లెజెండరీ స్టార్ ప్రొడ్యూసర్-అరవింద్
- January 10, 2025
అల్లు అరవింద్ అంటే ఒకప్పుడు ‘మెగా కాంపౌండ్’కు పునాది! నేడు తమ కాంపౌండ్ హీరోలతో పాటు ఎందరో కథానాయకులతో అభిరుచి గల చిత్రాలు నిర్మిస్తూ సాగుతున్నారు అరవింద్. ‘గీతా ఆర్ట్స్‘ పతాకంపై అనేక చిత్రాలను నిర్మించి విజయపథంలో సాగిన అల్లు అరవింద్, ‘గీతా ఆర్ట్స్ -2’ పేరుతో మరికొందరు వర్ధమాన నిర్మాతలతో కలసి చిత్రాలను నిర్మిస్తున్నారు. అలుపెరుగకుండా సాగడమే అరవింద్ విజయరహస్యం అంటారు సన్నిహితులు. కాలానుగుణంగా ప్రణాళికలు రచిస్తూ సక్సెస్ ను తన చంకన పెట్టుకున్నారనీ అంటారు సినీ పండితులు. ఏది ఏమైనా వర్ధమాన నిర్మాతలకు అల్లు అరవింద్ ఓ రోల్ మోడల్ అని చెప్పక తప్పదు. నేడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ జన్మదినం. ఈ సందర్భంగా నిర్మాతగా ఆయన స్ఫూర్తి దాయకమైన సినీ ప్రయాణం మీద మా గల్ఫ్ అందిస్తున్న ప్రత్యేక కథనం..
టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ 1949 జనవరి 10న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ప్రముఖ హాస్య నటులు అల్లు రామలింగయ్య, కనక రత్నం దంపతులకు జన్మించారు. అరవింద్ చెన్నైలోనే డిగ్రీ వరకు చదువుకున్నారు. బాల్యం నుంచీ తండ్రి రామలింగయ్య నటునిగా పడే తపనను గమనించారు అరవింద్. తొలుత తండ్రి బాటలోనే పయనించాలని భావించారు. అయితే తాను ఒకరి చిత్రాల్లో నటించడం కాదు, తానే చిత్రాలు నిర్మించే స్థాయికి చేరాలని అభిలషించారు అరవింద్. అందుకు తగ్గట్టుగానే ‘గీతా ఆర్ట్స్’ సంస్థ నెలకొల్పి, దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘బంట్రోతు భార్య’ చిత్రాన్ని నిర్మించి, నిర్మాతగా తొలి అడుగు వేశారు .
దాసరి దర్శకత్వంలోనే ‘దేవుడే దిగివస్తే’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలు మంచి విజయం సాధించాయి. తెలుగులో నిర్మాతగా ఉంటూనే తమిళంలోని శివాజీగణేశన్ ‘బంగారుపతకం’, కమల్ హాసన్ ‘ఎత్తుకు పైఎత్తు’ వంటి అనువాద చిత్రాలను డబ్బింగ్ చేసి తెలుగువారికి అందించారు. తన బావగారైన మెగాస్టార్ చిరంజీవితో ‘యమకింకరుడు’ తీసి మెప్పించారు. ఆ తరువాత చిరంజీవిని స్టార్ గా నిలపడంలో “శుభలేఖ, మంత్రిగారి వియ్యంకుడు,” వంటి చిత్రాల నిర్మాణంలోనూ పాలుపంచుకున్నారు.
అరవింద్ తెలుగు చిత్రాలతో పాటుగా హిందీ, కన్నడ, తమిళంలో సైతం అనేక చిత్రాలను నిర్మించారు. చిరంజీవిని హిందీలో హీరోగా పరిచయం చేస్తూ ఆయన తీసిన ప్రతిబంద్ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న అరవింద్, ఆ పలు చిత్రాలను నిర్మించారు. అయితే 2008లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన 'గజని' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అరవింద్ సినిమా పంపిణీదారుగా మారి పలు ఇతర భాషా చిత్రాలను తెలుగులోకి సంచనల విజయాలను అందుకున్నారు. పెళ్ళిసందడి, మగధీర చిత్రలకు గానూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులను అందుకున్నారు. ఇవే కాకుండా పలు ప్రతిష్టాత్మక అవార్డులను సైతం అందుకున్నారు.
