రావుగోపాలరావు నోట పలికి విశేష ఆదరణకి నోచుకున్నాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘ముత్యాలముగ్గు’ జాతీయ బహుమతిని గెలుచుకుంది. ఆ తర్వాత బాపుగారు విజయావారి ‘రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ చిత్రానికి పనిచేసినా, దర్శకుడిగా తనపేరు వేసుకోలేదు. 

కృష్ణంరాజు సోదరుల ‘భక్తకన్నప్ప’ తర్వాత, బాపుకి విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఆర్జించిన ‘సీతా కళ్యాణం’(1976) విడుదలైంది. సీతగా జయప్రద, రాముడిగా రవి అనే మలయాళ నటుడు నటించారు. వ్యాపారరీత్యా విజయవంతం కాలేదు.అయితే లండన్, చికాగో వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శితమైంది. లండన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో పాఠ్యగ్రంథమైన ఘనత సంపాదించుకుంది. ఆ విధంగా తెలుగు ఖ్యాతిని అంతర్జాతీయస్థాయిలో వ్యాపింపజేశారు బాపు. ఆ తర్వాత ‘దోస్తీ’ హింది చిత్రం ఆధారంగా తీసిన ‘స్నేహం’ ద్వారా రాజేంద్రప్రసాద్, సాయికుమార్ వంటి నటులను పరిచయం చేశారు. అంతకుముందు ‘ముత్యాల ముగ్గు’ ద్వారా నూతన్ ప్రసాద్ పరిచయమయ్యారు. 

బాపు చలన చిత్ర జీవితంలో మరో మలుపు అని చెప్పుకోదగ్గ చిత్రం. ‘మన ఊరి పాండవులు’(1978)లో విడుదలైంది. ఈ చిత్రం ద్వారా భానుచందర్, గీత పరిచయమయ్యారు. చిరంజీవి తొలి రోజుల్లో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం ఇది. ప్రముఖ రూపశిల్పి జయకృష్ణ నిర్మాత. ఈ చిత్రమే హిందీలో ‘హాం పాంచ్’ గా రూపుదిద్దుకుంది. నిర్మాత బోనీకపూర్. బాపు దర్శకత్వం వహించిన తొలి హిందీ  చిత్రం ఇదే. ఈ చిత్రానికి ఎస్.పి.బాలసుబ్రమణ్యం రీ-రికార్డింగ్(నేపథ్య సంగీతం) సమకూర్చి మంచిపేరు తెచ్చుకున్నారు. పాటలకు లక్ష్మీ కాంత్-ప్యారే లాల్ సంగీతం సమకూర్చారు. ‘హాం పాంచ్’ విజయం సాధించి, ఆ తర్వాత బాపుగారు హిందీలో మరిన్ని చిత్రాలు తీయడానికి దోహదపడింది. 

తెలుగులో ‘గోరంత దీపం’ ‘తూర్పు వెళ్ళే రైలు’ ‘కలియుగ రావణాసురుడు’, ‘రాజాధిరాజు’, ‘వంశవృక్షం’ (ఈ చిత్రం ద్వారా అనిల్ కపూర్ ను వెండితెరకు పరిచయం చేశారు బాపు. ఆ తర్వాత ఆయన హిందీలో అగ్రనటుల్లో ఒకటయ్యారు), ‘రాధా కళ్యాణం’ చిత్రాల తర్వాత 1981లో నవతా కృష్ణంరాజు నిర్మించిన ‘త్యాగయ్య’ చిత్రాన్ని బాపు డైరెక్టు చేశారు. ఈ చిత్రం అపజయం పాలై ఎంతో నిరుత్సాహాన్ని మిగిల్చింది. 

అనంతరం ‘కృష్ణావతారం’, ‘ఏది ధర్మం’, ‘పెళ్లీడు పిల్లలు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘సీతమ్మ పెళ్లి’ చిత్రాలు వెలువడ్డాయి.‘సీతమ్మ పెళ్లి’ తెలుగులో ఫెయిల్ అయినా బాపు దర్శకత్వంలోనే హిందీలో ‘ప్యారీ చెహనా’ గా తీస్తే అక్కడ పెద్ద హిట్ అయింది! ‘బుల్లెట్’, ‘జాకీ’, కళ్యాణ తాంబూలం చిత్రాల తర్వాత సొంతంగా తీసుకున్న ‘పెళ్లిపుస్తకం’(1991)బాగా ఆడింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారికి ‘శ్రీనాథ కవి సార్వభౌమ’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు బాపు. అనంతరం ‘మిస్టర్ పెళ్ళాం’, ‘పెళ్లికొడుకు’, ‘రాంబంటు’, ‘రాధా గోపాళ౦’, ‘సుందరాకాండ’ చిత్రాల తర్వాత చివరిగా ‘శ్రీరామ రాజ్యం’(2011) చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ బడిపిల్లల కోసం బాపు-రమణ ‘బడిపిల్లల కోసం’ వీడియో పాఠాలు రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. ఈనాడు టెలివిజన్ లో ప్రసారమైన ‘భాగవతం’ ధారావాహిక కూడా బాపు దర్శకత్వ ప్రతిభకు మరో ‘మెచ్చు’ తునక. బాపుగారి డ్రీమ్ ప్రాజెక్టు ‘శ్రీ కృష్ణలీలలు’ అది భారీ ఎత్తున ప్రతిష్టాత్మకమైన సినిమాగా తీయాలని అనుకునేవారు. కానీ బుల్లితెరపై ‘భాగవతం’ తోనే సంతృప్తిపడాల్సి వచ్చింది.

