భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు: సీపీ సుధీర్ బాబు
- February 08, 2025
హైదరాబాద్: త్వరలో ప్రారంభం కానున్న కీసరగుట్ట బ్రహ్మోత్సావాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ప్రశాంతంగా జరిగేందుకు తీసుకోవలసిన భద్రతాపరమైన చర్యలు మరియు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయాల్సిన బందోబస్తు ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు నేరేడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ, వైద్యం, రోడ్లు & భవనాలు, మునిసిపల్, దేవాదాయ శాఖల నుండి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సావాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, విఐపీలతో పాటు సాధారణ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మహిళా భక్తులు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్యబృందం అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం డాక్టర్ల బృందంతో పాటు అంబులెన్సును, బీపీ షుగర్ వంటి వాటితో పాటు ఇతర అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. సురక్షితమైన తాగునీరుతో పాటు వేసవి తాపానికి కొందరు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు విస్తృతంగా అందుబాటులో ఉంచాలని సూచించారు. పారిశుధ్య ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని, మహిళల కోసం ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కీసర బ్రహ్మోత్సవాలు జరిగే ప్రాంతంలో మద్యపానం మరియు అమ్మకం రెండిటి నిషేధాన్ని అధికారులు సక్రమంగా అమలు చేయాలని, గుట్ట ప్రాంతంలో ప్రాణాంతకమైన పాములు సంచరించే అవకాశం ఉంది కాబట్టి పాములు పట్టే వాళ్లను మరియు ఆలయ సమీపంలోని చెరువు వద్ద కొందరు భక్తులు ప్రమాదవశాత్తు చెరువులో పడే అవకాశం ఉంది కాబట్టి గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలని సూచించారు. ట్రాఫిక్ అధికారులు భారీ సంఖ్యలో వచ్చే వివిధ రకాల వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేయడానికి ఏర్పాట్లు చేయాలని, తగిన సంఖ్యలో బారికేడ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, డ్రంకెన్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహించాలని సూచించారు.
ఆలయ ప్రాంగణంలో అన్ని వైపులా సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, కమాండ్ కంట్రోల్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని, మహిళా భక్తుల రక్షణ కోసం షీ టీం బృందాలు కూడా విధుల్లో ఉండాలని పేర్కొన్నారు.నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసే లైట్ల వైరింగ్ వ్యవస్థ వల్ల విద్యుత్ షాక్ వంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీసంఖ్యలో భక్తులు దైవదర్శనం కోసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి డిసిపి పివి పద్మజ ఐపిఎస్, డిసిపి క్రైమ్ అరవింద్ బాబు, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ జి.నరసింహారెడ్డి, డిసిపి అడ్మిన్ ఇందిర, డిసిపి ఎస్ఓటి రమణారెడ్డి, డీసీపీ ట్రాఫిక్ మల్లారెడ్డి, డిసిపి శ్యామ్, డీసీపీ సైబర్ క్రైమ్స్ నాగలక్ష్మి, అదనపు డీసీపీ అడ్మిన్ శివకుమార్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







