క్రీడలు వ్యక్తుల మానసిక, శారీరక వికాసానికి ఎంతో అవసరం: సీపీ సుధీర్ బాబు

- January 20, 2025 , by Maagulf
క్రీడలు వ్యక్తుల మానసిక, శారీరక వికాసానికి ఎంతో అవసరం: సీపీ సుధీర్ బాబు

హైదరాబాద్: క్రీడలు వ్యక్తుల మానసిక వికాసానికి మరియు శారీరక వికాసానికి తోడ్పడుతాయని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు.ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైన ఆరవ రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025 ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథి కమిషనర్ మాట్లాడుతూ క్రీడలు మన జీవితంలో ముఖ్య భాగమని, వివిధ రకాల మానసిక శారీరక ఒత్తిడులను అధిగమించడానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని పేర్కొన్నారు. రాచకొండ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, గరిష్ఠ శిక్షారేటు సాధిస్తూ గొప్పగా పని చేస్తున్నారని, వారికి విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడులను మరియు వివిధ రకాల సవాళ్ల నుంచి ఉపశమనం పొందేలా మరియు నూతనత్తేజంతో తమ విధి నిర్వహణలో పాల్గొనేలా చేయడానికి స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. 

 ఈ క్రీడా పోటీల ద్వారా వివిధ పోలీస్ విభాగాల మధ్య సుహృద్భావ వాతావరణం మరియు సమిష్టితత్వం ఏర్పడుతుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో అన్ని రకాల ప్రధాన క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని, గెలుపోటముల కంటే పోరాటమే ధ్యేయంగా క్రీడల్లో పాల్గొనాలని పేర్కొన్నారు.ఈ పోటీల్లో పోలీసు సిబ్బంది జట్లు మాత్రమే కాక మినిస్టిరియల్ సిబ్బందికి కూడా ఒక ప్రత్యేక జట్టు ఉంటుందని, అన్ని జట్లూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, ఆటల్లో ఎటువంటి అవకతవకలకు పాల్పడకూడదని సూచించారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా పోటీలు నిర్వహిస్తామని, రాచకొండ పరిధిలో పనిచేస్తున్న అన్ని పోలీసు విభాగాల సిబ్బంది మరియు మినిస్టీరియల్ సిబ్బంది కూడా ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో డిసిపి యాదాద్రి రాజేష్ చంద్ర, డిసిపి ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్, డిసిపి మల్కాజ్గిరి పద్మజ,డిసిపి క్రైమ్ అరవింద్ బాబు, డిసిపి మహేశ్వరం సునీత రెడ్డి, డిసిపి ఎస్ఓటి 1 రమణారెడ్డి,డిసిపి ఎస్ఓటి 2 మురళీధర్, డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్, డిసిపి అడ్మిన్ ఇందిరా,డీసీపీ సైబర్ క్రైమ్ నాగలక్ష్మి,డిసిపి ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, ఏసీపీ ఐటీ సెల్ నరేందర్ గౌడ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com