రెబల్ స్టార్-కృష్ణంరాజు

- January 20, 2025 , by Maagulf
రెబల్ స్టార్-కృష్ణంరాజు

ఎన్టీఆర్.. ఏఎన్నార్.. తరువాత తెలుగు తెరను ప్రభావితం చేసిన కథానాయకులుగా కృష్ణ .. శోభన్ బాబు, కృష్ణంరాజు.. కనిపిస్తారు.ఈ ముగ్గురిలో కృష్ణంరాజు స్థానం ప్రత్యేకం. అందుకు కారణం.. నటుడుగా ఆయన ఎంచుకున్న మార్గం. ఒక వైపున కృష్ణ జేమ్స్ బాండ్ తరహా పాత్రల వైపు వెళుతూ ఉండగా.. మరో వైపున శోభన్ బాబు రొమాంటిక్ పాత్రల వైపు మొగ్గు చూపుతూ వెళుతున్నారు. ఆ సమయంలో గ్రామీణ నేపథ్యంతో కూడిన కథలలో .. అక్కడి అన్యాయాలను ప్రశ్నించే తిరుగుబాటు నాయకుడి పాత్రలను కృష్ణంరాజు ఎంచుకున్నారు. నేడు రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి 

కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940, జనవరి 20న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని సంపన్న క్షత్రియ కుటుంబంలో జన్మించారు. కృష్ణంరాజు మొగల్తూరు, నరసాపురం ప్రాంతాల్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అనంతరం హైదరాబాదులోని బద్రుకా కాలేజీలో బీకామ్ పూర్తి కొంత కలం ఆంధ్ర రత్న అనే పత్రికలో ఫోటో జర్నలిస్టుగా పనిచేశారు. సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో చెన్నై వెళ్లి తన సన్నిహితుల ద్వారా సినిమా రంగంలో అడుగుపెట్టారు.

‘చిలకా గోరింకా’ సినిమాతో 1960 ద్వితీయార్థంలో తెలుగు తెరకి కృష్ణంరాజు పరిచయమయ్యారు. కెరియర్ తొలినాళ్లలో నెగెటివ్ టచ్ తో కూడిన పాత్రలను ఆయన ఎక్కువగా చేశారు. ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్ లోను కనిపించారు. అయితే ఆ పాత్రల్లో ఎవరూ కూడా ఆయనను అంతగా పట్టించుకోలేదు. దాంతో ఏ తరహా పాత్రలను ఎంచుకోవాలో .. ఎలా ముందుకు వెళ్లాలో తెలియక ఆయన అయోమయానికి లోనయ్యారు. ఆ ఆలోచనతో ఆయన తన కెరియర్ ను నెట్టుకొస్తూనే 70వ దశకంలోకి అడుగుపెట్టారు. 

70వ దశకం ఆరంభంలోనే కృష్ణంరాజుకి ‘కృష్ణవేణి’ .. ‘అమరదీపం’ .. ‘భక్త కన్నప్ప’ వంటి సినిమాలు పడ్డాయి. కృష్ణంరాజుకు తగిన గుర్తింపు లభించడమనేది ఈ సినిమాలతోనే మొదలైంది. ఈ సినిమాల విజయాల తరువాత ఆయన ఆయన చేసిన ‘కటకటాల రుద్రయ్య’ .. ‘మనవూరి పాండవులు’ .. ‘రంగూన్ రౌడీ’ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో తాను ఎలాంటి పాత్రలకు సెట్ అవుతానననే విషయం కృష్ణంరాజుకు అర్థమైంది. ఆయనను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారనే విషయం దర్శక నిర్మాతలకు స్పష్టమైంది.

80 దశకం నాటికే ఆయన తనకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ను సెట్ చేసుకున్నారు. నిండైన ఆయన విగ్రహానికి గంభీరమైన వాయిస్ తోడైంది. రౌద్ర రసాన్ని పోషించే సమయంలో చింతనిప్పులుగా మారిపోయే ఆయన కళ్లు అసమానమైన ఆయన నటనకు ప్రతీకలుగా నిలిచాయి. ఈ దశకంలో కృష్ణంరాజు చేసిన అనేక సినిమాలు నటుడిగా ఆయన విశ్వరూపాన్ని చూపించాయి. తెరపై రౌడీయిజాన్ని చూపిస్తూ .. గూండాగిరిని ప్రదర్శిస్తూ, ప్రతినాయకుల గుండెల్లో దడ పుట్టించే పాత్రల్లో కృష్ణంరాజుకు తనకి తిరుగులేదనిపించుకున్నారు. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన పాత్రలు  ఆయనను ‘రెబల్ స్టార్’ గా నిలబెట్టాయి. 

