ద్రవిడ రాజకీయ సూర్యుడు-స్టాలిన్

- March 01, 2025 , by Maagulf
ద్రవిడ రాజకీయ సూర్యుడు-స్టాలిన్

ఎం.కె.స్టాలిన్...తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని నేతగా సాగుతున్నారు.ద్రవిడ రాజకీయ సిద్ధాంతాలే ఊపిరిగా బ్రతికిన తండ్రి కరుణానిధి అడుగుజాడల్లో చిన్నతనంలోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన స్టాలిన్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తమిళనాడు రాష్ట్ర సీఎం అయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు శ్రామిస్తూ జననేతగా ఎదిగారు. నేడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ జన్మదినం సందర్భంగా ఆయన రాజకీయ ప్రయాణంపై ప్రత్యేక కథనం... 

ఎం.కె.స్టాలిన్ పూర్తి పేరు ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్. 1953, మార్చి 1న తమిళనాడు రాజధాని మద్రాస్ ( నేడు చెన్నై) నగరంలో కరుణానిధి, దయాళు అమ్మాళ్ దంపతులకు జన్మించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలో డిగ్రీ వరకు చదువుకున్నారు. తండ్రి రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్ మీదున్న అభిమానంతో  ఆయన పేరును తన కుమారుడికి పెట్టుకున్నారు. ఈ పేరుతో ఇండియాలో బాగా ప్రసిద్ధమైన ఏకైక వ్యక్తి వీరు కావడం విశేషం.

స్టాలిన్ తండ్రి ద్రవిడ ఉద్యమ పితమహుల్లో ఒకరైన మాజీ సీఎం కరుణానిధి. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ 14 ఏళ్ళ వయస్సులోనే రాజకీయ రంగప్రవేశం చేసి పార్టీ కార్యకర్తగా పలు ప్రజా ఆందోళన ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1968లొనే డీఎంకే గోపాలపురం యూత్ వింగ్ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించారు. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు. 1975లో ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు కేంద్ర ప్రభుత్వం స్టాలిన్ని అరెస్ట్ చేసి జైల్లో వేసింది. 1977లో విడుదలైన తర్వాత పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న సమయంలోనే పార్టీ సిద్ధాంతకర్త పేరాసియర్  అన్బళగన్ శిష్యరికంలో రాజకీయంగా రాటుదేలారు. 

1982లో అన్బళగన్ చొరవతో పార్టీకి అనుబంధంగా యూత్ వింగ్ ను అధికారికంగా స్థాపించిన స్టాలిన్ ఆ విభాగానికి దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు అధ్యక్షత వహించారు. 1984 అసెంబ్లీ ఎన్నికల్లో థౌజెండ్ లైట్స్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన స్టాలిన్ అదే నియోజకవర్గం నుంచి 1989లో తొలిసారి విజయ కేతనం ఎగురవేశారు. 1991లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సారి ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన తర్వాత నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో పార్టీ ఓటములు చవిచూడకుండా ఉండేందుకు ఆ ఐదేళ్ల పాటు చాలా తీవ్రంగా కృషి చేశారు. 

1996లో థౌజెండ్ లైట్స్ నుంచి ఎమ్యెల్యేగానే కాకుండా చెన్నై నగరానికి మేయర్ గా సైతం ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే 1996 నుంచి 2002 వరకు మేయరుగా ఉన్న స్టాలిన్ చెన్నై నగర సుందరీకరణ, నగరంలో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న  మున్సిపల్ స్కూల్స్ ఆధునికీకరణ సైతం స్టాలిన్ హయాంలోనే జరిగింది. మేయర్ పదవిని నిర్వహించిన స్టాలినుకు పరిపాలన యంత్రాంగం పట్ల అవగాహన పెరిగింది. 

2001 అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి థౌజెండ్ లైట్స్ ఎమ్యెల్యేగా ఎన్నికైనప్పటికి డీఎంకే ప్రతిపక్షానికి పరిమితం కావడంతో ఆ ఐదేళ్ళ పాటు జయలలిత ప్రభుత్వం తీసుకున్న పలు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పార్టీ తరపున పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అదే సమయంలో తన రాజకీయ గురువు, పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ కోరిక మేరకు కరుణానిధి స్టాలిన్ను 2003లో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2003- 08 వరకు ఈ పదవిలో ఉన్న స్టాలిన్ పార్టీ మీద పూర్తి పట్టు సాధించేందుకు ఆ సమయం బాగా ఉపయోగపడింది. 

2006లో నాలుగోసారి థౌజెండ్ లైట్స్ నుంచి ఎన్నికైన స్టాలిన్ కరుణానిధి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి & స్థానిక సంస్థల పరిపాలన వంటి కీలకమైన శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2008లో పార్టీ సీనియర్ నేత ఆర్కాట్ వీరాస్వామి స్థానంలో పార్టీ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ 2018 వరకు అదే పదవిలో కొనసాగారు. ఈ సమయంలోనే పార్టీకి పలువురు కార్పొరేట్ వర్గాల నుంచి భారీగా విరాళాలు భారీగా వచ్చేవి. 

