స్వర రాజ చక్రవర్తి-కె.జె.యేసుదాస్

- January 10, 2025 , by Maagulf
స్వర రాజ చక్రవర్తి-కె.జె.యేసుదాస్

అవమానాలు..ఆయన్ని రాటుదేల్చాయి.పేదరికపు పరిహాసాలు..ఆయనకు లక్ష్యనిర్దేశం చేశాయి.ఆ అనుభవ పాఠాలతోనే ఆయన ‘స్వర చక్రవర్తి’ అయ్యారు. ‘నీ గొంతు.. పాటకు పనికిరాద’న్న వాళ్లకు పాటతోనే సమాధానం చెప్పారు. ఆయనే.. భక్తి పాట, సినిమా పాట.. ఏ పాటకైనా ప్రాణం పోసే గాయకులు యేసుదాస్. ఏ భాషలో పాడినా అది ఆయన మాతృభాషేమో అన్నంత స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటుంది. జీవితాన్ని సంగీతానికి అంకితమిచ్చిన గాన గంధర్వుడు ఆయన. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఘనత యేసుదాసుది. ఇటు శాస్త్రీయ సంగీతం.. అటు సినీ సంగీతం.. ఏదైనా ఎదలోతుల్లో మధురమైన ముద్ర వేయడం ఆ స్వరం ప్రత్యేకతగా చెప్పొచ్చు.  ఆయన పాడిన పాటలు ఎన్నివిన్నా ఆ కంఠంలోని మాధుర్యం ఇట్టే ఆకట్టుకుంటుంది. ‘హరివరాసనం’ అంటూ ఆయన పాట పాడిన తర్వాతే హరిహరసుతుడు అయ్యప్పస్వామి నిద్రకు ఉపక్రమిస్తాడు. అంతటి గొప్ప గౌరవం దక్కించుకున్నారు యేసుదాసు. నేడు స్వర చక్రవర్తి కె.జె.యేసుదాస్ గారి జన్మదినం.  

యేసుదాసు గారి పూర్తి పేరు కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్. ఆయన్ని కొందరు జేసుదాస్ అని కూడా పిలుస్తారు. 1940, జనవరి 10న నాటి కొచ్చి రాజ్యంలో భాగమైన ఫోర్ట్ కొచ్చిలో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన రోమెన్‌ కేథలిక్‌ సాంప్రదాయానికి చెందిన అగస్టీన్‌ జొసెఫ్‌, ఆలిస్‌ కుట్టి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత విద్వాంసులు, నటుడు. తల్లి చర్చిలో పాటలు పాడేవారు. 

తల్లిదండ్రుల ప్రభావంతో బాల్యం నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ అదే తన జీవిత గమ్యంగా చేసుకుని ఆర్‌.ఎల్‌.వి మ్యూజిక్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత తిరువనంతపురంలోని స్వాతి తిరునాళ్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ లో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగారు, శ్రీ కె.ఆర్‌. కుమారస్వామి దగ్గర శిష్యరికం చేస్తూ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఆ కాలేజీలో శిక్షణ సగంలో ఆగిపోయినా చెంబై వైద్యనాథ భాగవతార్‌ వద్ద శిక్షణ పొందుతూ ఉండేవారు. తర్వాత ఆర్‌.ఎల్‌.వి మ్యూజిక్‌ అకాడమీలో గానభూషణం కోర్సును పూర్తి చేశారు. 

ఇదే సమయంలో యేసుదాస్ గారి తండ్రి ఆకస్మిక మరణంతో కుటుంబ పోషణ కోసం తెలిసిన వాళ్ళ ద్వారా సంగీత కచేరీలు చేస్తూ వచ్చారు.  1961 నవంబర్‌ 14న యేసుదాసు మొదటి ప్లే బ్యాక్‌ రికార్డింగ్‌ మలయాళంలో జరిగింది. ఆ పాట బాగా ప్రాచుర్యం పొంది.. అప్పటి నుంచి శాస్త్రీయ సంగీత కళాకారుడిగా ఎంత ప్రతిభ కనబరుస్తూ ఎదిగారు. అంతేకాకుండా సినీ సంగీత జగత్తులో కూడా తన మధురమైన గాత్రంతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో పాటలు పాడారు. మనదేశ భాషల్లోనే కాక మలేషియన్‌, రష్యన్‌, అరబిక్‌, లాటిన్‌, ఆంగ్ల భాషలలో కూడా పాడి శ్రోతలను మెప్పించారు. 