ఈ దశకంలో వచ్చిన ‘త్రిశూలం’ .. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ .. ‘తాండ్రపాపారాయుడు’ .. ‘అంతిమ తీర్పు’ సినిమాలు, ఆయనలోని నటుడికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి .. నటుడిగా కృష్ణంరాజు అంటే ఏమిటనే ప్రశ్నకి నిర్వచనం చెప్పాయి. ఇక 90వ దశకంలోనూ కృష్ణంరాజు తన జోరును కొనసాగించారు. కొత్త తరం కథానాయకుల నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ, తన స్థాయికి తగిన కథానాయకుడి పాత్రలను చేసి మెప్పించారు. ఈ దశకంలో వచ్చిన ‘బావ బావమరిది’ సినిమా, నటుడిగా కృష్ణంరాజులోని రాజసానికి అర్థం చెబుతుంది. 

కృష్ణంరాజు ఉత్తమ నటుడిగా 1977, 1984లలో నంది అవార్డులు గెలుపొందారు. 1986లో తాండ్ర పాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు లభించింది. 2006లో ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది జీవితసాఫల్య పురస్కారం అందుకున్నారు.సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు నిర్మాతగా గోపికృష్ణ మూవీస్ బ్యానర్ మీద పలు చిత్రాలను నిర్మించారు. సూర్యనారాయణ రాజు చిన్న కుమారుడు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు అలియాస్ యుంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృష్ణంరాజు నట వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టి, పెదనాన్న పేరును నిలబెడుతూ పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. చివరిసారిగా ఆయన ప్రభాస్‌ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమాలో నటించారు.

కృష్ణంరాజు .. ఆజానుబాహుడు కావడంతో ఆయన ఏ పాత్ర చేసినా, ఆ పాత్రకే ఒక నిండుదనం వచ్చేది. తెరపై ఆయనను విలన్ గ్యాంగ్ చుట్టుముడితే అభిమానులు కంగారుపడేవారు కాదు. తమ హీరో వాళ్లను చితగ్గొట్టేస్తాడనే నమ్మకంతో కూల్ గానే కూర్చునేవారు. అందుకు కారణం .. ఆయన పర్సనాలిటీ. స్థిరంగా .. గంభీరంగా ఉండే ఆయన డైలాగ్ డెలివరీ ఆయన పాత్రలకు ప్రాణం పోసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక వాణిశ్రీ .. శారద .. జయసుధ .. జయప్రద .. శ్రీదేవి కాబినేషన్లో ఆయన చేసిన సినిమాలు చూస్తే, అందరూ హిట్ పెయిర్ గానే అనిపించడం విశేషం. 

తెలుగు చిత్ర‌సీమ‌లో స్టార్ డ‌మ్ కోసం దాదాపు పుష్క‌ర‌కాలం ప్ర‌య‌త్నాలు సాగించి, విజేత‌లుగా నిల‌చిన‌వారు ఇద్ద‌రే ఇద్ద‌రు- వారు శోభ‌న్ బాబు, కృష్ణంరాజు. ఈ ఇద్ద‌రు హీరోల‌ను అప్ప‌ట్లో ఎన్టీఆర్, ఏయ‌న్నార్ బాగా ప్రోత్స‌హించారు. వారిచిత్రాల‌లో కీల‌క పాత్ర‌లు పోషిస్తూ త‌మ ఉనికిని చాటుకున్నారు. అయినా స్టార్ డ‌మ్ చేరుకోవ‌డానికి చాలా ఏళ్ళు ప‌ట్టింది. శోభ‌న్ బాబు హీరోగా, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా  సాగుతూ చివ‌ర‌కు తాసిల్దార్ గారి అమ్మాయి`తో స్టార్ డ‌మ్ చూశారు. అయితే కృష్ణంరాజుకు హీరోవేషాలు అంత‌గా ద‌క్క‌లేదు. అయినా కృష్ణంరాజు నిరాశ చెంద‌లేదు. త‌న‌కు ల‌భించిన విల‌న్ రోల్స్ లోనూ అద్భుతంగా న‌టించి మెప్పించారు. ఆ రోజుల్లో కృష్ణంరాజును విల‌న్ గా తెర‌పై చూసిన మ‌హిళా ప్రేక్షకులు ఆయ‌న పేరు చెప్ప‌గానే జ‌డుసుకొనేవారు. అలాంటి కృష్ణంరాజు ఆ ముద్ర నుండి బ‌య‌ట ప‌డ‌డానికి `కృష్ణ‌వేణి, అభిమాన‌వంతులు, మేమూ మ‌నుషుల‌మే వంటి చిత్రాల‌లో సాఫ్ట్ కేరెక్ట‌ర్స్ పోషించారు. 

