దర్శక దిగ్గజం-ఆదుర్తి
- December 16, 2024
తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో బహుముఖ ప్రఙ్ఞ కనబర్చిన అతికొద్ది మందిలో ఆదుర్తి సుబ్బారావు ఒకరు. ఫోటోగ్రఫీ కోర్సు పూర్తిచేసి బోంబేలో కొన్నాళ్లు ప్రోసెసింగ్ అండ్ ప్రింటింగ్ లో పనిచేసిన ఆదుర్తి.. ఎడిటర్‌గా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ కనబర్చారు.తెలుగులో కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించడంలో ఆదుర్తి తనదైన ప్రత్యేకతను సంపాదించారు. కుటుంబ కథా చిత్రాలు తీయడంలో ఆదుర్తి ఆరితేరినవారు. ప్రయోగాత్మక సినిమాలకు పెద్ద పీట వేశారు. నేడు దర్శక దిగ్గజం ఆదుర్తి సుబ్బారావు జయంతి.
తెలుగు నాట కుటుంబ కథా చిత్రాల దర్శకునిగా సుప్రసిద్ధులైన ఆదుర్తి సుబ్బారావు 1912 డిసెంబర్ 16న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని రాజమండ్రి పట్టణంలో జన్మించారు. ఆయన తండ్రి సత్తెన్న పంతులు గారు రాజమండ్రి తాసీల్దార్ గా పనిచేశారు. పద్నాలుగో ఏటనే స్కూలు ఫైనల్ పాసై కాకినాడ పిఠాపురం రాజా కాలేజిలో ఇంటర్మీడియట్ చేరారు. కానీ ఆయనకు చదువు మీదకన్నా ఫోటోగ్రఫీ, గ్రంధ పఠనం మీద ఆసక్తి మెండు. తోబుట్టువులను వెంట పెట్టుకొని గోదావరి గట్టున కూర్చోబెట్టి వివిధ భంగిమల్లో వారిని ఫోటోలు తీసేవారు. మూకీ సినిమాలు చూస్తూ తనుకూడా గొప్ప కెమెరామన్ కావాలని కలలు కన్నారు.
ఇంటర్ చదువును మధ్యలోనే ఆపేసి సినిమాల మీద ఆసక్తితో తండ్రిని ఎదిరించి 1943 లో ముంబాయి లోని సెయింట్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో చేరి ఫిల్మ్ లాబ్, ప్రోసెసింగ్, ప్రింటింగ్, ఎడిటింగ్ మొదలైన విభాగాలలో అనుభవం సంపాదించారు. ఆ సమయంలో తనకు డబ్బు అవసరమొస్తే తండ్రికి రాసే ఉత్తరంలో మనియార్డర్ ఫారంతో బాటు ఓ ప్రామిసరీ నోటు కూడా ఉండేది. "బొంబాయిలో కోర్సుకి అయ్యే ఖర్చుకి తర్వాత కాలంలో నీ తమ్ముళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అగత్యం లేకుండా అప్పుగా తీసుకో" అని సత్తెన్న పంతులు గారి సూచన మేరకే ఆదుర్తి గారు అలా పంపేవారట.
ఫిలిం ప్రాసెసింగ్, ఫిలిం ప్రింటింగ్ విభాగాల్లో శిక్షణ పొంది సినిమాల్లో అవకాశాలకోసం బొంబాయిలోవుండే సినిమా స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఎంతోమంది పెద్దవాళ్ళను కలిశారు. చివరకు విజయభట్ నిర్మించిన ‘రామరాజ్య’’ (1943) అనే హిందీ సినిమాకు కెమెరా అసిస్టెంటుగా పనిచేసే అవకాశం వచ్చింది. మహాత్మా గాంధీ తన జీవితం మొత్తంమీద చూసిన ఏకైక చిత్రం యీ ‘రామరాజ్య’. ఆదుర్తి ఈ చిత్రానికి ఎంతో ప్రతిభావంతంగా పనిచేసినా తన సీనియర్ల చేతుల్లో వేధింపులు తప్పలేదు. దాంతో విరక్తి చెందిన ఆదుర్తి సినిమాటోగ్రఫి శాఖకు ఉద్వాసన చెప్పారు. తర్వాత ఫిలిం ప్రాసెసింగ్ విభాగంలో చేరారు. అందులో కూడా ఇమడలేక, కొంతమంది మిత్రుల సూచనల మేరకు ఎడిటింగ్ శాఖపై దృష్టి పెట్టారు.
