కచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

- March 06, 2025 , by Maagulf
కచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

విశాఖపట్నం: కేంద్ర బడ్జెట్ పై విశాఖలో నిర్వహించిన చర్చలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత దేశవ్యాప్త చర్చలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. మొదట ముంబైలో, రెండో చర్చ విశాఖలో నిర్వహించామన్నారు. విశాఖలో బడ్జెట్ పై వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని మంత్రి నిర్మల తెలిపారు.

పోలవరం ప్రాజెక్ట్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చాం.కేంద్ర ప్రభుత్వంగా కాదు, మా బాధ్యతగా సహకారం అందిస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎక్కువ మొత్తం కేటాయించాం. స్టీల్ ప్లాంట్ పునరాభివృద్ధికి 11వేల కోట్లు సహకారం అందిస్తున్నాము. పారిశ్రామిక కారిడార్, అమరావతి రాజధానికి కేంద్రం నుంచి సహకారం అందిస్తున్నాం. కేంద్రం, రాష్ట్రం కలిసి చేస్తున్న అన్ని ప్రాజెక్టులకు లోటు లేకుండా కేటాయింపులు చేస్తున్నాం. సాంకేతిక సమస్యలతో పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది. విభజన సమయంలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చాము. కచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం.

12 లక్షలు వరకు టాక్స్ కట్టే అవకాశం లేకుండా వెసులుబాటు ఇచ్చాము. సర్వీస్ సెక్టార్ లో నిర్దిష్టమైన ఆదాయం వస్తుంది. ఇతర దేశాల తరహాలో మన దేశం అభివృద్ధి చెందాలంటే ఆదాయ వనరులు పెంచుకోవాలి. నేను పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో నివసించా. నీటి కష్టాలు అనుభవించాను. జల్ జీవన్ మిషన్ ద్వారా నేరుగా ఇంటికి మంచి నీరు ఇచ్చే బృహత్తర ప్రాజెక్ట్ ను చేపడుతున్నాము. ఆత్మనిర్బర్ భారత్, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టకపోతే వినాయక చవితికి విగ్రహం తయారు చేసే మట్టిని కూడా ఇతర దేశాలు నుంచి తెచ్చుకోవాలి.

విశాఖకు సమీపంలో ఫార్మా రంగం అభివృద్దికి బల్క్ డ్రగ్ పరిశ్రమలు విస్తృత పరిచాం. అమెరికా అధ్యక్షుడి నిర్ణయంతో సుంకాలు పెరిగే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. అమెరికా సుంకాల పెంపు ప్రభావం మన దేశ ఆర్థిక స్థితి మీద పడుతుంది. నూతన పద్ధతుల ద్వారా ఆదాయ పన్ను చెల్లింపు విధానం అనేది పన్ను చెల్లింపుదారులకు సులభతరమైన మార్గంగా చేయడం జరిగింది. 3 కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. కొత్త పన్ను వెసులుబాటు ద్వారా ఈ సంఖ్య మరింత తగ్గుతుంది” అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com