పాన్ ఇండియా రాకింగ్ స్టార్ - యశ్
- January 08, 2025
యశ్ ... ప్రస్తుతం భారత సినీ రంగంలో ట్రెండ్ సెట్టింగ్ హీరోగా నిలిచాడు. సాధారణ బస్ డ్రైవర్ కుటుంబంలో జన్మించిన యశ్ నటన పట్ల ఉన్న మక్కువతో రంగస్థల కళాకారుడిగా నట జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తన నటనతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులు సలామ్ రాఖీభాయ్ అనేలా చేశాడు. కెజిఎఫ్ సిరీస్ ద్వారా ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, కన్నడ సినీ పరిశ్రమకు పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాడు. నేడు పాన్ ఇండియా రాకింగ్ స్టార్ యశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా యశ్ సినీ ప్రయాణం గురించి మా గల్ఫ్ అందిస్తున్న ప్రత్యేక కథనం..
యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. 1986,జనవరి 8న కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా భువనహళ్ళి గ్రామంలో అరుణ్ కుమార్ గౌడ, పుష్ప దంపతులకు జన్మించాడు. తండ్రి కర్ణాటక ఆర్టీసీలో బస్ డ్రైవర్ గా పనిచేసేవారు. కన్నడ నటులైన రాజ్ కుమార్, అంబరీష్, శంకర్ నాగ్ మరియు విష్ణువర్ధన్ చిత్రాలు చూస్తూ చిన్నతనం నుంచే నటన పట్ల ఆసక్తి పెంచుకున్న యశ్, బీఏ డిగ్రీతోనే తన చదువును ఆపేశాడు.యశ్ తల్లిదండ్రులకు మాత్రం కొడుకు నటుడిగా మారడం అస్సలు ఇష్టం లేదు. యష్ బాగా చదువుకోవాలని ఉండేది. 300 రూపాయలు జేబులో పెట్టుకుని సూపర్ స్టార్ కావాలనే కోరికతో బెంగళూరు వచ్చి అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని ప్రముఖ రంగస్థల దిగ్గజం బి.వి.కారంత్ స్థాపించిన "బెనాక డ్రామా ట్రూప్" లో చేరాడు.
రంగ స్థలంలో కెరీర్ మొదలు పెట్టిన సమయంలోనే తన మాతృమూర్తి తనను పిలిచే "యశ్వంత్" పేరులోని మొదటి రెండక్షరాలు తీసుకోని "యశ్" గా తన స్టేజ్ నేమ్ పెట్టుకున్నాడు. "బలరామ" నాటికతో రంగస్థల కథానాయకుడిగా మారాడు. రంగస్థలంలో నటుడిగా బిజీగా ఉంటూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే బుల్లితెర మీద నటించడం మొదలు పెట్టాడు.
2004లో "ఉత్తరాయణ" అనే టెలీ సీరియల్లో నటించారు. 2005లో "నందగోకుల" అనే బుల్లితెర ధారావాహికలో నటించి తన నటనతో కన్నడ బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత నాలుగైదు ధారావాహికల్లో నటించిన యశ్ కన్నడ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. యశ్ కున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని భావించిన కన్నడ సినీ నిర్మాతలు, వరుసగా సినిమాలు తీస్తామని అతని వెంటపడినప్పటికి కథా ప్రాధాన్యమున్న "జంబాడ హుడుగి" చిత్రంతో సినీప్రవేశం చేశాడు. ఆ చిత్రంలో యశ్ సహాయ నటుడి పాత్రనే పోషించినా, తన నటనకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత మొగ్గిన మనసు చిత్రంతో యశ్ నటుడిగా పరిశ్రమలో స్థిరపడ్డాడు.
హీరోగా యశ్ నటించిన రాకీ (2008), గోకుల (2009) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 2010లో వచ్చిన మొదలస చిత్రంతో తోలి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత యశ్ నటించిన కిరాతక (2011), లక్కీ, జానూ, డ్రామా (2012), గుగ్లీ, రాజా హుళి(2013), గజకేసరి, Mr అండ్ Mrs రామాచారి (2014), మాస్టర్ పీస్(2015) చిత్రాలతో ఘన విజయాలను అందుకొని కన్నడ స్టార్ హీరోగా ఎదిగాడు.
2018లో యశ్ - నీల్ దర్శకత్వంలో వచ్చిన "కేజీఫ్ చాప్టర్ 1" చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో యశ్ నటనకు ఫిదా అయిన పాన్ ఇండియా ఆడియన్స్ "బాక్సాఫీస్ బాద్షా రాఖీ భాయ్" అంటూ రచ్చ రచ్చ చేశారు. ఈ ఒక్క సినిమాతో యశ్ తో పాటుగా కన్నడ చిత్ర పరిశ్రమకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. బాహుబలి మూవీ సిరీస్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా కేజీఎఫ్ చాప్టర్ 1 రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా వల్ల వచ్చిన మాస్ క్రేజ్ వల్ల ఒకానొక దశలో యశ్ బయట తిరగడానికి సైతం ఇబ్బంది పడ్డాడు. ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 (2022) చిత్రం సైతం ప్రేక్షకుల అంచనాలను అందుకొని పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించి యశ్ మానియా చెరిగిపోలేదని నిరూపించింది.
యశ్ వ్యక్తిగత జీవితానికి వస్తే తనతో పాటే సినిమాల్లో అడుగుపెట్టి తనతో పలు హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ రాధికా పండిట్ ను ప్రేమించి పెద్దల అంగీకారంతో 2016లో వివాహం చేసుకున్నారు. వీరికి అమ్మాయి ఐరా, అబ్బాయి ఆయుష్ ఉన్నాడు. యశ్ హీరోగా ఇంత సక్సెస్ ఫుల్ అవ్వడం వెనుక రాధిక పాత్ర చాలా కీలకం. తన సక్సెస్ లో ఆమెకు యశ్ ఎప్పుడూ క్రెడిట్ ఇస్తూనే ఉంటాడు.
యశ్ హీరోగా బిజీగా ఉన్నప్పటికి సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం యాక్టివ్ గా పాల్గొంటాడు. "యశోమార్గ" (YashoMarga) ఫౌండేషన్ ను స్థాపించి కొప్పల్ జిల్లాలో భూగర్భ నీటి వనరుల సంరక్షణకు కృషి చేస్తూ, ఇప్పటి వరకు ఆ జిల్లాలోని 40 గ్రామాల్లో నీటి వనరుల చెరువులను, వాగులను బాగు చేయించాడు. ఈ చర్యల వల్ల ఆ గ్రామాలకు సాగు, తాగు నీటి వనరులు సమకూరాయి. ప్రస్తుతం మరిన్ని గ్రామాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని యశ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఫౌండేషన్ కార్యక్రమాల్లో యశ్ సతీమణి రాధిక చురుగ్గా పాల్గొనడమే కాకుండా, ఫౌండేషన్ వ్యవహారాలను చూసుకుంటారు. ప్రస్తుతం మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో "టాక్సిక్" , బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో "రామాయణ" చిత్రాలతో బిజీగా ఉన్న ఈ వెండి తెర "రాఖీ భాయ్" ఇలా మరిన్ని పుట్టిన రోజులను జరుపుకోవాలని కోరుకుంటూ యశ్ కు " మా గల్ఫ్ " టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