కబడ్డీ అంటే కృష్ణంరాజుకు ఇష్టమైన ఆట. ఈ ఆటలో సాధారణంగా ప్రత్యర్థులు కాస్త దూకుడుగానే ఉంటారు. కూతకు వెళ్లినప్పుడు అవతలి జట్టు సభ్యుల్ని కుదిరితే గట్టిగానే కొడతారు. కానీ కృష్ణంరాజు మాత్రం చాలా నెమ్మదిగా వ్యవహరించేవారట. ప్రత్యర్థిని ఔట్‌ చేయాల్సి వచ్చినప్పుడు ముక్కుమీద వేలుతో తాకి వచ్చేవారట. దీంతో ఔట్‌ అయిన విషయం అంపైర్‌కు కూడా తెలియని సందర్భాలు ఉండేవట. స్నేహితులు కూడా ఎన్నిసార్లు చెప్పినా కృష్ణంరాజు అదే రీతిలో ఆడుతుండటంతో చివరకు 'ముక్కురాజు' బిరుదు తగిలించారు.

వెండితెరపై గంభీరమైన పాత్రల్లో కనిపిస్తూ.. రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. కానీ, నిజ జీవితంలో ఆయన మనసు వెన్న. స్నేహానికి పెట్టింది పేరు. ఇక అతిథి మర్యాదల్లో ఆయనకు ఆయనే సాటి. స్వతహాగా మంచి భోజన ప్రియుడైన ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారంటే ఆ సెట్‌లో ఉన్న వాళ్లందరికీ తన ఇంటి నుంచే భోజనం తీసుకెళ్లేవారు. కేవలం తీసుకెళ్లడమే కాదు.. 'ఇక వద్దు సర్‌.. చాలు' అన్నా వినేవారు కాదట. ప్రతి ఒక్కరూ కడుపునిండా తినే వరకు ఊరుకునే వారు కాదు. అందుకే ఆయన్ని ఇండస్ట్రీలో ఎంతో మంది 'మర్యాద రామన్న' అని కీర్తించేవారు. ఇప్పుడిదే ఆనవాయితీని హీరో ప్రభాస్‌ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వీరి కుటుంబ ఆతిథ్యం గురించి బాలీవుడ్‌ వర్గాలు కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాయి. కృష్ణంరాజుకు మాంసాహారం, పెసరట్టు అంటే చాలా ఇష్టం.

మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి కృష్ణంరాజు ఉత్సాహాన్ని చూపడం విశేషం. జానపద .. చారిత్రక .. పౌరాణిక పాత్రల్లోను ఆయన అద్భుతంగా మెప్పించారు. ఆ పాత్రలను ఆయన తప్ప అంత గొప్పగా ఎవరూ చేయలేరని అనిపించుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణంలో తన తోటి అగ్ర తారలైన ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు వంటి వారితోనూ తెర పంచుకొని.. సినీప్రియుల్ని మురిపించారు కృష్ణంరాజు. 

కృష్ణంరాజుకు ఎన్టీఆర్‌ అంటే వల్లమాలిన అభిమానం. ఆ నటసార్వభౌముణ్ని తెరపై కృష్ణుడిగా చూడటమంటే ఆయనకు భలే ఇష్టం. ‘శ్రీకృష్ణతులాభారం’ చిత్ర షూటింగ్‌లో ఈ ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ తనపై చూపిన ప్రేమ.. ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పేవారు కృష్ణంరాజు. ఎన్టీఆర్‌.. కృష్ణంరాజు కలిసి నటించిన తొలి చిత్రం 1969లో వచ్చిన ‘భలే మాస్టారు’. ఆ తర్వాత ఈ ఇద్దరి నుంచి వచ్చిన మరో చిత్రం ‘బడిపంతులు’. ఆ తర్వాత వీరి కలయికలో ‘మనుషుల్లో దేవుడు’, ‘మంచికి మరోపేరు’, ‘పల్లెటూరి చిన్నోడు’, ‘వాడే - వీడు’, ‘సతీ సావిత్రి’ వంటి చిత్రాలొచ్చాయి.

