విప్లవ వామపక్ష దిగ్గజం-తరిమెల నాగిరెడ్డి
- February 11, 2025
భారత విప్లవ రాజకీయరంగంలో కామ్రేడ్ టిఎస్‌గా పీడిత ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందిన వామపక్ష విప్లవోద్యమ నేత తరిమెల నాగిరెడ్డి.పేదలు,బడుగు, బలహీన వర్గాల కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుల్లో ఆయన ఒకరు.స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, గాంధీజీ ప్రభావం నుంచి మార్క్సిజం వైపు ఆకర్షితులై పీడిత ప్రజలకోసం నిరంతరం తపించిన వ్యక్తి తరిమెల నాగిరెడ్డి. పేదరిక నిర్మూలనకు కమ్యూనిజమే మార్గమని నమ్మి, పురోగమించిన మహోన్నత వ్యక్తి ఆయన.నేడు విప్లవ వామపక్ష దిగ్గజం తరిమెల నాగిరెడ్డి జయంతి.ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం మీద ప్రత్యేక కథనం ...
కామ్రేడ్ టిఎస్‌గా ప్రసిద్ధి గాంచిన తరిమెల నాగిరెడ్డి 1917,ఫిబ్రవరి 11న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్‌లోని అవిభక్త అనంతపురం జిల్లాలోని తరిమెల గ్రామంలో సంపన్న భూస్వామ్య కుటుంబానికి చెందిన తరిమెల సుబ్బారెడ్డి, నాగలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు.ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే పూర్తి చేసిన తర్వాత మదనపల్లెలోని రిషి వ్యాలీ విద్యాలయంలో తన మేనబావలైన నీలం బ్రదర్స్‌గా ప్రసిద్ధి గాంచిన నీలం సంజీవరెడ్డి,రాజశేఖరరెడ్డిలతో కలిసి విద్యా భ్యాసం చేశారు. అనంతరం మద్రాస్ నగరంలోని లయోలా కళాశాలలో చదువుకున్నారు. పాఠశాల రోజుల నుంచే సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లక్షణాలు కనబర్చారు.
మద్రాసులోని లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ చదివేరోజుల్లో తన జాతీయతా భావాల కారణంగా కళాశాల యాజమాన్యానికి, ఆచార్యులతో నాగిరెడ్డికి పొసగలేదు.లయోలా కళాశాల యాజమాన్యము నాగిరెడ్డికి జవహర్ లాల్ నెహ్రూ బహిరంగ ఉపన్యాసాలకు హాజరైనందుకు, రామస్వామి ముదలియారుకు, సత్యమూర్తికి మధ్య జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు, వ్యాస రచన పోటీల్లో మహమ్మద్ బిన్ తుగ్లక్‌ను ప్రశంసించినందుకు అనేకసార్లు జరిమానా విధించింది.చదువుకునే రోజుల్లో నాగిరెడ్డి సెలవులకు స్వగ్రామం వచ్చినపుడు యువకుల చేత అమ్మ, మాలపల్లి మొదలగు విప్లవ సాహిత్యాన్ని చదివించేవారు.
లయోలా కళాశాల తరువాత వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో నాగిరెడ్డి న్యాయ విద్యనభ్యసించారు. వారణాసిలో ఉన్న నాలుగేళ్ళలో నాగిరెడ్డి వామపక్ష సామ్యవాద నేతలుగా ఉన్న కమలాదేవి ఛటోపాధ్యాయ, జయప్రకాశ్ నారాయణ్,అచ్యుత్ పట్వర్ధన్ వంటి వారిచేత ప్రభావితుడయ్యారు.
కమ్యూనిజం, మార్క్సిజంతో ఈయనకు వారణాసిలోనే పరిచయమయ్యింది. రష్యన్ విప్లవం, స్టాలిన్ నాయకత్వం గురించి విస్తృతముగా చదివి, భారతదేశంలో కూడా మార్క్సిజాన్ని అమలు చేయవచ్చని తరిమెల నాగిరెడ్డి నమ్మటం ప్రారంభించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఉపకులపతిని నిలదీశారు. మహాత్మా గాంధీకి అది తెలిసి తరిమెల నాగిరెడ్డి వైస్ ఛాన్సలర్‌కి క్షమాపణలు చెప్పాలని ఉత్తరం రాశారు. నాగిరెడ్డి అందుకు ఒప్పుకోలేదు సరికదా తిరస్కరించారు.
