ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్-ద్రవిడ్
- January 11, 2025
క్రికెట్లో నిలకడ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం అతడు.టెక్నిక్ విషయంలో దిగ్గజాలనే మైమరిపించాడు. ఎంతోమందికి రోల్ మోడల్. జట్టు కోసం కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. కీపర్ లేడు అంటే నేనున్నా అంటాడు. ఓపెనర్ లేడు, లేక వన్‌డౌన్‌లో సేవలు కావాలన్నా.. మిడిలార్డర్లో వికెట్లకు గోడ కట్టాలన్నా అతడే గుర్తుకొస్తాడు. అతడెవరో కాదు క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్. క్రికెట్‌కు భారత్ అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మన్ రికార్డు నమోదు చేశాడు. టీమిండియాకు 16 ఏళ్ల పాటు సేవలందించిన రాహుల్ ద్రవిడ్‌ను అభిమానులు ద వాల్, మిస్టర్ డిపెండబుల్, కెప్టెన్ కూల్‌గా పిలుచుకుంటారు. నేడు ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజు.
రాహుల్ ద్రవిడ్ పూర్తి పేరు రాహుల్ శరద్ ద్రవిడ్. 1973, జనవరి 11న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పట్టణంలో మరాఠా దేశస్థ మూలాలు ఉన్న శరద్ ద్రవిడ్, పుష్ప దంపతులకు జన్మించాడు. రాహుల్ తండ్రి శరద్ జామ్ తయారీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసేవారు. ద్రవిడ్ పుట్టిన కొద్దీ కాలానికే తండ్రి ఉద్యోగరీత్యా వారి కుటుంబం ఇండోర్ నుంచి కర్ణాటక రాజధాని బెంగుళూరుకు వచ్చి స్థిరపడింది. రాహుల్ బాల్యం, విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులోనే గడిచింది. బెంగుళూరులోని సెయింట్ జోసెప్స్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బీకామ్ డిగ్రీని పూర్తి చేసిన రాహుల్ అదే కాలేజీకి చెందిన సెయింట్ జోసెప్స్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు.
చిన్నతనంలోనే క్రికెట్‌పై ఎక్కువ ఆసక్తి పెంచుకున్న ద్రవిడ్.. 12 ఏళ్ల నుంచి స్కూలు, కాలేజీ క్రికెట్లో రాణించాడు. కర్ణాటక తరపున అండర్- 15, అండర్ - 17, 19 లలో ఆడుతున్న సమయంలోనే రాహుల్ ప్రతిభను గుర్తించిన టీం ఇండియా మాజీ క్రికెటర్ మరియు కోచ్ కేకి తారపోరే, తన శిక్షణలో రాహుల్ ఆటకు మెరుగులు దిద్దారు. రాహుల్‌తో పాటుగా వెటరన్ ఇండియన్ బౌలర్ అనిల్ కుంబ్లేకు సైతం శిక్షణ ఇచ్చారు. 1991 నుంచి కర్ణాటక తరపున రంజీల్లో ఆడడం మొదలు పెట్టిన రాహుల్ తన భవిష్యత్తు టీం ఇండియా సహచరులైన కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్ మరియు వెంకటేష్ ప్రసాద్‌లతో జట్టులో రాణించడం మొదలు పెట్టాడు. 1991-95 వరకు కర్ణాటక తరపున దేశవాళీ టోర్నీల్లో రాణించి టీం ఇండియా జట్టులో చోటు సంపాదించుకున్నాడు.
