కళాతపస్వి-కె.విశ్వనాథ్
- February 19, 2025
దర్శకుడు అంటే దార్శనికుడు! విడుదలయ్యాక ప్రపంచమంతా వెండితెరపై వీక్షించే చిత్రాన్ని ముందుగా తన తలపుల్లోనే వీక్షించే స్రష్ట.. అందరినీ అలరించే చిత్రాలను సృష్టించే ద్రష్ట!! ఆ విద్యలో కె.విశ్వనాథ్ ఎవరెస్ట్. ఒకటి, రెండు అని చెప్పుకోవడం ఎందుకు.. ఆయన సినిమాలన్నీ ఆణిముత్యాలే. వాటిలోనూ.. చరిత్రలో నిలిచిపోయే మేలిముత్యాల్లాంటి సీన్లు ఎన్నో ఎన్నెన్నో!! నేడు కళాతపస్వి కె.విశ్వనాథ్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం....
విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులి వర్రు గ్రామం. ఆయన తల్లిదండ్రులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ. విశ్వనాథ్ ప్రాథమిక విద్య స్వగ్రామంలో సాగింది. విజయవాడ గుంటూరు హిందూ కళాశాల, ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1949లో బీఎస్సీ పూర్తిచేసిన అనంతరం ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
విశ్వనాథ్ తండ్రి విజయవాడ వాహిని సంస్థ సినీ పంపిణీ విభాగంలో పనిచేసేవారు. తండ్రి సలహాతో విశ్వనాథ్ చెన్నైలోని వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు. ‘తోడి కోడళ్లు’ చిత్రానికి పనిచేస్తున్న సమయంలో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన దగ్గర ఇద్దరు మిత్రులు, చదువుకునే అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అదే సమయంలో మూగ మనసులు, మరో ప్రపంచం, సుడిగుండాలు వంటి సినిమాల స్క్రిప్ట్ రూపకల్పనలో విశ్వనాథ్ సహకారం అందించారు. అనంతరం ‘ఆత్మగౌరవం’ (1965) చిత్రంతో విశ్వనాథ్ దర్శకుడిగా అరంగేట్రం చేశారు.
పండితపామర భేదాలు లేకుండా జనబాహుళ్యానికి సంగీతంపై మక్కువ పెంచిన కళాస్రష్ట కె.విశ్వనాథ్. సంగీతాన్ని ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. కానీ సాధన చేసేవారు చాలా అరుదు. ఒక సినిమా వల్ల సంగీత పాఠశాలలు తయారు కావడం, శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలన్న అభిలాష ప్రజల్లో పెరగడం, తల్లిదండ్రులు తమ పిల్లల్ని శాస్త్రీయ సంగీతం వైపునకు నడిపించడం అనే ఒరవడి సృష్టించింది నిస్సందేహంగా కె.విశ్వనాథ్ అని చెప్పొచ్చు.
‘శంకరాభరణం’ సినిమా విడుదల అనంతరం తెలుగునాట వందల వేల సంగీత పాఠశాలలు వెలిశాయి. ఇక ‘సాగరసంగమం’ సినిమా తర్వాత చాలా మందికి నృత్యం మీద వ్యామోహం పెరిగింది. ఆ సినిమా ప్రేరణతో నాడు ఎంతో మంది శాస్త్రీయ నృత్యంలో తర్ఫీదు పొందారు. కళల గొప్పతనాన్ని తన సినిమాల ద్వారా సమాజానికి తెలియజెప్పిన వైతాళికుడు కె.విశ్వనాథ్.
మన పురాణాల ప్రాశస్త్యాన్ని ప్రవచనాల ద్వారా తెలుసుకుంటాం. అలాంటిది ఒక సినిమా గురించి మూడు గంటల పాటు ఏకధాటిగా ప్రవచనం వినిపించడం జరిగిందంటే ఆ సినిమా స్థాయి, ఆ దర్శకుడి గొప్పతనం ఏమిటో అవగతం అవుతుంది. ప్రఖ్యాత ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావు ‘శంకరాభరణం’ చిత్రాన్ని ప్రవచనం రూపంలో వినిపించడం ఓ అరుదైన సంఘటనగా పేర్కొనవచ్చు. విశ్వనాథ్ చిత్రాలు ఓ పురాణ, ప్రబంధ కావ్యాల గౌరవాన్ని సముపార్జించుకున్నాయనడానికి అదే ఉదాహరణ.