బెనారస్ యూనివర్సిటీలో ఉన్న సమయంలోనే 1939లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడై ఫ్యూడల్ దోపిడీ వ్యవస్థను భూస్థాపితం చేయటానికి, దోపిడీ పీడనలు లేని సమ సమాజ స్థాపనకు సర్వస్వాన్ని అర్పించాలని నిర్ణయించుకున్నారు. స్వగ్రామంలో గ్రామ పెద్దగా ఉన్న తన తండ్రి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలను వ్యతిరేకించారు. ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అవసరమైన వాటిని సమకూర్చే బాధ్యతను తీసుకున్నారు. అనంతపురం జిల్లాలో ప్రజా ఉద్యమాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి కంటకంగా ఉన్న తన తండ్రి సుబ్బారెడ్డిని సైతం అవసరమైతే అంతమొందించాలన్న పార్టీ నిర్ణయాన్ని ఆమోదించి వర్గ చైతన్యాన్ని ప్రదర్శించారు. తండ్రిని వ్యతిరేకించి వెయ్యి ఎకరాల కుటుంబ భూములు ప్రజలకు పంపిణీ చేశారు.తన కమ్యూనిస్టు పార్టీ కార్యాచరణతో ప్రజల హృదయాల్లో నాగిరెడ్డి స్థానం పొందారు.1946లో ప్రకాశం ఆర్డినెన్సు కింద అరెస్టయ్యి 1947లో విడుదల చేయబడ్డారు.
1952లో నాగిరెడ్డి మద్రాసు శాసనసభకు సీపీఐ అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల సమయంలో ఆయన జైల్లో ఉన్నప్పటికి అప్పటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, తన బావ అయిన నీలం సంజీవరెడ్డి పై విజయం సాధించి సంచలనం సృష్టించారు. 1955లో కొత్తగా ఏర్పడిన పుట్లూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీచేసి తన బంధువైన తరిమెల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు.1957లో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.తిరిగి 1962లో పుట్లూరు నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ శాసనసభకు సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి తరిమెల రామచంద్రారెడ్డిని ఓడించి ఎన్నికయ్యారు.
1967లో నియోజకవర్గాల పునర్విభజనలో పుట్లూరు నియోజకవర్గం రద్దు కాగా... ఆ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి మూడో పర్యాయం శాసనసభకు ఎన్నికయ్యారు. 1969 మార్చి నెలలో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
1969లో నాగిరెడ్డి సీపీఐ(ఎం) నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేషన కమిటీ ఆఫ్ కమ్యూనిస్టు రెవల్యూషనరీస్(ఏపీసీసీఆర్)-ఆంధ్రప్రదేశ కమ్యూనిస్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీని స్థాపించారు. సీపీఐ(ఎం) కార్యకర్తలను కొత్త పార్టీ ఆకర్షించడంలో సఫలమయ్యారు. 1976లో తాను మరణించేదాకా ఏపీసీసీఆర్ నాయకుడిగా కొనసాగిన నాగిరెడ్డి ప్రజలకు నిరుపమాన సేవలందించారు.
అశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఎరుగని నేతగా కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి పేరు గాంచారు. జీవితాంతం విలువలు పాటించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.‘వీరులారా మీకు పరి పరి దండాలు’ అంటూ ప్రజానీకం ఆర్తిగా పాడుకునే పాటలకు స్ఫూర్తిగా నిలిచిన నాగిరెడ్డి జీవితమే ఒక పఠనీయ గ్రంథమని ఎంతో మంది జాతీయ నాయకులు కొనియాడటం ఆయన ఔన్నత్యానికి నిదర్శనం.
నాగిరెడ్డి ఆ కాలంలోనే దేశకాల పరిస్థితులు తెలిసిన రచయితగా, మానవత్వం పరిమళించిన మనిషిగా పుస్తకాలను రచించారు.1940లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో ‘యుద్దం - ఆర్థిక ప్రభా వం’ అన్న పుస్తకం రాసి అందరినీ ఆలోచింపజేశారు. ఈ పుస్తకం రాసినందుకు బ్రిటీష్ ప్రభుత్వం ఆయనకు జైలు శిక్ష విధించింది. తిరుచిరాపల్లి జైలు నుంచి విడుదల వగానే 1941లో భారతీయ రక్షణ చట్టం కింద అరెస్టయ్యారు.
నాగిరెడ్డి చేసిన రచనల్లో ముఖ్యమైనది మార్ట్‌గేజ్‌డ్(తాకట్టులో భారతదేశం).ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థపై ‘తాకట్టులో భారతదేశం’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు.దానిని కోర్టులో ఒక ప్రకటన రూపంలో చదివారు. సరైన మార్కిస్టు–లెనినిస్టు విశ్లేషణతో ఆ పుస్తకంలో ఆయన చేసిన నిర్ధారణలు నేటికీ అక్షరసత్యాలే. అవి కమ్యూనిస్టు విప్లవకారులకు, ప్రజాతంత్రశక్తులకూ భావికార్యాచరణకు మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి.
