గ్రేటర్ హైదరాబాద్ వాసులకు శుభవార్త..
- March 08, 2025
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆస్తిపన్ను భారీ బకాయిదారులకు శుభవార్త. ప్రభుత్వం మళ్లీ వన్‌టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) ను అందుబాటులోకి తెచ్చింది. ఇవాళ్టి నుంచి ఈ నెలాఖరు వరకు ఈ స్కీం అమల్లో ఉండనుంది. జీహెచ్ఎంసీ ఆదాయం పెంచుకునేందుకు కమిషనర్ ఇలంబర్తి రాసిన విజ్ఞప్తి లేఖకు ప్రభుత్వం స్పందించి.. ఆస్తిపన్ను బాకాయిదారులకు వన్‌టైం సెటిల్మెంట్ విధానాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వన్‌టైం సెటిల్మెంట్ లో భాగంగా ఆస్తి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. కేవలం 10శాతం వడ్డీతో మాత్రమే బకాయిలు చెల్లించవచ్చు. అయితే, జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు మూడు సార్లు వన్‌టైం సెటిల్మెంట్ స్కీం అమలు చేశారు. మొదటి సారి 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 1 నుంచి నవంబర్ 15వరకు అమలు చేయగా రూ.400 కోట్లు ఆదాయం వచ్చింది. 2022-23లో జూలైలో అమలు చేయగా రూ. 170 కోట్లు, 2024-25 మార్చిలో రూ. 350కోట్లు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా రూ. 500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జీహెచ్ఎంసీలో 15ఏండ్లుగా ఆస్తి పన్ను బాకాయిలు రూ.11,668 కోట్లు పేరుకుపోయాయి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆస్తి పన్నే రూ. 5,500 కోట్లు ఉన్నాయి. మిగతా రూ.5వేల కోట్లు ప్రజల నుంచి రావాల్సి ఉంది. మొత్తం 19.5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీరిలో ఆరు లక్షల మంది మొండి బకాయిదారులు ఉన్నారు. జీహెచ్ఎంసీ ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ.2వేల కోట్లు పెట్టుకోగా.. ఇప్పటి వరకు రూ.1,540 కోట్లు వసూలైంది. వడ్డీ మాఫీ రాయితీ వర్తించే వారి నుంచి రావాల్సిన బకాయిలు దాదాపు రూ.5వేల కోట్లు ఉన్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే వడ్డీలతో సహా ఆస్తిపన్ను చెల్లించిన వారికి సైతం ఈ రాయితీ సదుపాయం వర్తించనుంది. వారు చెల్లించిన మొత్తాన్ని వారి రాబోయే ఆస్తిపన్ను చెల్లింపులో అడ్జెస్ట్ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్‌గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