ఓ చిత్రాన్ని ఏ బడ్జెట్ లో నిర్మించవచ్చు, దానిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళ వచ్చు. అన్న అంశాలలో అరవింద్ లా ఎవరూ ప్రణాళికలు అల్లలేరని ప్రతీతి. చిరంజీవిని ‘మెగాస్టార్’గా నిలపడంలోనూ అల్లు అరవింద్ కృషిని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. నాటి స్టార్ హీరోస్ నడుమ చిరంజీవిని నిలపడానికి అరవింద్ ఎంత శ్రద్ధ వహించారో ఈ నాటికీ కథలుగా చెప్పుకుంటారు. చిరంజీవి ఓ సినిమా అంగీకరించగానే, దానిని ఏ తీరున తెరకెక్కించాలి అన్న అంశం మొదలు, నిర్మాణానికి ఎంత వ్యయం చేయాలి, పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెట్టాలి అన్న ప్రణాళికలు రూపొందించి సదరు నిర్మాతలకు అందజేసేవారు. అంతేకాదు, ఏ సెంటర్ లో ఎలాంటి కటౌట్స్ పెట్టాలి అన్న అంశంలోనూ అరవింద్ పాత్ర ఉండేది అంటే ఆయన ఎంతలా శ్రమించేవారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
చిరంజీవికి, ఆయన అభిమానులకు అరవింద్ వారధిగా ఉండేవారు. అందుకే చిరంజీవితో గీతా ఆర్ట్స్ పతాకంపై అరవింద్ ఓ చిత్రం నిర్మిస్తున్నారంటే అభిమానులు అది తమ సొంత చిత్రంగా భావించేవారు. అరవింద్ కూడా అభిమానులను ఆనందింప చేసే ‘పసివాడి ప్రాణం, అత్తకు యముడు- అమ్మాయికి మొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య’ వంటి చిత్రాలను తీసి అలరించారు. ఆ సినిమాలు ఇప్పటికీ అభిమానుల మదిలో ఆనందం వెదజల్లుతూనే ఉండడం విశేషం.
చిరంజీవిని తెలుగునాట మెగాస్టార్ గా నిలిపిన అరవింద్, చిత్రసీమలో మెగా కాంపౌండ్ కు బలమైన పునాదులు వేసిన రూపశిల్పి అని చెప్పక తప్పదు. ఒకప్పుడు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య ఒక్కరే వారి కుటుంబంలో నటుడు. అరవింద్ కూడా కొన్ని చిత్రాల్లో కామెడీ రోల్స్ పోషించారే కానీ, ఏ నాడూ సీరియస్ గా నటనపై దృష్టి సారించింది లేదు. అయితే తమ కుటుంబంలోకి చిరంజీవి రాగానే, అరవింద్ తన నట కుటుంబాన్ని విస్తరించారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ను ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’తో హీరోగా జనం ముందు నిలిపిందీ ఆయనే, పవన్ ను దర్శకునిగా ‘జాని’తో పరిచయం చేసిందీ ఆయనే. ఇక పవన్ కు ‘జల్సా’ వంటి అదిరిపోయే హిట్ అందించింది కూడా ఆయనే.
తన తనయుడు అల్లు అర్జున్ ను ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా పరిచయం చేసి, తరువాత స్టైలిష్ స్టార్ గా ఎదగడానికీ దోహదపడిందీ ఆయనే. చిరంజీవి తనయుడు, తన మేనల్లుడైన రామ్ చరణ్ కు కెరీర్ లోనే భారీ బిగ్ హిట్ గా నిలిచిన ‘మగధీర’ను నిర్మించింది కూడా ఆయనే. వీరేకాదు చిరంజీవి కుటుంబానికి చెందిన సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి వారిని హీరోలుగా నిలపడంలోనూ ప్రముఖ పాత్ర పోషించారు. వెరసి తెలుగు చిత్రసీమలో ‘మెగా కాంపౌండ్’ ఇంత పటిష్టంగా ఉండడానికి అరవిందే కారణమని అందరికీ తెలుసు.
ఓ వైపు చిత్ర నిర్మాణంలో బిజీగా ఉంటూనే అరవింద్ పలు వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ మరియు ‘ఆహా’ ఓటీటీ నిర్వహణ, తనయులు, బంధువుల చిత్రాల ప్లానింగ్ అన్నిటా అరవింద్ గారు ఏదో విధంగా పాలుపంచుకుంటూ ఎల్లప్పుడూ బిజీ బిజీగానే సాగుతున్నారు. అలుపెరుగని అరవింద్ ను చూసి సినీజనం ‘ఆహా’ అంటూ ఉంటారు, సాధారణ ప్రేక్షక లోకం ‘ఓహో’ అనీ అభినందిస్తూ ఉంటుంది. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







