భారత అణు శాస్త్రజ్ఞుడు - రాజా రామన్న

- January 28, 2025 , by Maagulf
భారత అణు శాస్త్రజ్ఞుడు - రాజా రామన్న

దేశ సంస్కృతీ సంప్రదాయాల పట్ల గౌరవం, సంగీత సాహిత్యాలపై అంతులేని అనురాగం, దేశంలో సగటు మనిషి జీవన ప్రమాణాలు పెంచాలన్న తపన కలిగిన గొప్ప శాస్త్రజ్ఞుడు డాక్టర్ రాజా రామన్న. దేశంలో అణు శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంలో ఆయన కృషి చేశారు. ఆయన ఆధ్వర్యంలో భారత్ తోలి న్యూక్లియర్ ప్రాజెక్ట్  "స్మైలింగ్ బుద్ధ" విజయవంతం అయ్యింది. ఇండియాను అణ్వస్త్ర దేశంగా మారడంలో రామన్న పాత్ర కీలకం. నేడు భారత దేశ అణ్వస్త్ర శాస్త్రజ్ఞుడు డాక్టర్ రాజా రామన్న శత జయంతి.   

డాక్టర్ రాజా రామన్న 1925,జనవరి 28న ఒకప్పటి మైసూర్ రాజ్యంలో భాగమైన తీప్‌తుర్ అనే చిన్న పట్టణంలో సంప్రదాయ మైసూర్ బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబానికి చెందిన రామన్న, రుక్మిణి దంపతులకు జన్మించారు. శాస్త్రీయ సంగీతంపై ఉన్న వల్లమాలిన అభిమానంతో ఆరేళ్ళ వయసులోనే పియానో నేర్చుకోవడం ప్రారంభించారు. పన్నెండో ఏట మైసూర్ మహారాజు ఎదుట పియానో వాయించి ప్రశంసలందుకున్నారు. 

రామన్న తన ప్రాథమిక మరియు ఇంటర్ వరకు విద్యాభ్యాసాన్ని మైసూర్, బెంగళూరులలో పూర్తి చేసిన తర్వాత ప్రముఖ మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుంచి ఫిజిక్స్‌లో బీఎస్సి, బొంబాయి యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తిచేసిన తర్వాత టాటా గ్రూప్ అందించిన ఉపకారవేతనంతో లండన్ నగరంలో ఉన్న ప్రఖ్యాత కింగ్స్ కాలేజీ నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డి పూర్తి డాక్టరేట్ అందుకున్నారు.         

1944లో టాటా సంస్థలో పనిచేసేందుకు ప్రయత్నాల్లో ఉన్న సమయంలోనే సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు డా.హోమీ జహంగీర్‌ భాభా పరిచయం ఏర్పడింది. భాభా వల్లే లండన్ నగరంలో ఉన్నత చదువులు చదుకునేందుకు టాటా గ్రూప్ నుంచి ఉపకారవేతనం లభించింది. 1949లో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(TIFR)లో శాస్త్రవేత్తగా రామన్న తన ఉద్యోగ జీవితాన్ని భాభా వద్ద ప్రారంభించారు. 1952లో హోమి భాభాతో కలిసి న్యూక్లియర్ ప్రోగ్రాంలో పనిచేయడం మొదలు పెట్టిన ఆయన బొంబాయి పరిసర ప్రాంతమైన ట్రాంబే అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటులో కృషి చేసి. ట్రాంబే అటామిక్ రీసెర్చ్ సెంటర్ తర్వాత కాలంలో భాభా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్(BARC)గా రూపాంతరం చెందింది. 

భాభా మార్గదర్శనంలో న్యూక్లియర్ రంగంలో అధునాతన పరిశోధనలు జరిపిన రామన్న, తన సహచర శాస్త్రవేత్తలకు సైతం కొంతకాలం అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లోనే  న్యూక్లియర్ ఫిజిక్స్ బోధించారు. అప్సర న్యూక్లియర్ రియాక్టర్ తయారీలో సైతం రామన్న పాలుపంచుకున్నారు. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణ బాధ్యతలను భాభా రామన్నకు అప్పగించారు. వాటిని రామన్న సమర్ధవంతంగా నిర్వహించారు. భారత ప్రభుత్వం హోమీ భాభా మరణం తరువాత అటామిక్ ఎనర్జీ కమీషన్ ఛైర్మన్ గా, అటామిక్ ఎనర్జీ డిపార్ట్ మెంట్ సెక్రటరీగా డా.రాజారామన్నను నియమించింది.1972 నుండి 1978 వరకు, మళ్ళీ 1981 నుండి 1983 వరకు బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేశారు. పదవిలో ఉన్నారు. 