2009లో వయోభారం రీత్యా సీఎం కరుణానిధి తన బాధ్యతల్లో సహాయకరంగా ఉంటారనే ఆలోచన మరియు తన తర్వాత పార్టీని నడిపే సత్తా ఉన్న తనయుడు స్టాలిన్ను తమిళనాడు మొదటి డిప్యూటీ సీఎంగా నియమించారు. 2009-11 వరకు డిప్యూటీ సిఎంగా ఉన్న స్టాలిన్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడంలో విజయవంతం అయినప్పటికి తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు రాజా, దయానిధి మారన్ మరియు తన మారు సోదరి డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి టెలికామ్ కుంభకోణంలో నేరుగా ప్రమేయం ఉండటంతో పాటుగా జైలుకు వెళ్లడం పార్టీ ప్రతిష్టను దిగజార్చింది. ఆ ప్రభావం 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కని విని ఎరుగని రీతిలో పార్టీ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఎన్నికల్లో స్టాలిన్ ఐదోసారి కొలత్తూరు నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 

2011-16 సమయంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి డీఎంకేది. దాంతో పాటుగా 2014 లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని గెలవలేకపోయింది. వరుస ఓటములతో సతమతమవుతున్న సమయంలోనే కరుణానిధి అనారోగ్యంతో బాధపడుతూ పార్టీ సమావేశాల్లో పాల్గొనడం తగ్గడంతో పాటుగా పార్టీలో నీవురుగప్పిన నిప్పులా ఉన్న వారసత్వ పోరు సైతం తారాస్థాయికి చేరుకుంది. కరుణానిధి పెద్ద కుమారుడు కేంద్ర మాజీ మంత్రి అళగిరి, స్టాలిన్ పక్షాలుగా పార్టీ చీలిపోయిన సమయంలో పార్టీ సీనియర్లు, కరుణానిధి మరియు కనిమొళి సైతం స్టాలిన్ పక్షాన నిలవడంతో పార్టీలో కరుణ తర్వాత స్టాలినే అనే విషయం సుస్పష్టం అయ్యింది.

2016లో సైతం అప్పటి సీఎం జయలలిత దాటికి డీఎంకే వరసగా రెండో పర్యాయం ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సమయంలోనే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కరుణానిధి కాకుండా స్టాలిన్ ఎన్నికయ్యారు. 2016-21 మధ్యలో తమిళ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. 2016లో సీఎంగా ఉండగానే అనారోగ్యంతో జయలలిత మరణం, 2018లో కరుణానిధి సైతం అస్తమించడంతో ద్రవిడ రాజకీయాల్లో శూన్యం ఆవహించింది. ఇదే సమయంలో కరుణానిధి స్థానంలో డీఎంకే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడం మొదలుపెట్టారు. 

2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు మరియు ఇతరత్రా చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని 39 స్థానాలకు గాను 38 స్థానాలను కైవసం చేసుకొని తదుపరి తమిళనాడు సీఎం తానేని రాజకీయ విశ్లేషకులు అంచనాకు వచ్చేలా చేశారు. లోక్ సభ ఫలితాలు ఇచ్చిన ఉత్సహంతో ప్రజల్లో ఉంటూ తాము అధికారంలోకి రాగానే ప్రజలకు అభివృద్ధి మరియు సంక్షేమానికి సమ ప్రాధాన్యత కచ్చితంగా ఇస్తామని ప్రజలకు హామీలు ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర కూడా చేశారు. 

2021 అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో డీఎంకే కూటమిని స్టాలిన్ అధికారంలోకి తీసుకువచ్చారు. తన చిరకాల వాంఛగా ఉన్న సీఎం పదవిని సైతం చేపట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను వేగవంతంగా అమలు చేయడం మొదలుపెట్టారు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే  ప్రజలకు అందాల్సిన సంక్షేమంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. కేంద్రంలో ఉన్న భాజపాను అధికార గద్దె నుండి దింపేందుకు స్టాలిన్ సైతం ఇండియా కూటమిలో భాగస్వామి అయ్యారు. 
2024 లోక్ సభ ఎన్నికల్లో 39కి 39 స్థానాలను డీఎంకే కైవసం చేసుకోవడం జరిగింది. 

ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో స్టాలిన్ ఎన్నో ఉత్తాన పాతాలు చవిచూశారు. పార్టీ అధినేత ప్రియ సంతానం అయినప్పటికి సాధారణ కార్యకర్తగానే దశాబ్దం పాటు కొనసాగారు. తండ్రి రాజకీయ వారసుడిగా తనను తాను నిరూపించుకునేందుకు దాదాపు మూడు దశాబ్దాల పాటు ఒప్పిగా వేచి ఉన్నారే తప్పించి పదవుల కోసం తిరుగుబాటులు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో భాగం అవ్వలేదు. సీఎం అయ్యే క్రమంలో ఒకప్పుడు అంతర్ముఖుడిగా పార్టీ వారికే దగ్గరా ఉన్న ఆయన ప్రజలతో మమేకం అవ్వడం నేర్చుకున్నారు.ఇలా కాలానుగుణంగా రాజకీయాల్లో తనను తాను మార్చుకుంటూ నేడు తమిళనాడు రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా స్టాలిన్ ఎదిగారు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com