కృష్ణంరాజు అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రోజుల్లో నటుడిగా ఆయన్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అగ్రతారల్లో ఏయన్నార్‌ ఒకరు. ఆయన నటించిన 'దేవదాసు' చిత్రమంటే కృష్ణంరాజుకు ఎంతో ఇష్టం. ఇక అక్కినేనితో కృష్ణంరాజు కలిసి నటించిన తొలి సినిమా 1969లో వచ్చిన 'బుద్ధిమంతుడు'. అనంతరం వీరి కలయికలో 'జై జవాన్‌', 'పవిత్ర బంధం', 'రైతు కుటుంబం', 'మంచి రోజులు వచ్చాయి', 'కన్నకొడుకు', 'యస్‌.పి.భయంకర్‌' చిత్రాలొచ్చాయి. 

కృష్ణ.. కృష్ణంరాజుల సినీ కెరీర్‌లు ఇంచుమించు ఒకే సమయంలో మొదలయ్యాయి. అలాంటి ఈ ఇద్దరు తారలు కలిసి తెరపై దాదాపు 17కి పైగా చిత్రాల్లో పోటాపోటీగా నటించి, మురిపించారు. కృష్ణ, కృష్ణంరాజు కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘నేనంటే నేనే’ (1968). ఇలా ఈ చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం ‘హంతకులు - దేవాంతకులు’, ‘ఇల్లు ఇల్లాలు’, ‘మాయదారి మల్లిగాడు’, ‘కురుక్షేత్రం’, ‘అడవి సింహాలు’, ‘యుద్ధం’, ‘విశ్వనాథనాయకుడు’, ‘మనుషలు చేసిన దొంగలు’ ‘ఇంద్రభవనం’, ‘సుల్తాన్‌’ తదితర సినిమాలతోనూ కొనసాగింది. 

ఇండస్ట్రీలో హీరోగా నిలబడే క్రమంలో తొలినాళ్లలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు కృష్ణంరాజు, శోభన్‌బాబు. దాంతో ఇద్దరి మధ్య చక్కటి స్నేహ బంధం చిగురించింది. ‘బంగారు తల్లి’, ‘మానవుడు దానవుడు’, ‘జీవనతరంగాలు’ చిత్రాల్లో శోభన్‌బాబుకు విలన్‌గా నటించిన కృష్ణంరాజు.. హీరోగా మారాక ‘ఇద్దరూ ఇద్దరే’, ‘కురుక్షేత్రం’, ‘రామబాణం’, ‘జీవితం’ సినిమాల్లో కలిసి సందడి చేశారు.

కృష్ణంరాజు సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1991లో కాంగ్రెస్ పార్టీ తరపున నరసాపురం లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1998లో వాజపేయ్ సమక్షంలో భాజపాలో చేరి కాకినాడ లోక్ సభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1999లో నరసాపురం నుంచి రెండో సారి ఎంపీగా విజయం సాధించి, వాజపేయ్ మంత్రివర్గంలో 2000-04 వరకు విదేశాంగ, రక్షణ, వినియోగదారులు & ఆహార సరఫరా మరియు గ్రామీణాభివృద్ధి శాఖల కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో అదేస్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2005లో భాజపాకు రాజీనామా చేసి 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో తిరిగి మోడీ సమక్షంలో బీజేపీలో చేరారు. 

కృష్ణంరాజు సినీప్ర‌యాణం త‌రువాతి రోజుల్లో ఎంద‌రో హీరోల‌కు స్ఫూర్తిగా నిల‌చింది. కృష్ణంరాజు స్ఫూర్తితోనే చిరంజీవి, ర‌వితేజ‌, శ్రీ‌కాంత్ వంటివారు తొలుత చిన్న వేషాలు, విల‌న్ రోల్స్ చేసినా త‌రువాత హీరోలుగానూ, అటుపై స్టార్స్ గానూ రాణించారు. ఆ తీరున ప్ర‌స్తుతం చిత్ర‌సీమ‌లో ప్ర‌వేశిస్తున్న ఎంద‌రో న‌టుల‌కు కృష్ణంరాజు చ‌ల‌న‌చిత్ర జీవితం ప్రేర‌ణ‌గా నిల‌చింద‌ని చెప్ప‌వ‌చ్చు. 2022 సెప్టెంబర్ 11న అనారోగ్యంతో బాధపడుతూ తన 82వ ఏట కృష్ణంరాజు కన్నుమూశారు.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com