 యేసుదాస్ గారు ఎన్నో భక్తి పాటలు ఆలపించారు. ఆ పాటలు వింటే చాలు.. దైవం మన కళ్ల ముందే ఉందనే భావన కలుగుతుంది. మతానికి అతీతంగా ఆయన ఆలపించిన గేయాలు.. ఇప్పటికీ ఆలయాల్లో మారుమోగుతూనే ఉంటాయి. అయ్యప్ప స్వామి మొదలుకుని శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, శివుడిపై వివిధ భాషల్లో ఆయన అనేక పాటలు ఆలపించారు. 

శబరిమల ఆలయంలో స్వామివారికి రోజూ పవళింపు సేవ సమయంలో ఈ మహా గాయకుడు పాడిన జోలపాటనే వినిపిస్తారు. స్వామివారి పవళింపు సేవ వేళ పాడే ‘హరివరాసనం’ పాట ఎంత గుర్తింపు పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయ్యప్ప దీక్ష తీసుకునే ప్రతి భక్తుడి సెల్‌ఫోన్లో ఈ పాట తప్పకుండా ఉంటుంది. మరి అంతటి ప్రాశస్త్యం పొందిన పాటను ఆయన స్వామివారి సన్నిధిలో స్వయంగా ఆలపించి, తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నారు. ఆయన వేరే మతానికి చెందిన వారైనా అయ్యప్ప స్వామి సన్నిధిలో కచేరీలు నిర్వహించి, శబరిగిరీశుడి పట్ల తనుకున్న భక్తిని చాటుకుంటూనే ఉన్నారు.

6 దశాబ్దాలు క్రితం సినీ సంగీత సామ్రాజ్యంలో అడుగుపెట్టి యేసుదాస్ గారు 40 వేలకు పైగానే పాటలు ఆలాపించారు. సుమారు 14 పైగా  భాషల్లో సినిమాలు, ప్రైవేటు ఆల్బంలు, భక్తిరస గీతాలు కలుపుకుని సుమారు లక్షకుపైగా పాటలు పాడిన సింగింగ్ లెజెండ్ ఆయన. ఇంక తెలుగులో ఆయన ఆలపించిన  ‘నిరీక్షణ’లో ‘చుక్కల్లో..’, ‘మేఘసందేశం’లో ‘ఆకాశదేశాన..’, ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రంలో ‘అందమైన వెన్నెలలోన..’, ‘అల్లుడుగారు’లో ‘ముద్దబంతి పూవులో..’, ‘పెదరాయుడు’లో ‘కదిలే కాలమా..’ ఇలా ఆయన పాడిన పాటలు ఎన్నివిన్నా ఆ కంఠంలోని మాధుర్యం ఇట్టే ఆకట్టుకుంటుంది. సీనియర్ హీరో మోహన్ బాబుకు ఆయన గాత్రం అంటే ఎంతో ఇష్టం. హీరోగా నటిస్తున్న సమయంలో మోహన్ బాబు సినిమాల్లో ఒక్క పాటైన దాసు గారు కచ్చితంగా పాడాల్సిందే!   

యేసుదాస్ గారి ప్రతిభకు గానూ పలు అవార్డులు లభించాయి. 1975లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, 2002లో పద్మవిభూషణ్‌ బిరుదుతో ఆయన్ను గౌరవించారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆయన పలు చలన చిత్రోత్సవాల్లో అవార్డులతో సత్కరాలు అందుకున్నారు. జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డు అత్యధికంగా ఏడుసార్లు అందుకున్న ఏకైక వ్యక్తి ఆయనే. కేరళ ప్రభుత్వం నుంచి 24 సార్లు ఉత్తమ గాయకుడి అవార్డు సొంతం చేసుకున్నారు. ఇదీ ఓ రికార్డు. తమిళనాడు ప్రభుత్వం నుంచి 8 సార్లు, కర్ణాటక ప్రభుత్వం నుంచి 5 సార్లు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి 6 సార్లు, పశ్చిమ్‌బంగా ప్రభుత్వం నుంచి ఒకసారి ఆయన ఉత్తమ గాయకుడి అవార్డులు పొందారు.  

 ‘ప్రస్తుతం సినిమా పాటల స్పీడూ పెరిగింది, స్టైలూ మారింది’ అంటారు యేసుదాసు. ప్రస్తుతం సినిమాకు దూరంగా ఉంటున్నా.. ఆయన కంఠం నుంచి జాలు వారిన ఆ ‘స్వరరాగ గంగా ప్రవాహం’ ఎప్పటికీ పొంగిపొర్లుతూనే ఉంటుంది.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com