1994లో జరిగిన విల్స్ వరల్డ్ సిరీస్ టోర్నీ చివరి రెండు మ్యాచుల కోసం ద్రవిడ్ మొదటిసారిగా ఇండియా జట్టుకు ఎంపికైనా, ఆడేందుకు అవకాశం దక్కలేదు. ఆ తర్వాత తిరిగి దేశవాళీ టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శనలు చేస్తున్నప్పటికి 1996 ప్రపంచ కప్ ఇండియా జట్టులో సైతం రాహుల్‌కు సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. తనతో పాటుగా రంజీల్లో ఆడిన కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్‌లకు మాత్రం చోటు దక్కడం ద్రవిడ్‌ను నిరాశకు గురిచేసినా, అదే ఏడాది జరిగిన రంజీ టోర్నీలో కర్ణాటకను గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించి ఇండియా జట్టులో ద్రవిడ్ చోటు సంపాదించాడు. వన్డేల్లో శ్రీలంక, టెస్టుల్లో ఇంగ్లాండ్ మీద రాహుల్ అరంగేట్రం చేశాడు.
1996-12 వరకు సుమారు 16 ఏళ్ళ పాటు టీం ఇండియా జట్టు విజయాల్లో కీలకమైన పాత్ర పోషించాడు. బ్యాట్సమెన్‌గానే కాకుండా కీపింగ్ బౌలింగ్ మరియు ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణించాడు ద్రవిడ్. సౌరవ్ గంగూలీ తర్వాత 2003 నుంచి 2007 వరకు టీమ్ ఇండియా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు. ద్రవిడ్ హయాంలోనే టీం ఇండియా జట్టులోకి ధోని, యువరాజ్, సురేష్ రైనా, ఆశిష్ నెహ్రా, ప్రవీణ్ కుమార్ వంటి పలువురు యువ ఆటగాళ్లు వాళ్ళు జట్టులోకి వచ్చి తర్వాత జట్టు విజయాల్లో కీలకమైన పాత్ర పోషించారు. సొసైన ఆట తీరుతో పాటుగా టైమింగ్‌తో కచ్చితమైన షాట్లను ఆడడంలో ద్రవిడ్ మించిన వారు ఇప్పటికి టీం ఇండియాలో లేరంటే అతిశయోక్తి కాదు.
క్రికెట్ ప్రపంచంలో "జెంటిల్‌మ్యాన్ గేమ్"గా గుర్తింపబడిన టెస్ట్ క్రికెట్లో ఇండియాను గట్టెక్కించ గలిగిన సత్తా ఉన్న ఏకైక ఆటగాడిగా ద్రవిడ్‌కు పేరుంది. టీం ఇండియా టెస్ట్ క్రికెట్ జట్టుకు ద్రవిడ్ చేసిన ఎల్లప్పుడూ గుర్తుంచుకోదగ్గవి. ఇండియాను అనేక మార్లు ఘోర పరాజయాలను చవి చూడకుండా డ్రా చేసి భారత జట్టును కాపాడిన ఘనత ద్రవిడ్ సొంతం. అందుకే ద్రవిడ్‌ని ఇండియా అభిమానులు "ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్" గా పిలుచుకుంటారు.
2001లో భారత్ పర్యటనకు వచ్చిన ఆసీస్ జట్టు తొలి టెస్టులో గెలిచింది. కోల్‌కత్తాలో జరిగిన రెండో టెస్టులో భారత్ ఫాలో ఆన్ ఆడింది. ఆ మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ (281 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్‌కు ద్రవిడ్ 180 పరుగుల కీలక ఇన్నింగ్స్ తోడైంది. దీంతో ఆ టెస్ట్ నెగ్గిన భారత్, అదే జోరులో మూడో టెస్టులో విజయం సాధించి ఆ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
16 ఏళ్ళ పాటు టీం ఇండియా జట్టులో కొనసాగిన ద్రవిడ్ 2012లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 164 టెస్టుల్లో 36 శతకాలు, 63 అర్ధశతకాల సాయంతో 13,288 పరుగులు చేశాడు. 344 వన్డేల్లో 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీల సాయంతో 10,889 పరుగులు సాధించాడు. ఓ టీ20 మ్యాచ్‌లో 31 పరుగులు సహా అంతర్జాతీయ క్రికెట్లో 24,208 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న 5వ భారత క్రికెటర్ ద్రావిడ్. అతడి కంటే ముందు బిషన్ సింగ్ బేడీ, సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే మాత్రమే ఉన్నారు.
