సినిమా రివ్యూ:‘డాకు మహారాజ్’
- January 12, 2025
సంక్రాంతి బాలయ్యకు బాగా కలిసొచ్చ పండగ. ప్రతీ ఏడాది సంక్రాంతి రేస్‌లో ఖచ్చితంగా తన సినిమా వుండేలా, ఫ్యాన్స్‌కి తన తరపున అసలు సిసలు సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చేలా చూసుకుంటాడు బాలయ్య. అలా ఈ ఏడాది వరుస విజయాలతో జోరు మీదున్న బాబి కొల్లి దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. మరి, సినిమా పండగ అంచనాల్ని అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.‘
కథ:
చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రాంతంలోని ఓ కాఫీ ఎస్టేట్‌లో కథ మొదలవుతుంది. అక్కడ కాఫీ ఎస్టేట్ ముసుగులో జంతువుల చర్మం, ఏనుగు దంతాల స్మగ్లింగ్ చేస్తుంటారు లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు (రవికిషన్) ఆయన తమ్ముడు మనోహర్ నాయుడు. ఎస్టేట్ ఓనర్ మనవరాలు అయిన బేబీ వైష్ణవికి ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు నుంచి ప్రాణ హాని వుంటుంది. ఆ బేబీని ఎలాగైనా చంపాలని అతని మనుషులు వెతుకుతుంటారు. ఈ నేపథ్యంలో భోపాల్‌లో వున్న డాకు మహారాజ్‌కి ఆ పాపని కాపాడే బాధ్యత అప్పచెబుతారు. నానాజీగా పేరు మార్చుకుని మదనపల్లెకి చేరిన బాలకృష్ణ ఆ పాపని కాపాడడానికి ఏం చేశాడు.? అసలు నానాజీ డాకు మహారాజ్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది.? చంబల్ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసుడు (బాబీ డియోల్) నుంచి అదే ప్రాంత ప్రజలు భగవంతుడిగా కొలిచే సీతారామ్ (బాలకృష్ణ) పాత్ర సంగతేంటీ.? కావేరి (ప్రగ్య జైశ్వాల్)కీ డాకు మహరాజ్‌కీ సంబంధం ఏంటీ.? నందిని (శ్రద్ధా శ్రీనాధ్) పాత్ర కథను ఏ మేర కీలక మలుపు తిప్పింది.? అసలు డాకు మహారాజ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటీ.? బేబీ వైష్ణవిని నానాజీ కాపాడగలిగాడా.? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే సినిమాని ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
నానాజీ, డాకు మహారాజ్, ఇంజనీర్ సీతారామ్.. ఇలా మూడు రకాల వేరియేషన్స్ వున్న పాత్రల్లో బాలకృష్ణ నటించారు ఈ సినిమాలో. మూడు పాత్రల్లోనూ తనదైన పర్‌పామెన్స్‌తో ఆకట్టుకున్నారు. తెరపై యాక్టివ్‌గా కనిపించడంతో పాటూ, ఎట్రాక్టివ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ని కట్టి పడేశారు. అక్కడక్కడా తనకు కొట్టిన పిండి అయిన రాయలసీమ యాసతో నందమూరి నటసింహం అనిపించుకున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొన్న ‘కంగువ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు ఈ సినిమాలోనూ తనదైన విలనిజంతో ఆకట్టుకున్నారు. అయితే సెకండాఫ్‌లో బాబీ డియోల్ పాత్ర ఎంటర్ అవుతుంది. ఫస్టాఫ్‌లో రవికిషన్ తనదైన విలనిజంతో సీరియస్‌గా కనిపిస్తూనే కొంత ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతారు. హీరోయిన్లలో