కె.విశ్వనాథ్ ప్రతి సినిమా అభ్యసనం చేయదగ్గ ఓ ఉద్గ్రంధం. ‘ఓ సీత కథ’ నుంచి ‘శుభ సంకల్పం’ వరకు ప్రతి సినిమా ఓ ఆణిముత్యమే. విశ్వనాథ్ సమకాలీనులైన దర్శకులు కొందరు పూర్తి కళాత్మక చిత్రాలనో లేదో ఫక్తు వాణిజ్య చిత్రాలనో నిర్మించే ఒరవడిలో సాగిపోయారు. కానీ కళాత్మక ఇతివృత్తాల్లో కూడా వాణిజ్య విలువల్ని మేళవించి జనరంజకమైన చిత్రాల్ని తీసిన ఘనత కె.విశ్వనాథ్‌కే దక్కుతుంది. అలాంటి సినిమాలు తీయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా సంచలనాల్ని సృష్టించారాయన. వందేళ్ల భారతీయ సినీ చరిత్రలో అగ్రశ్రేణి దర్శకుల్లో కె. విశ్వనాథ్‌గారు ఒకరనడం అతిశయోక్తి కాదు.
సినిమా అంటే కేవలం వినోదమే కాదు..దానికో సామాజిక, తాత్విక, కళాత్మక ప్రయోజనం ఉందని విశ్వసించారు కె.విశ్వనాథ్. నటీనటుల్లో వారికే తెలియని ప్రతిభను వెలికితీసి ప్రపంచానికి కొత్తగా పరిచయం చేశారు. స్వతహాగా ఆయన మంచి నటుడు కాబట్టి ఆర్టిస్టులకు మార్గదర్శనం చేయగలిగారు. ‘సాగరసంగమం’ చిత్రంలో కమల్‌హాసన్ అత్యద్భుత నటనతో మెప్పించాడు. ఇక సినిమాల విషయంలో హీరోయిజానికి దూరంగా ఉన్నారు కె.విశ్వనాథ్. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు వంటి లెజెండ్స్ ఇండస్ట్రీని ఏలుతున్న తరుణంలో జేవీ సోమయాజులు వంటి అరవై ఏళ్ల వృద్ధుడిని తీసుకొచ్చి ‘శంకరాభరణం’ ద్వారా దేశం మొత్తానికి పరిచయం చేశారు.
‘శంకరాభరణం’ సినిమాను మలయాళంలో అనువదించి విడుదల చేశారు. అయితే ఆ సినిమా పాటలు తెలుగులోనే ఉంటాయి. కేరళ రాష్ట్రంలో ఆ చిత్రం ఏడాది పాటు ఆడింది. ‘శంకరాభరణం’ చిత్రం ద్వారా ఓ రకంగా పాన్ ఇండియా ట్రెండ్‌కు ఎప్పుడో నాంది పలికారు కె.విశ్వనాథ్. ఈ సినిమా విడుదలైన ప్రతీ చోటా సంవత్సరం పాటు ప్రదర్శింపబడింది. కెరీర్ ఆరంభంలో అందరి దర్శకుల మాదిరిగానే కె. విశ్వనాథ్ కమర్షియల్ పంథాలో సాగే కుటుంబ కథా చిత్రాల్ని చేశారు. కానీ కళాతపస్విగా పరివర్తనం చెందే క్రమంలో ఆయన ఎంచుకున్న కథాంశాలు, చేసిన సాహసాలు తెలుగు సినిమాను మరో మెట్టెక్కించాయి.
సామాజిక ఇతివృత్తాల్ని కళాత్మకంగా ఆవిష్కరించే ఒరవడి కె.విశ్వనాథ్‌తోనే మొదలైంది. ‘ఓ సీత కథ’ ‘సీతా మహాలక్ష్మి’ ‘సిరిసిరిమువ్వ’ ‘శంకరాభరణం’ ‘శుభోదయం’ ‘సప్తపది’ ‘సాగరసంగమం’ ఇలా ఏ సినిమా తీసుకున్నా సరే కళాత్మక, సామాజిక ప్రయోజనమే కనిపిస్తుంది. విశ్వనాథ్ సినిమాల్లో హీరోలు విలన్లు ఉండరు. కళ, సంస్కృతి, నృత్యం శ్వాసగా బతికే ఉదాత్తులు, సామాజిక అంతరాల మధ్య నలిగే మనుషులే కనిపిస్తారు.