క్రికెట్లో ద్రవిడ్ అందించిన సేవలకుగానూ కేంద్రం 1998లో అర్జున అవార్డు, 2004లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ అవార్డులను ప్రదానం చేసింది. 2004లో ఐసీసీ ప్రకటించిన ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని రాహుల్ ద్రవిడ్ సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెటర్ ద్రవిడ్.
రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సైతం ఆడాడు. 2008-13 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 89 ఐపీఎల్ మ్యాచులు ఆడిన ద్రవిడ్ 2174 పరుగులు సాధించాడు. ఐపీఎల్ నుంచి రిటైర్ అయిన తర్వాత రాజస్థాన్ జట్టుకు కోచ్, మెంటార్‌గా వ్యవహరిస్తూ ఆ జట్టు మెరుగైన ప్రదర్శనలు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్న సమయంలోనే కొంతకాలం బ్రేక్ తీసుకోని 2025లో మళ్ళీ ఆ జట్టు మెంటర్ బాధ్యతల్లో చేరాడు.
రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్ పాత్రలోకి మారాడు. ఐపిఎల్ టోర్నీలో రాజస్థాన్ జట్టు కోచ్‌గా మెరుగైన ఫలితాలను రాబట్టడం ద్వారా బీసీసీఐ ద్రవిడ్‌ను టీం ఇండియా కోచ్ పదవిని ఆఫర్ చేసినప్పటికి సున్నితంగా వద్దనడంతో అండర్ 19, భారత్ ఏ లాంటి జట్లకు కోచ్‌గా నియమించింది.మెరుగైన క్రికెటర్లు దొరికితే ఎవరైనా కోచింగ్ ఇవ్వగలరు కానీ ద్రావిడ్ లాంటి టెక్నికల్ కోచ్‌లు మాత్రమే అత్యుత్తమ ఆటగాళ్లను జాతీయ జట్టుకు అందిస్తారు. అండర్ 19, భారత్ ఏ లాంటి జూనియర్ జట్ల నుంచి ఇండియా జట్టుకు ఆణిముత్యాలను అందించడమే లక్ష్యంగా పనిచేసి సఫలీకృతం అయ్యాడు.
ద్రవిడ్ కోచింగ్‌లో రాటుదేలిన కుర్రాళ్లు గతేడాది అండర్ 19 ప్రపంచ కప్‌ను సునాయాసంగా కైవసం చేసుకున్నారు. ఫైనల్లో 8 వికెట్లు తేడాతో పటిష్ట ఆస్ట్రేలియా జట్టుపై భారత్ ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత 2019-21 వరకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టి, ఆటగాళ్లకు తన విలువైన సలహాలతో మెంటారింగ్ ఇస్తూ వారిలో స్ఫూర్తి నింపేవాడు. రాహుల్ హయాంలోనే ఎంతో మంది ఆటగాళ్లు అకాడమీలో ఆటగాళ్లు విలువైన కెరీర్ సలహాలను పొందారు అంటారు క్రికెట్ విశ్లేషకులు.
జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ బాధ్యతల్లో ఉన్న సమయంలోనే ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ(అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు) రవిశాస్త్రి అనంతరం కోచ్‌గా ఉండేలా ద్రవిడ్‌ను ఒప్పించగలిగారు. కానీ కోచింగ్ ద్రవిడ్‌కు పూల పాన్పేమీ కాలేదు. 2021లో టీం ఇండియా హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు.