దీనా నార్వేకర్ అనే ఎడిటర్ దగ్గర అసిస్టెంటుగా చేరి ఆయన ప్రశంసలు చూరగొన్నారు. ప్రఖ్యాత నాట్యాచార్యుడు పద్మవిభూషణ్ ఉదయశంకర్ (పండిట్ రవిశంకర్ సోదరుడు) ఆదుర్తి ప్రతిభను గుర్తించి, తానే స్వయంగా నటిస్తూ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘కల్పన'(1948) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేసే అవకాశం కల్పించారు. చిత్రనిర్మాణ సమయంలో అనేక విషయాలమీద ఆదుర్తి ఇచ్చిన సలహాలను ఉదయశంకర్ కూలంకషంగా చర్చించి వాటిని పాటించారు. ఈ సినిమా ఒక నాట్య ప్రధాన దృశ్యకావ్యం. ఈ చిత్రం విదేశీ విమర్శకుల మన్ననలు అందుకుంది.
1948లో‘కల్పన’ చిత్ర నిర్మాణం పూర్తయ్యాక, మద్రాసులో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఊపందుకుంటున్న దశలో ఆదుర్తి మద్రాసులో తొలిఅడుగులు వేశారు. మద్రాసు వచ్చిన తరవాత పూర్తి స్థాయి ఎడిటర్‌గా ‘పారిజాతాపహరణం’ అనే తమిళ చిత్రానికి పని చేశారు. అదుర్తికి మంచి సాహిత్య ప్రతిభ ఉండడంతో పాట రచన, మాట రచన మీద కూడా దృష్టి పెట్టారు. ‘మంగళసూత్రం’, ‘ఒకరోజు రాజు’, ‘సర్కస్‌రాజు’ వంటి కొన్ని సినిమాలకు మంచి పాటలు రాశారు. అందుకే ఆదుర్తి తీసే సినిమాల్లో మంచి పాటలు ఆవిష్కరింపబడతాయి. కొంతకాలం తన తమ్ముడు ఆదుర్తి నరసింహమూర్తి నిర్వహించే ‘హారతి’ పత్రికకు ఆదుర్తి సుబ్బారావు ఎడిటర్ గా కూడా వ్యవహరించారు. తరవాత కొంతకాలానికి ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు ‘దీక్ష’ (1951) చిత్రాన్ని నిర్మిస్తూ ఆదుర్తిని సహాయదర్శకుడిగా తీసుకున్నారు.
ఆదుర్తి పనితనానికి ప్రశంసలు రాగా 1953 లో ప్రకాశరావు నిర్మించిన ‘కన్నతల్లి’, ఈస్ట్ ఇండియా వారు చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన ‘సంక్రాంతి’ (1952) చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసి ఆదుర్తి తన పనితనాన్ని నిరూపించుకున్నారు. అప్పట్లో ప్రకాష్ స్టూడియోలో డి.బి. నారాయణ జనరల్ మేనేజర్ గా, ఎస్. భావనారాయణ ప్రొడక్షన్ ఎక్ష్జిక్యూటివ్ గా పనిచేవారు. వారిద్దరూ రాజమండ్రి వాసులే కావడంతో వారితో ఆదుర్తికి స్నేహం కుదిరింది. ముగ్గురూ కలిసి 1953లో ఒక శుభముహూర్తాన ‘అమరసందేశం’ (1954) సినిమా తీయాలని నిర్ణయించారు. వీరి పట్టుదల తెలిసిన నవయుగ శ్రీనివాసరావు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. సాహిణీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ సినిమా గొప్పగా ఆడకపోయినా దర్శకుడిగా ఆదుర్తి కి మంచి సమర్ధవంతమైన దర్శకుడనే పేరొచ్చింది.
