సంగీత సాగరుడు.... !
- March 02, 2025
తెలుగునాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి, మళయాళ సీమలో తన స్వర విన్యాసాలతో ఆకట్టుకున్న ఘనుడు విద్యాసాగర్.మాతృభాషలో కన్నా మిన్నగా పరభాషల్లోనే పదనిసలు పలికించి, పులకింప చేశారాయన. విద్యాసాగర్ పరభాషల్లో పలికించిన స్వరాలను మన తెలుగువారు కాపీ చేసిన సందర్భాలూ ఉన్నాయి.నేడు దిగ్గజ సినీ సంగీత దర్శకుడు ఆర్. విద్యాసాగర్ జన్మదినం సందర్భంగా ఆయన సినీ ప్రయాణంపై ప్రత్యేక కథనం...
ఆర్. విద్యాసాగర్ పూర్తి పేరు రామచంద్ర విద్యాసాగర్. 1963 మార్చి 2న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో అమ్మమ్మగారింట జన్మించారు. ఆయన తల్లిద్రండ్రులు రామచంద్రరావు, సూర్యకాంతం. తాత ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. తండ్రికి కూడా సంగీతంలో ప్రవేశం ఉండుట వలన మొదటగా ఆయనే గురువుగా సాధన చేసారు. తండ్రి వద్దనే కర్ణాటక సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న విద్యాసాగర్ తరువాత ఇతర గురువుల వద్ద మరింత సాధన చేశారు.
ఆపై క్లాసికల్ గిటార్ నేర్చుకోవడానికి మద్రాస్ చేరారు. అక్కడ మాస్టర్ ధన్ రాజ్ వద్ద గిటార్ క్లాసులు నేర్చుకున్నారు. అక్కడే ఎ.ఆర్.రహమాన్ కూడా గిటార్ నేర్చుకొనేవారు. అక్కడి నుండి వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకొనేటందుకు లండన్ వెళ్ళారు .లండన్ నుండి తిరిగి వచ్చాక సినిమాలకు నేపథ్య సంగీతం అందించడం మొదలెట్టారు. ఆ తరువాత కొన్ని చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన విద్యాసాగర్ ‘పూ మనం’ తమిళ చిత్రంతో సంగీత దర్శకుడయ్యారు. ఆ సినిమాలో ఆయన కంపోజ్ చేసిన “ఎన్ అన్బే ఎన్ నెంజిల్…” అంటూ సాగే పాట విశేషాదరణ చూరగొంది. తరువాత కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన ‘ధర్మతేజ’ తో తెలుగులో తొలిసారి స్వరాలు పలికించారు విద్యాసాగర్.
తన స్వరాల్లో సంప్రదాయ సంగీతానికి పెద్ద పీట వేస్తూనే, అనువైన విధంగా నవీన బాణీలను మేళవించేవారు విద్యాసాగర్. తెలుగులో తమ్మారెడ్డి భరద్వాజ తెరకెక్కించిన ‘అలజడి’ సినిమాతో విద్యాసాగర్ కు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత నుంచీ తమ్మారెడ్డి భరద్వాజ రూపొందించిన పలు చిత్రాలకు విద్యాసాగర్ స్వరకల్పన చేస్తూ సాగారు. తన దరికి చేరిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నారు. పలు పాటలతో జనాన్ని ఆకట్టుకున్నారు.
చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం ఎస్సెట్ గా నిలచింది. ప్రముఖ దర్శక దిగ్గజం దివంగత ఇ.వి.వి. సత్యనారాయణ తెరకెక్కించిన “ఆమె, ఆలీబాబా అరడజను దొంగలు, తాళి” వంటి చిత్రాలలో సైతం విద్యాసాగర్ స్వరాలు భలేగా ఆకట్టుకున్నాయి. దాదాపు వంద తెలుగు చిత్రాలకు సంగీతం సమకూర్చి ఉంటారు విద్యాసాగర్. అయితే మాతృభాషలో ఎందుకనో విద్యాసాగర్ కు తగిన గుర్తింపు లభించలేదనే చెప్పాలి.
తమిళ, మళయాళ భాషల్లో ఆయన స్వరాలకు విలువ పెరిగింది. యాక్షన్ హీరో అర్జున్ నటించిన పలు చిత్రాలకు విద్యాసాగర్ బాణీలు ఎస్సెట్ గా నిలిచాయి. ఒకానొక సమయంలో మళయాళ చిత్రసీమలో విద్యాసాగర్ స్వరాలతో రూపొందిన చిత్రాలే విజయవిహారం చేశాయి. అక్కడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గానూ విద్యాసాగర్ జేజేలు అందుకున్నారు. విద్యాసాగర్ బాణీలను తెలుగు చిత్రాలకు సంగీతం సమకూర్చిన పలువురు అనుసరించేవారు.
తను స్వరపరిచిన ట్యూన్స్ కాపీ కొట్టి తెలుగులో ఎందరో సక్సెస్ చూసినప్పుడు మాతృభాషలో రాణించలేక పోయానే అనే బాధ కలిగేది విద్యాసాగర్‌కు. ఆ సమయంలో కె.విశ్వనాథ్ నిర్దేశకత్వంలో తెరకెక్కిన ‘స్వరాభిషేకం’ చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశం విద్యాసాగర్‌కు లభించింది. కె.విశ్వనాథ్ చిత్రమంటేనే సంగీతసాహిత్యాలతో అలరారిస్తుంది అనే నమ్మకం జనాల్లో ఉంది. అదీగాక, విశ్వనాథ్ కొంత గ్యాప్ తరువాత రూపొందించిన చిత్రం ‘స్వరాభిషేకం’. పైగా టైటిల్ కు తగినట్టే ఈ చిత్రంలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీంతో విద్యాసాగర్ కూడా ఆ సినిమాను ఓ సవాల్‌గా తీసుకొని సంప్రదాయ సంగీతాన్ని పలికించారు.
నాలుగు దశాబ్దాల మ్యూజిక్ కెరీర్లో విద్యాసాగర్ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. స్వరాభిషేకం చిత్రానికి గాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు అందుకున్న ఆయనకు అదే చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం నంది అందించింది. ఇవే కాకుండా విద్యాసాగర్ సంగీతానికి అంతకు ముందు మళయాళ, తమిళ చిత్రసీమల్లో పలు అవార్డులూ రివార్డులూ లభించాయి. తమిళనాడు ప్రభుత్వం నుండి ‘కలైమామణి’ అవార్డునూ దక్కించుకున్నారు. పలు మార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులూ సంపాదించారు. అన్నిటికన్నా మిన్నగా మాతృభాషలో ‘స్వరాభిషేకం’తో జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా నిలవడమే విద్యాసాగర్ కు మహదానందం కలిగించింది.
స్వరాభిషేకం చిత్రం తర్వాత కూడా కొన్ని తెలుగు చిత్రాలకు విద్యాసాగర్ సంగీతం సమకూర్చారు. నట సింహ బాలకృష్ణ కీలక పాత్ర పోషించిన ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’ చిత్రానికి కూడా విద్యాసాగర్ స్వరకల్పన చేశారు. ఎందుకనో కొంత కాలంగా విద్యాసాగర్ బాణీలు తెలుగునాట వినిపించడం లేదు. ఏది ఏమైనా ముందు రచ్చ గెలిచి, తరువాత ఇంట గెలిచిన విద్యాసాగర్ నిజంగా సంగీతసాగరుడనే చెప్పాలి.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్‌లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!