కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

- February 17, 2025 , by Maagulf
కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

హైదరాబాద్‌: నేడు బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు.ఈ సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. “గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని” ఆకాంక్షించారు.ఈ మేరకు రేవంత్‌ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.

మరోవైపు కేసీఆర్‌ జన్మదిన వేడుకలను సోమవారం అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తన ఆధ్వర్యంలో కేసీఆర్‌ బర్త్‌డే వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ వేడుకలకు పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్ల,పార్టీ నాయకులు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు.

ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లను మాజీ మంత్రి మహమూద్‌ అలీ, తెలంగాణభవన్‌ ఇన్‌చార్జి రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో తలసాని మాట్లాడుతూ..ఉదయం 10 గంటలకు కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ప్రారంభం అవుతాయని చెప్పారు.తొలుత డప్పు కళాకారులు, గిరిజన వేషధారణలో నృత్యాల ప్రదర్శన, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని తెలిపారు.అనంతరం కేసీఆర్‌ జీవిత, రాజకీయ ప్రస్థానంతో కూడిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు.ఆ తర్వాత కేసీఆర్‌ 71వ పుట్టినరోజు సందర్భంగా 71 కిలోల భారీ కేక్‌ను కట్‌చేయనున్నట్టు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com