బహుముఖ ప్రజ్ఞాశీలి-పీవీ
- December 23, 2024
భారతదేశాన్ని ప్రగతిపథం వైపు అడుగువేసేందుకు బలమైన పునాధులు వేసి మౌనముని, రాజకీయ దురంధురుడు, ప్రగతి శీలకుడు పాములపర్తి వెంకట నరసింహరావు. తన ప్రజ్ఞతో పీవీ తెలుగు రాష్ట్రాలు, దేశానికి అసమానమైన సేవలను అందించారు. విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దోహదపడ్డారు. నేడు బహుభాషాకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అపర చాణుక్యుడు, సాహితీవేత్త, అంతేకాదు దానకర్ణుడు పీవీ నరసింహారావు వర్థంతి.
పీవీ నరసింహారావు భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా సేవలందించారు. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా చేరిన ఆయన తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించారు.
1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలలో పనిచేశారు. పీవీని ప్రధాని పదవి అనుకోకుండా వరించింది.
1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో పీవీ మాత్రమే ఆ పదవికి సరైన దిక్కయ్యారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. 1996 వరకు ప్రధానమంత్రి పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. దివాలా తీసే స్ధాయికి చేరుకున్న ఆర్ధిక వ్యవస్థలకు పీవీ పునరుజ్జీవనం కల్పించేందుకు కొత్త సంస్కరణలకు బీజం వేసారు. అందుకే పీవీని ఆర్ధిక సంస్కరణల పితామహుడు అంటారు. పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. 1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షల కార్యక్రమం మొదలు పెట్టింది పీవీ ప్రభుత్వమే. .!
ప్రధానిగా పనిచేసిన 5ఏళ్ల కాలంలో పీవీ పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. కొన్ని సందర్భాల్లో ఆయన మెతకగా వ్యవహరిస్తారని, మౌనంగా ఉంటారనే అభిప్రాయాలే తప్ప ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఏ ఒక్క విమర్శ రాకపోవడం ఆయన పాలన తీరుకు నిదర్శనం. గతాన్ని, రాబోయే భవిష్యత్తును ఏ మాత్రం ఆలోచించకుండా ప్రస్తుతం ఏం చేస్తే దేశానికి, ప్రజలకు మేలు జరుగుతుందనే అజెండాతోనే పీవీ ముందుకు వెళ్లారని ఆయన సన్నిహితులు, దగ్గర నుంచి చూసినవారు చెప్తుంటారు.
రాజకీయాల్లో క్షణం తీరిక లేకపోయినా పీవీ తన రచనా వ్యాసంగాన్ని విడిచిపెట్టలేదు. విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన ‘వేయిపడగలు’కు హిందీ అనువాదం రాసారు. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ‘పన్ లక్షత్ కోన్ ఘతో’ అనే మరాఠీ పుస్తకాన్ని ‘అబల జీవితం’ అనే పేరుతో తెలుగు అనువాదం చేసారు. అనేక వ్యాసాలు రాసారు.
పీవీ నర్సింహారావు సత్యమ్మరావును వివాహం చేసుకున్నారు. 1970, జూలై 1 న ఆమె కన్నుమూసారు. పీవీకి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. తన ఆత్మకథ రెండో భాగం రాసే ఉద్దేశం ఉండేదట పీవీకి. అది నెరవేరకుండానే 2004, డిసెంబర్ 23న పీవీ కన్నుమూసారు. ఆయన స్మృత్యర్ధం హైదరాబాదులో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ కు ‘పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే’ అని పేరుపెట్టారు. తాజాగా కేంద్రం దేశానికి పీవీ నర్సింహారావు అందించిన సేవలకు గాను అత్యున్నత పురస్కారం భారతరత్నకు ఎంపిక చేయడంపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజం భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న లభించడం విశేషం… 1963 లో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు జాకీర్ హుస్సేన్‌కి ఈ పురస్కారం అందిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు పీవీకి ఈ పురస్కారం దక్కడం విశేషం.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