తరిమెల నాగిరెడ్డి చక్కని వక్త. 1928లో తన 11ఏళ్ల చిరుప్రాయంలోనే అడయార్‌లోని దివ్యజ్ఞాన ఉన్నతపాఠశాలలో లాలా లజపతిరాయ్ సంస్కరణ సభలో మొట్టమొదటి ఉపన్యాసం ఇచ్చారు. కంచుకంఠంతో పండిత పామరులను ఉర్రూతలూగించి కమ్యూనిస్టు విప్లవ రాజకీయాలను దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసారు. ఆరోజుల్లో నాగిరెడ్ గారి బహిరంగ సభలకు జనం తండోపతండాలుగా హాజరయ్యేవారు.అసెంబ్లీ, పార్లమెంటులో ఆయన ఉపన్యాసాలను అధికార, ప్రతిపక్ష సభ్యులు ఆసక్తితో, శ్రద్ధతో వినేవారు.ఆయన ఉపన్యాసాలన్నీ ఒక లక్ష్యంతో సాగేవి. విషయ పరిజ్ఞానం, సమాచారంతో నిండివుండేవి.
1969 మార్చిలో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీలో నాగిరెడ్డి సంచలనాత్మకమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు. పాలకవర్గాలు దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతూ వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే ప్రజా కంటక విధానాలను, భూస్వాముల ప్రయోజనాలను పరిరక్షించే విధానాలను అనుసరిస్తున్నాయని, దేశాభివృద్ధికంటే రక్షణచర్యలకే ప్రాధాన్యతనిస్తూ పెరుగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించే చర్యలను చేపట్టకుండా ఈ సంక్షోభ తీవ్రతను మరింతగా పెంచే ప్రజావ్యతిరేక విధానాలను అవి అవలంబిస్తున్నాయని నాగిరెడ్డి చెప్తూ ‘‘జనాల్ని కదిలిస్తే తప్ప పాలకుల దోపిడీ, దౌర్జన్యాలు అంతం’’ కావని వ్యాఖ్యానించారు. ఏభై ఏళ్ల క్రిందట టియన్ చేసిన ఈ వ్యాఖ్యానాలు నేటికీ అక్షరసత్యాలే.
1975లో ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి యూసీసీఆర్‌ఐ( ML) తో పాటు ఇతర విప్లవ సంస్థలపై నిషేధం విధించింది.కామ్రేడ్ నాగిరెడ్డి రహస్యంగా ఉంటూనే విప్లవ కార్యక్రమాలు కొనసాగిస్తూ, విప్లవ కారుల ఐక్యతా కృషిలో నిమగ్నమై ఉండగా అనారోగ్యం పాలై మారుపేరుతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 1976 జూలై 28న హైద్రబాద్‌లో ప్రాణాలు కోల్పోయారు.
ప్రజా ఆప్తబంధువువైన ఆయన మృత దేహాన్ని తరిమెలకు తీసుకుపోతుండగా వెంగళరావు ప్రభుత్వం శవాన్ని అరెస్ట్ చేయించిన వార్త ప్రజలకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పోలీసులను చుట్టుముట్టడంతో మృత దేహాన్ని ప్రజలకు అప్పగించారు.ఈ సంఘటనతో ప్రజల హృదయాల్లో నాగిరెడ్డి స్థానాన్ని మరోసారి రుజువు చేసింది. నాగిరెడ్డి జీవితమంతా పార్టీ, పార్టీ కార్యకర్తలు, ప్రజలతో ముడిపడి ఉంది. కమ్యూనిస్టు ఆదర్శాలకు నిలువెత్తు రూపం కామ్రేడ్ నాగిరెడ్డి. రాజీలేని సిద్ధాంత పోరాటం, వర్గ దృక్పధం ఆయనది.
పీడిత ప్రజల విముక్తి కోసం, విప్లవ విజయం కోసం సరైన మార్గాన్ని చూపించి భారత విప్లవోద్యమం చరిత్రలో చెరగని ముద్ర వేసిన క్రాంతదర్శి కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి. దేవులపల్లి వెంకటేశ్వరరావు మాటల్లో చెప్పాలంటే ఆయన ‘‘విప్లవంకోసం జీవించాడు. విప్లవం కోసం శ్రమించాడు. విప్లవం కోసం కృషి చేస్తూ మరణించాడు.’’ అందుకే మహాకవి శ్రీశ్రీ ఆయన్ని ‘వజ్రకరూరు వైఢూర్యం’ అని కీర్తించారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







