తెలంగాణకు భారీ ఒప్పందం
- January 23, 2025
దావోస్: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై తెలంగాణ మరో కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ పెట్టుబడులను సమీకరించింది.
దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సంస్థ సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో రూ.45500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది.రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై (MOU) సంతకం చేసింది.
నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో మూడు చోట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది.
ఈ మూడు ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3400 మెగావాట్లు. వీటికి 5440 మెగావాట్ల సామర్థ్యముండే సోలార్ విద్యుత్తు ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది.
ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7000 ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటివరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే కావటం విశేషం.
సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీ తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఈ ఒప్పందంపై కీలక చర్చలు జరిపారు.
పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇన్వెస్టిమెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు.
సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం మైలు రాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిధులను అభినందించారు. ఈ ఒక్క ఒప్పందంతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గత ఏడాది దావోస్లో సాధించిన రూ.40 వేల కోట్ల పెట్టుబడుల రికార్డును సమం చేసిందని అన్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. సన్ పెట్రో కెమికల్స్ భాగస్వామ్యంతో భవిష్యత్తులో డిమాండ్కు అనుగుణంగా ఇంధన వనరులు సమకూరుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలతో పాటు నాగర్కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధి చెందుతాయని అన్నారు.
తమ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు, తమ చర్చలు ఫలించాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇంత భారీ పెట్టుబడుల ఒప్పందం సాధించటం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
తాము చేపట్టబోయే ప్రాజెక్టు తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని సన్ పెట్రో కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాంఘ్వీ ధీమా వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ పెట్టుబడుల గమ్య స్థానంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటం గర్వంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!