వందేళ్లపాటు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సినిమాలు తీసిన దర్శకుడు తెలుగులో ఓ నలుగురైదుగురు మాత్రమే ఉన్నారు. కేవీ రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, సి.పుల్లయ్య, బాపు ఆ వరుసలో ఉంటారు. అయితే వారందరికి కెరీర్లో కొన్ని క్లాసిక్స్ మాత్రమే ఉన్నాయి. ‘శంకరాభరణం’ దగ్గరి నుంచి విశ్వనాథ్ తీసిన చాలా సినిమాలు వందేళ్లు గుర్తుండిపోయేవే. యాభై ఏళ్ల సుదీర్ఘ దర్శకప్రస్థానంలో విశ్వనాథ్ సినిమాలు ప్రతితరం ఆదరణ చూరగొంటున్నాయి. ఆయన చిత్రాలు మన సంస్కృతి, కళలు, సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తెలియచెప్పిన మణిదీపాలుగా నిలిచాయి.
సుదీర్ఘ కెరీర్లో కె.విశ్వనాథ్ దాదాపు 60 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు కథకు కళాత్మక విలువలు జోడించి వెండితెరపై ఎన్నో అపురూప దృశ్యకావాల్ని సృజించారు. మూసధోరణిలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు కొత్త పంథాను పరిచయం చేశారు. తన సినిమాల ద్వారా సమాజంలో మార్పుకోసం తపించారు. ఆయన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం.
శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం, స్వయంకృషి, సిరిసిరిమువ్వ, శృతిలయలు, సిరివెన్నెల, శుభ సంకల్పం, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలు ఆయన కెరీర్లో అజరామరంగా నిలిచిపోయాయి. కథల్ని ఎంచుకోవడంలో, పాత్రలను తీర్చిదిద్దడంలో విశ్వనాథ్ తనదైన ప్రత్యేకత కనబరిచే వారు. 70వ దశకంలో చెల్లెలి కాపురం, కాలం మారింది, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి వంటి విభిన్న కథా చిత్రాలతో మెప్పించారు.
కళాత్మక చిత్రాల ద్వారా సాంఘిక దురాచారాలపై పోరాడారు విశ్వనాథ్. స్వయంకృషి, శుభోదయం చిత్రాల ద్వారా డిగ్నిటీ ఆఫ్ లెబర్ విలువేమిటో తెలియజెప్పారు. కష్టపడి నిజాయితీగా పనిచేయడంలోనే ఆత్మగౌరవం ఉంటుందని చాటారు. ‘శుభలేఖ’ చిత్రంతో వరకట్నం అనే దురాచారాన్ని రూపుమాపాలనే సందేశాన్ని అందించారు. మనిషికి అన్నింటికంటే అసూయద్వేషాలే శత్రువులని…వాటిని విడనాడినప్పుడే సమాజంలో పురోగతి సాధ్యమని ‘స్వాతి కిరణం’ చిత్రం ద్వారా చాటిచెప్పారు. మనుషులందరూ హింసా మార్గాన్ని వీడి శాంతియుతంగా జీవించాలనే సందేశంతో ‘సూత్రధారులు’ చిత్రాన్ని రూపొందించారు.
సినిమా షూటింగ్స్‌లో కె.విశ్వనాథ్ ఖాకీ దుస్తుల్లో విలక్షణ ఆహార్యంతో కనిపించేవారు. ఈ ఖాకీ డ్రెస్ కహానీ గురించి ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నేను సౌండ్ రికార్డిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి దర్శకుడిగా మారాను. ఒక్కోసారి విజయాల వల్ల అహంభావిగా మారతాం. నా విషయంలో అలా జరగకూడదనుకున్నా. దర్శకుడిగా మారగానే రంగురంగుల డ్రెస్‌లు, మెడలో ఆభరణాలతో హంగామా చేయొద్దని నిర్ణయించుకున్నా. సెట్లో పనిచేసే లైట్‌బాయ్, పెయింటర్స్, సహాయకులు అందరూ ఖాకీ దుస్తులే ధరించేవారు. మేమంతా సమానమనే భావించి నేనూ ఖాకీ డ్రెస్ ధరించేవాడిని. పనిపట్ల నిజాయితీ, నిబద్దత ఉండాలనే సంకల్పంతో షూటింగ్ రోజుల్లో ఖాకీ దుస్తుల్నే ఉపయోగించాను’ అని చెప్పారు.