జట్టులో నుంచి దశాబ్దం క్రితమే బయటకు వచ్చిన రాహుల్ మళ్ళీ కోచ్‌గా జట్టుకు దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యతను తన భుజాన వేసుకొని, జట్టులోని సీనియర్ ఆటగాళ్లకు తగిన ప్రాధాన్యత ఇస్తూనే జూనియర్లకు ఛాన్సులు కల్పిస్తూ వచ్చారు. రాహుల్ హయాంలోనే కోహ్లీ నుంచి రోహిత్ టీం ఇండియా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. ఈ మార్పు వల్ల చాలా మంది దేశవాళీ టోర్నీల్లో అదే కొత్త ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశాలు లభించాయి.
కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ద్రవిడ్, ఆరంభంలోనే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. కోహ్లి కెప్టెన్సీపై రగడ, టీమ్‌లో రేగిన అలజడి సయమంలో అశాంతిని చల్లార్చి, ఆటపై పూర్తిగా ఏకాగ్రత నిలిపేలా చేశారు ద్రవిడ్. అదే ఆయన సాధించిన మొదటి విజయం. కానీ, కోచ్‌గా మొదట్లో ద్రవిడ్‌కు అంతగా మంచి పేరు ఏమీ రాలేదు. అందుకు మేజర్ టోర్నీల్లో టీమ్ఇండియా ప్రదర్శనే కారణం. 2022 ఆసియాకప్, టీ20 ప్రపంచకప్పుల్లో భారత్ జట్టు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్ ఓడిపోడవడం వల్ల ద్రవిడ్‌పై విమర్శలు వచ్చాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా, మౌనంగా 2023 వన్డే ప్రపంచకప్‌కు జట్టును ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం చేశారు.
2023 ప్రపంచకప్‌నకు తగిన కూర్పు కోసం సంవత్సరం ముందు నుంచే ప్రక్రియను మొదలుపెట్టారు ద్రవిడ్. ప్రపంచకప్‌లో ఆడగలరు, వారి అవసరం ఉందనుకున్న ఆటగాళ్లను గుర్తించి వారిపైనే దృష్టిసారించడమే ఆయన చేసిన మొదటి పని. అలాగే ఆ ఆటగాళ్లకు తగినన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం కల్పించారు. సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్‌తో కలిసి గొప్ప సమన్వయంతో వ్యవహరించిన ద్రవిడ్, 24 మంది ఆటగాళ్లతో ఓ పూల్‌ను సిద్ధం చేశారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రపంచకప్‌కు కొన్ని నెలల ముందు భారత జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లంతా ఈ పూల్‌లోని వాళ్లే ఉంటారు. మరొకరు కనిపించరు. ఇందులో నుంచే ప్రపంచకప్ జట్టును ఎంపిక చేశారు.
ద్రవిడ్ ముందు చూపు, పక్కా ప్రణాళికకు ఇది ఓ సూచిక కనిపిస్తుంది. వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాల్లో ద్రవిడ్ ముద్ర స్పష్టం. జట్టును టీ20 ప్రపంచకప్‌కు గొప్పగా సమాయత్తం ద్రవిడ్ చేశారు. అయితే వన్డే ప్రపంచకప్‌తోనే తన పదవీకాలం ముగిసినా, ప్రస్తుత టోర్నీ వరకు కొనసాగడానికి అంగీకరించి, జట్టు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా చేశారు ద్రవిడ్. అన్నింటికన్నా మిన్నగా తన స్నేహశీలతతో ఆటగాళ్లందరి విశ్వాసాన్ని, అభిమానాన్ని, గౌరవాన్ని పొందడం ద్రవిడ్ సాధించిన అతి పెద్ద విజయం. 2024లో టీం ఇండియా రెండో సారి టీ20 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో ద్రవిడ్ ఇండియా కెప్టెన్‌గా సాధించలేకపోయిన ట్రోఫీని హెడ్‌కోచ్‌గా సాధించి తన కోచ్ పదవికి ఘనమైన ముగింపు పలికాడు. వైఫల్యాల నుంచే విజయాలకు బాటలు వేసుకున్న ద్రవిడ్ జీవితం ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