రామన్న అంటే టక్కున గుర్తొచ్చేది భారత మొదటి అణు బాంబు ప్రయోగం " స్మైలింగ్ బుద్ధ" ప్రాజెక్ట్. భాభా హయాంలోనే స్మైలింగ్ బుద్ధ పేరిట అణు పరీక్షలకు సంకల్పించిన భారత ప్రభుత్వం, ఆయన ఆకస్మిక మరణం తర్వాత కొద్దీ కాలం అణు ప్రయోగాలు నెమ్మదించినప్ప్పటికి అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ ఆమోద ముద్ర లభించిన తర్వాత పరోశోధనలు వేగంగా జరగడం మొదలైంది. 1974 మే 18 తేదీన జరిపిన అణు పరీక్ష అప్పట్లో ఒక సంచలనం. దాని వెనక రామన్న కృషి అసమానం. 

భారతదేశపు మొట్టమొదటి భూగర్భ అణు పేలుడులో రాజా రామన్న కీలక పాత్ర పోషించారు. అణు పేలుడు పరికరం తయారీకి వెళ్ళే వివిధ విభాగాలలో నైపుణ్యం ఉన్న అనేక బృందాలను ఆయన కలిసి తీసుకు వచ్చారు. రాజస్ధాన్ ఎడారిలో పోఖ్రాన్ వద్ద జరిపిన ఈ అణు పరీక్ష ఫలితంగా అమెరికా, యూరోపియన్ దేశాలు ఇండియాపై ఆంక్షలు విధించాయి. ఇండియా పట్ల అణు అంటరాని తనాన్ని పాటించాయి. తాము ఒక పక్క అణ్వస్త్రాలను గుట్టలుగా పేర్చుకుంటూనే ఇండియాలాంటి మూడో ప్రపంచ దేశాలు అణ్వస్త్రాలు సమకూర్చు కోవడానికి వీలు లేదని శాసించాయి. ఈ అణ్వస్త్ర పరీక్షలు ఫలితంగానే 1998లో కలాం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్ష జరపడానికి బాటలు పరిచింది. 

అణుపరీక్ష విజయవంతం కావడంతో రామన్నకు ప్రభుత్వ వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. 1978 నుండి 1981 వరకు రక్షణ మంత్రికి సలహాదారుగా ఉంటూనే 1978-82 వరకు డీఆర్‌డిఓ ఛైర్మన్‌గా పనిచేశారు.1983 -87 వరకు భారత అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా మరియు అణు ఎనర్జీ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇదే సమయంలో 100 నూతన న్యూక్లియర్ వార్ క్షిపణుల తయారీకి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రామన్న రిపోర్ట్ సమర్పించారు. కొన్ని కారణాల వల్ల ఆ రిపోర్ట్ అనుమతించబడలేదు. 

1988-97 వరకు బెంగళూరు నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ అడ్వాన్సడ్ స్టడీస్ డైరెక్టర్ గా డాక్టర్ రామన్న  వ్యవహరించారు. 1990 ప్రారంభంలో అప్పటి ప్రధాని వీపీ సింగ్ అభ్యర్థన మేరకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సుమారు 6 నెలలు పనిచేశారు. స్వతంత్ర భారతదేశంలో ఒక రక్షణ శాస్త్రవేత్త, దేశ రక్షణ మంత్రిగా పనిచేసిన ఘనత ఒక్క రామన్నకు దక్కుతుంది. 1997-2003 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 

అణు పరిశోధనా రంగంలో దేశానికి రామన్న చేసిన విస్తృతమైన సేవలకు గాను 1968లో శాంతిస్వరూప్ భట్నాగర్ సైన్స్ అవార్డు, 1968లో పద్మశ్రీ, 1973లో పద్మభూషణ్, 1975లో పద్మ విభూషణ్, 1984లో మేఘనాథ్ సహా మెడల్, 1985లో ఆర్.డి.బిర్లా స్మారక అవార్డు,1996లో అశుతోష్ ముఖర్జీ బంగారు పతకం అందుకున్నారు. ఇవే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు ఆయన్ని డాక్టరేట్లతో సత్కరించాయి. 2004, సెప్టెంబర్24న అనారోగ్యం కారణంగా తన 79వ ఏట కన్నుమూశారు.   
 
- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com