మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..

- February 09, 2025 , by Maagulf
మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..

న్యూ ఢిల్లీ: మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఆదివారం (09 ఫిబ్రవరి) వరకు 41 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాలో పాల్గొన్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. కాగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహా కుంభమేళాలో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 10 (సోమవారం) ఉదయం రాష్ట్రపతి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. అనంతరం గంగా పూజ, హారతి నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి భవన్‌ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. అనంతరం స్థానిక బడే హనుమాన్ ఆలయం, పవిత్రమైన అక్షయవత్‌ వృక్షాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే కుంభమేళా ప్రదేశంలో ఏర్పాటు చేసిన ‘డిజిటల్‌ కుంభ్‌ అనుభవ్‌ సెంటర్‌’ను పరిశీలిస్తారని రాష్ట్రపతి భవన్ ఆ ప్రకటనలో తెలిపింది. ప్రయాగ్‌రాజ్‌లో ఐదు గంటల పాటు రాష్ట్రపతి ముర్ము పర్యటన కొనసాగనుంది.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మహా కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు. ద్రౌపదీ ముర్ము పర్యటన సమయంలో ఆమె వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉంటారని  సీఎంవో వెల్లడించింది. 

మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభంకావడం తెలిసిందే. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు నిత్యం త్రివేణి సంగమానికి చేరుకుని పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. విదేశీ భక్తులు కూడా భారీ సంఖ్యలో కుంభమేళాలో పాల్గొంటున్నారు. మహాశివరాత్రి రోజైన ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా కొనసాగనుంది.గంగా, యమున, సరస్వతీ నదుల సంగమాన్ని త్రివేణి సంగమంగా పరిగణిస్తుండటం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com