అన్నపూర్ణావారు ‘దొంగరాముడు’ సినిమా తరవాత రెండవ చిత్రానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దుక్కిపాటి మధుసూదనరావు, భావనారాయణ సలహామీద ‘అమర సందేశం’ చూసి దర్శకుని ప్రతిభకు ఆకర్షితుడై అన్నపూర్ణా బ్యానర్ మీద తాము నిర్మించబోతున్న రెండవచిత్రం ‘తోడికోడళ్ళు’ (1957) కు ఆదుర్తిని దర్శకునిగా తీసుకున్నారు. బెంగాలి నవల ‘నిష్కృతి’ ఆధారంగా నిర్మించిన ఆ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. ఉత్తమ చలనచిత్ర బహుమతి కూడా అందుకుంది. కుటుంబ కథలను సినిమాలుగా మలచడంలో ఆదుర్తి ప్రవీణుడు. ఆయన సినిమాల్లో సమాజానికి చేటు చేసే సన్నివేశాలు లేశమాత్రమైనా కనిపించవు. ప్రేక్షకులకు నచ్చేలా కుటుంబకథా చిత్రాలను నిర్మించి అద్భుత విజయాలను అందుకున్న మేధావి ఆదుర్తి.
‘తోడికోడళ్ళు’ చిత్రాన్ని ‘ఎంగవీట్టు’ మహాలక్ష్మి’ గా తమిళంలో నిర్మిస్తే అక్కడకూడా ఆ సినిమా స్మాష్ హిట్ గా నిలిచింది. ఈ రెండు చిత్రాలకు స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాకుండా ఎడిటింగ్ బాధ్యతలు కూడా ఆదుర్తే నిర్వహించారు. తరవాత యర్రా నారాయణ స్వామి కి ‘ఆడపెత్తనం’ (1958) సినిమా చేశారు. అన్నపూర్ణా సంస్థ కు బెంగాలి నవల అగ్ని పరీక్ష ఆధారంగా నిర్మించిన ‘మాంగల్యబలం’ (1959), దాని తమిళ వర్షన్ ‘మంజల్ మహిమై’ రెండూ సూపర్ హిట్లయ్యాయి. ఫిలింఫేర్ అవార్డుతో బాటు ప్రాంతీయ ఉత్తమ చిత్ర బహుమతి కూడా ఈ చిత్రం అందుకుంది. తరవాత అదే సంస్థకు ఇద్దరుమిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, వెలుగునీడలు, పూలరంగడు చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.
బాబూ మూవీస్ పతాకం మీద సి.సుందరం నిర్మించిన మంచిమనసులు, మూగమనసులు, అందరూ కొత్త తారలతో తేనెమనసులు, కన్నెమనసులు చిత్రాలను ఆదుర్తి సొంత సినిమాలుగా నెంచి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. డాక్టర్ చక్రవర్తి చిత్రానికి నంది బహుమతి అందుకున్నారు. సుడిగుండాలు లఘు బడ్జట్ చిత్రానికి కూడా నంది బహుమతి లభించింది. జాతీయ స్థాయిలో సుడిగుండాలు, డాక్టర్ చక్రవర్తి, మూగమనసులు, నమ్మినబంటు, మాంగల్యబలం, తోడికోడళ్ళు చిత్రాలు ప్రశంసలు అందుకున్నాయి. మూగమనసులు చిత్రాన్ని ‘మిలన్’ పేరుతో హిందీలో నిర్మించి నూతన్ కు ఉత్తమనటి గా జాతీయ బహుమతిని రప్పించగలిగారు.