అరవై అయిదేళ్ల చిత్రకారుడు, యాభై ఏళ్ల చలనచిత్రకారుడు బాపులో ఉన్నారు. ‘బాపు బొమ్మ’ అనే మాట ఈరోజూ చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. తెలుగు సంస్కృతికీ సంప్రదాయాలకు అందచందాలకు బాపు గీసిన.. తీసిన బొమ్మలు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఆబాలగోపాలాన్ని తన కథలతో కట్టిపడేసిన విశ్వబ్రాహ్మ బాపు అనడంలో ఎటువంటి సందేహం లేదు. శాంతము, కరుణము, భయంకరము, భీభత్సము, రౌద్రం, అద్భుతం, వీరం, హాస్యం..ఇలా నవరసాలను పండించే సినిమాలను తీయడమే కాకుండా ప్రేక్షకులకు ఒక మంచి సందేశాన్ని కూడా అందించే విధంగా కథ ఉండేలా చూసుకోవడం బాపు ప్రత్యేకత. ఆయన బొమ్మలే కాకుండా ప్రత్యేకంగా ఉండే ఆయన చేతిరాతకు బాపు ఫాంట్ అని గుర్తింపు కూడా వచ్చింది.

సినిమాలపై ఎలాంటి అవగాహన లేకుండానే సినీ పరిశ్రమలు అడుగుపెట్టి.. తొలి చిత్రం ‘సాక్షి’తోనే అందరి దృష్టి తనవైపు తిప్పుకునేలా చేసిన ప్రతిభాశాలి బాపు. తన దైన శైలిలో సినిమాలు తీయడమే కాకుండా, తీసిన వాటిన్నింటిలో తనదైన ముద్రను స్పష్టంగా కనబర్చారు. రామాయణ గాథను పలుమార్లు పలు రూపాల్లో వెండితెరపై అద్భుతంగా మలిచిన ఘనత బాపుది. రామాయణసారం లేకుండా బాపు సినిమాలే లేవు. రామాయణ, మహాభారతాల్ని ఆధునీకరించి పలు సినిమాలు తెరకెక్కించారు బాపు. ఈ రెండు మహాకావ్యాల్ని అణువణువునా జీర్ణించుకుని.. ప్రతి కథనీ ఆకోణం నుంచే చూశారు తీశారు బాపు. ‘సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలు రామాయణ, మహాభారత ఇతివృత్తాలతోనే రూపొందాయి. 

తెలుగులో తాను దర్శకత్వం వహించిన పలు చిత్రాలను హిందీలోనూ తెరకెక్కించారు బాపు. అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ నటులను హీరోగా పరిచయం చేసిన ఘనత బాపుదే. ఇక.. బాపు గురించి మాట్లాడుకునేట్టపుడు రమణ గురించి చెప్పకపోతే అది పూర్తవదు. వీరిద్దరూ ఒకే ఆత్మకు రెండు రూపాలు వంటి వారు. బాపు దృష్టి అయితే రమణ దాని భావం. బాపు చిత్రం అయితే రమణ దాని పలుకు. అందుకే వీరిద్దరి వెండితెర ప్రయాణమేకాదు. జీవన ప్రయాణం కూడా కలిసి కట్టుగానే సాగింది. 

యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన బాపు అందుకున్న అవార్డుల జాబితా పెద్దదే. ముఖ్యమైనవి- ముత్యాలముగ్గు, మిస్టర్ పెళ్ళాం, బాలరాజు కథ, అందాల రాముడు, పెళ్లి పుస్తకం, శ్రీరామరాజ్యం- ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ బహుమతులు, ఉత్తమ చిత్రాలుగా నంది అవార్డులు గెలుచుకున్నాయి.1986లో ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారితో కలిసి ప్రతిష్టాత్మకమైన ‘రఘుపతి వెంకయ్య’ అవార్డును అందుకున్నారు. 2013లో బాపు ‘పద్మశ్రీ’ గౌరవాన్ని స్వీకరించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ పురస్కారాలతోపాటు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను అందుకున్నారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆయన్ను గౌరవ డాక్టరేట్ తో కలిసి మరెన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నారు.

శ్రీరామరాజ్యం చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సమయంలోనే 2011లో ముళ్ళపూడి వెంకటరమణ జీవితరంగం నుంచి నిష్క్రమించడంతో బాపు బాగా కుంగిపోయారు. పక్కన ఎవరూ లేని సమయంలో రమణ గారినీ తలచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుండేవారు. అనారోగ్యం కారణంగా తన 80వ ఏట 2014లో ఆగస్టు 31న కన్నుమూశారు. జీవితంలో చాలామందికి దొరికే బొమ్మలు నచ్చవు. నచ్చే బొమ్మలు దొరకవు’ అని బాపు బొమ్మలు చాలామందికి నచ్చుతాయి. నచ్చని బొమ్మలు ఆయన తీ(వే)యరు! 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com