శ్రద్ధా శ్రీనాద్ నందినిగా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో కనిపించింది. తక్కువ స్కోప్ వున్న పాత్రే అయినా మరోసారి ఆమె తన టాలెంట్‌తో కట్టిపడేసింది. ప్రగ్యా జైశ్వాల్ కావేరి పాత్రలో కాస్త ఎక్కువ లెంగ్త్ వున్న పాత్రలోనే కనిపించింది. మరో అందాల భామ ఊర్వశి రౌతెలాకి ఈ సినిమాలో స్సెషల్ సాంగ్‌తో పాటూ, కొన్ని సీన్లు కూడా దక్కాయ్. ఎస్.ఐ పాత్రలో తనదైన నటనతో పాటూ, హీటెక్కించే అందాలతోనూ కనువిందు చేసింది. సచిన్ ఖేడ్కర్, ఛాందినీ చౌదరి తదితర నటీ నటులు తమదైన పాత్రల్లో పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
బాలయ్య అంటేనే మాస్.. మాస్ అంటేనే బాలయ్య. అయితే ఈ సారి మాత్రం బాలయ్య ఎక్కువ ఓవరాక్షన్ చేయకుండా, పరిధి మేర నటించారు. బోయపాటి సినిమాల్లో మాదిరి మితిమీరిన మాస్ ఎలిమెంట్స్‌కి అవకాశమున్నప్పటికీ చాలా కంట్రోల్‌గా సెటిల్ ఫర్‌ఫామెన్స్ చేయించాడు బాలయ్యతో డైరెక్టర్ బాబీ. ‘డాకు మహారాజ్ కొత్త కథేమీ కాకున్నా.కథనంలో కొత్తదనంతో ఆకట్టుకున్నాడు. తొలి భాగం పాత్రల పరిచయంతో సాఫీగా సాగిపోతుంది. రెండో భాగంలోనే అసలు కథ మొదలవుతుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించడంలో బాబీ సక్సెస్ అయ్యాడు. యాక్షన్ అంశాల్ని కొత్తగా చూపించాడు. విజయ్ కెమెరా పనితనం బాగుంది. ఫస్టాఫ్‌లో గ్రీనరీ విజువల్స్ సెకండాఫ్‌కొచ్చేసరికి డ్రై బ్యాక్ డ్రాప్‌ని అందంగా చూపించారు. థమన్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో హైలైట్. హీరో ఎలివేషన్ సీన్లలో అదిరిపోయే బీజీఎమ్‌తో ఆకట్టుకున్నాడు మరోసారి థమన్. డైలాగ్స్ బాగున్నాయ్. బాలకరృస్ణ మార్క్‌లో వున్నాయ్. బాలయ్య నోట ఎలాంటి డైలాగ్స్‌ని ఫ్యాన్స్ ఆశిస్తారో ఆ తరహా డైలాగ్స్‌నే భాను భొగవరపు రచించారు. స్క్రీన్ నిండా ఆర్టిస్టులతో నింపేశాడు దర్శకుడు బాబీ. కానీ, ప్రతీ పాత్ర కథపై కీలక ప్రభావం చూపిస్తుంటుంది. సితార ఎంటర్నిటైన్ర్మామెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ సపోర్ట్ బాగా లభించింది మరోసారి బాబీ కొల్లకి.
ప్లస్ పాయింట్స్:
బాలయ్య పర్‌ఫామెన్స్ అండ్ లుక్స్, డిఫరెంట్ యాక్షన్ ఎలిమెంట్స్, కథనం కొత్తగా నడిపించిన విధానం, ద్వితీయార్ధంలో వచ్చే ఇంజనీర్ సీతారామ్ ఫ్లాష్ బ్యాక్, చంబల్ ఎపిసోడ్, బలమైన రచన, స్కోప్ తక్కువయినా ప్రభావవంతమైన పాత్రల చిత్రీకరణ మొదలైనవి..
మైనస్ పాయింట్స్:
కొత్తదనం లేని కథ, సింపుల్‌గా తేలిపోయినట్లు అనిపించిన క్లైమాక్స్..
చివరిగా:
‘డాకు మహారాజ్’.. ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్..ఫ్యామిలీ ఆడియన్స్‌కి పైసా వసూల్ సంక్రాంతి సినిమా.!
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్‌లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్‌పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్‌లో హిందూ మహాసముద్ర సదస్సు..!!