సూపర్ స్టార్ కృష్ణను 'తేనె మనసులు' చిత్రంతో తెరకు పరిచయం చేసింది ఆదుర్తి సుబ్బారావే. ఆ తర్వాత కృష్ణతో దర్శక-నిర్మాతగా 'మాయదారి మల్లిగాడు', 'గాజుల కిష్టయ్య' సినిమాలు తీశారు. ఇక.. అక్కినేని నాగేశ్వరరావుతో ఎక్కువ సినిమాలు తీసిన ఆదుర్తి.. యన్టీఆర్ తో.. 'దాగుడు మూతలు', 'తోడునీడ', శోభన్ బాబుతో 'గుణవంతుడు' తెరకెక్కించారు. అప్పట్లోనే ఆదుర్తి తీసిన 'సుడిగుండాలు', 'మరో ప్రపంచం' చిత్రాలు ప్రయోగాత్మక కథాంశాలుగా పేరు సంపాదించాయి. తెలుగులో తాను తీసిన పలు చిత్రాలను తమిళం, హిందీ భాషల్లోనూ డైరెక్ట్ చేశారు ఆదుర్తి. కళాతపస్వి కె.విశ్వనాథ్.. ఆదుర్తి కాంపౌండ్ నుంచి వచ్చినవారే.
తమిళంలో ఆదుర్తి దర్శకత్వంలో రూపొందిన ‘కుముదమ్’ కూడా ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. ఇదే చిత్రం తరువాత ఆయన దర్శకత్వంలోనే తెలుగులో ‘మంచిమనసులు’గా తెరకెక్కింది. కన్నుమూశారు. తరువాత సి.ఎస్.రావు ఆ సినిమాను పూర్తి చేశారు. ఏది ఏమైనా ‘అక్కినేనితోనూ, అన్నపూర్ణ సంస్థతోనూ ఆదుర్తిసుబ్బారావు అనుబంధం’ మరువరానిది, మరపురానిది. తెలుగువారికి ఆదుర్తి అందించిన ‘అఆలు’ను ఎవరూ మరచిపోలేరు.
ఆదుర్తి తన జీవన ప్రస్థానంలో 26 తెలుగు చిత్రాలు, 2 తమిళ చిత్రాలు, 10 హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో తాతినేని ప్రకాశరావు, ఎల్.వి. ప్రసాద్ వంటి మేధావుల సరసన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ హిందీలో కూడా విజయవంత మైన చిత్రాలు నిర్మించి, తాతినేని రామారావు, బాపయ్య, లక్ష్మి దీపక్ వంటి తరవాత తరం దర్శకులకు ఆదుర్తి మార్గదర్శకుడైనారు. ముఖ్యంగా నటశేఖర కృష్ణకు తేనెమనసులు చిత్రంలో హీరో పాత్రనిచ్చి కన్నెమనసులు, మాయదారి మల్లిగాడు, గాజులకిష్టయ్య వంటి మంచి చిత్రాల్లో అవకాశం కల్పించి సాహసవంతమైన నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా తీర్చిదిద్దిన ఘనత ఆదుర్తి సుబ్బారావుదే!!
వైవిధ్య భరితమైన కథలతో, నవ్యతకుపట్టం గడుతూ, వినూత్న రీతిలో దర్శకత్వ ప్రతిభను చాటుకున్న ఆదుర్తి సుబ్బారావు ఎక్కువగా తెలుగులో తీర్చి దిద్దిన చిత్రాలనే హిందీలో పునర్నిర్మించారు. అందుచేత ఆదుర్తి దర్శకత్వ ప్రతిభకు తెలుగులో ముందే పట్టం కట్టటం జరిగింది. హిందీలో చిత్రాల్ని నిర్మించేటప్పుడు స్థానిక సంప్రదాయాలను, కట్టుబాట్లు, అలవాట్లను దృష్టిలో వుంచుకొని చిత్రాలు నిర్మించారు. ఏయన్నార్ చిత్రాలతోనే దర్శకునిగా జయకేతనం ఎగురవేసిన ఆదుర్తి, నటసమ్రాట్ నటించిన ‘మహాకవి క్షేత్రయ్య’కు దర్శకత్వం వహిస్తూ అనారోగ్యం కారణంగా తన 62వ ఏట 1975, అక్టోబర్ 1వ తేదీన కన్నుమూశారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు