ఐ.టీ,విద్యా శాఖ మంత్రి లోకేష్ ను కలిసిన హోంమంత్రి అనిత

- February 27, 2025 , by Maagulf
ఐ.టీ,విద్యా శాఖ మంత్రి లోకేష్ ను కలిసిన హోంమంత్రి అనిత

అమరావతి: రాష్ట్ర ఐ.టీ, విద్యా శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ని  ఉండవల్లి నివాసంలో హోంమంత్రి అనిత మర్యాదపూర్వకంగా కలిశారు. మహాశివరాత్రి సందర్భంగా ఆ ఈశ్వరుడి అనుగ్రహం ఆయనపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హోంమంత్రి సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఆమె వినతి పత్రం అందజేశారు. విశాఖపట్నం-చైన్నై పారిశ్రామిక కారిడార్ , బల్క్ డ్రగ్ పార్క్, నక్కపల్లి కేంద్రంగా పారిశ్రామికాభివృద్ధికి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ యువతకు పరిశ్రమలకు కావలసిన శిక్షణనందించడంలో తోడ్పాటునందించాలని కోరారు. తన నియోజకవర్గంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి  అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. అదేవిధంగా  తన నియోజకవర్గం పాయకరావుపేటలోని ఎస్.రాయవరంలో బాలికల కోసం ప్రత్యేక జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటూ మరో వినతి పత్రం అందజేశారు. వ్యవసాయమే ఆధారంగా బతుకు సాగించే సాధారణ కుటుంబాలే తన  నియోజకవర్గంలో అధికమని వివరించారు.  చదువు ప్రాధాన్యత తెలుసుకుని చదివించాలనుకున్న తల్లిదండ్రులకు అమ్మాయిలను విద్యలో ప్రోత్సహించే క్రమంలో వ్యయ, ప్రయాసల అడ్డంకి రాకుండా ప్రత్యేక బాలికల కాలేజ్ ఏర్పాటు చేస్తే ఎంతోమంది ఆడబిడ్డలకు మేలు చేసిన వారవుతారని అక్కడ కాలేజ్ ఏర్పాటు ఆవశ్యకతను విద్యా శాఖ మంత్రి నారాలోకేశ్ కు హోంమంత్రి అనిత సవివరంగా తెలిపారు.

విజయవాడలోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ జి.పాలరాజు (ఐజీ)  హోంమంత్రి వంగలపూడి అనితని మర్యాదపూర్వకంగా కలిశారు. 2017లో తెలుగుదేశం ప్రభుత్వం రూ.400 కోట్ల అంచనాతో   అమరావతిలోని తుళ్లూరులో 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయ నిర్మాణ పనుల పురోగతిపై హోంమంత్రితో చర్చించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కక్షగట్టి ఆపిన పనులను 6 నెలల్లో 90శాతం  పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రయోగశాల పనులూ చురుగ్గా జరుగుతున్నాయన్నారు.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గమ్మను, శివాలయంలో మహాదేవుడ్ని దర్శించుకొని హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.శివరాత్రి సందర్భంగా పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో హోంమంత్రి మాట్లాడి ఆలయ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com