పూర్ణోదయ క్రియేషన్స్ సంస్థతో సుదీర్ఘ అనుబంధం కొనసాగించారు విశ్వనాథ్. ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా ‘శంకరాభరణం’ చిత్రంతో పూర్ణోదయ క్రియేషన్స్‌తో విశ్వనాథ్ ప్రయాణం మొదలైంది. అనంతరం స్వాతిముత్యం, సాగరసంగమం, సూత్రధారులు, ఆపద్బాంధవుడు చిత్రాలు పూర్ణోదయ సంస్థలో తెరకెక్కి మంచి విజయాల్ని సాధించాయి. 1995లో ‘శుభసంకల్పం’ చిత్రం ద్వారా నటుడిగా అరంగేట్రం చేశారు. అనంతరం పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో మెప్పించారు. లాహిరి లాహిరి లాహిరిలో, మిస్టర్ ఫర్ఫెక్ట్, ఠాగూర్, లక్ష్మీ నరసింహా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, వజ్రం, సంతోషం, గ్రీకువీరుడు వంటి చిత్రాల్లో పెద్దరికం, హుందాతనం ఉట్టిపడే పాత్రల్లో మెప్పించారు.
విశ్వనాథ్ ‘ఎస్’ అక్షరం సెంటిమెంట్‌ను బాగా నమ్మేవారు. 1973లో వచ్చిన ‘శారద’ చిత్రంతో ఆయనకు ఈ సెంటిమెంట్ మొదలైంది. సిరిసిరి మువ్వ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం, శుభోదయం, సప్తపది, శుభలేఖ, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం, శుభసంకల్పం, స్వరాభిషేకం, శుభప్రదం చిత్రాలతో ఆ సెంటిమెంట్‌ను కొనసాగించారు. దీని గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ నేను కావాలని ‘ఎస్’ అక్షరంతో టైటిల్స్ పెట్టలేదు. కథానుగుణంగానే అలా టైటిల్స్ కుదిరాయి’ అన్నారు.
విశ్వనాథ్ బాలీవుడ్లో పది చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో ఎనిమిది చిత్రాలు తెలుగు రీమేక్‌లే. బాలీవుడ్‌లోకి వెళ్లే ఉద్దేశ్యం ఏమాత్రం లేని విశ్వనాథ్.. నటుడు, నిర్మాత ప్రేమ్‌జీ ప్రోత్సాహంతో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టారు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘ఓ సీత కథ’ ప్రేమ్‌జీకి బాగా నచ్చింది. దాంతో ఆ సినిమాను హిందీలో తెరకెక్కించమని కోరారు. అయితే ఆ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి అనివార్య కారణాల వల్ల తప్పుకున్నారు విశ్వనాథ్.
రిషికపూర్, జయప్రద జంటగా నటించిన ‘సర్గం’ చిత్రంతో విశ్వనాథ్ బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. బాలీవుడ్లో ఆయన తెరకెక్కించిన సర్గం (సిరిసిరిమువ్వ), సుర్‌సంగం (శంకరాభరణం), జాగ్ ఉఠా ఇన్సాన్ (సప్తపది), కామ్‌చోర్ (శుభోదయం), సన్జోగ్ (జీవనజ్యోతి), శుభలేఖ (శుభ్ కామ్నా), ఈశ్వర్ (స్వాతిముత్యం) వంటి చిత్రాలు హిందీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
హిందీ రీమేక్‌ల విషయంలో విశ్వనాథ్ చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. అక్కడి నేటివిటీకి తగినట్లుగా కథను తెరకెక్కించేవారు. రీమేక్ అంటే మాతృకను యథాతథంగా తీయడం కాదు… ఒరిజినల్ కథలోని ఆత్మను, భావోద్వేగాల్ని పోగొట్టకుండా మరింత ఉన్నతంగా తీసే ప్రయత్నం చేయాలి అని చెప్పేవారు. ‘స్వయంకృషి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని విశ్వనాథ్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎందుకో కార్యరూపం దాల్చలేదు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చివరి తెలుగు చిత్రం ‘శుభప్రదం’ 2010 జూలైలో విడుదలైంది.
కె.విశ్వనాథ్ ప్రతి సినిమా ఓ ఆణిముత్యమే. నేర్చుకుంటే ఓ జీవిత పాఠమే. జనరంజకమైన ఆయన చిత్రాలన్నీ సంగీతం, నాట్యం, సంప్రదాయం ప్రధానంగా కనిపిస్తాయి. ఆలోచింపజేసే కథతో కళాత్మక విలువల కలబోతగా దర్శనమిస్తాయి. కె.విశ్వనాథ్ కథలన్నీ ఎక్కువగా మధ్యతరగతి జీవితాలు, వాళ్ల అమాయకత్వం, జీవిత సంఘర్షణ, ఈర్ష్యాద్వేషాల ఇరుసులో తిరుగుతుంటాయి.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







