మేధో రాజకీయవేత్త-శశి థరూర్

- March 09, 2025 , by Maagulf
మేధో రాజకీయవేత్త-శశి థరూర్

మేధో రాజకీయవేత్త-శశి థరూర్

శశి థరూర్ .. ప్రపంచ దేశాలకు అత్యంత సుపరిచితుడైన భారత రాజకీయ నాయకుడు. ఐక్యరాజ్య సమితిలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన విదేశాంగ రంగంలో గొప్ప నిష్ణాతుడు. కాంగ్రెస్ పార్టీ లౌకికవాద భావ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై ఆ పార్టీ తరపున క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టారు థరూర్. రాజకీయాల కంటే ఎక్కువగా నిత్యం సాహిత్య రంగంలో తలమునకలై ఉండే థరూర్ రచనలను అన్ని వర్గాల వారు ఇష్టపడతారు. నేడు మేధో రాజకీయవేత్త శశి థరూర్ జన్మదినం సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం...

శశి థరూర్ పూర్తి శశి కృష్ణన్ చంద్రశేఖరన్ థరూర్. 1956, మార్చి 9న యూకే రాజధాని లండన్ నగరంలో భారత మలయాళీ దంపతులైన చంద్రశేఖరన్ నాయర్, సులేఖ అలియాస్ లిల్లీ థరూర్ దంపతులకు జన్మించారు. థరూర్ బాల్యమంతా లండన్, కలకత్తా, ముంబై మరియు ఢిల్లీ నగరాల్లో జరిగింది. ఇక విద్యాభ్యాసం విషయానికి వస్తే ప్రాథమిక విద్యను తమిళనాడులోని యార్కాడ్, ముంబై నగరాల్లో పూర్తి చేసిన థరూర్ ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి బిఎ హిస్టరీ, అమెరికాలోని ట్యూఫ్ట్స్ యూనివర్సిటీలోని ఫ్లెచ‌ర్ స్కూలు ఆఫ్ లా అండ్ డిప్లోమ‌సీ నుంచి ఇంటెర్నేష్నల్ రీలేషన్స్ విభాగంలో ఎంఏ, ఎంఏ ఎల్ &డి, పీహెచ్‌డీని పూర్తి చేశారు. ఆ కాలేజీలో 22 ఏళ్లకే డాక్టరేట్ అందుకున్న మొదటి విద్యార్థిగా థరూర్ చరిత్ర సృష్టించారు.  

థరూర్ తండ్రి చంద్రశేఖరన్ నాయర్ అలియాస్ చంద్రన్ థరూర్ 50, 60వ దశకాల్లో ప్రముఖ భారతీయ జర్నలిస్ట్. నాటి ప్రధానులైన నెహ్రూ, శాస్త్రి, ఇందిరా గాంధీలతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కలకత్తాకు చెందిన ప్రముఖ ఆంగ్ల పత్రిక స్టేట్స్‌మ్యాన్ తరపున పనిచేస్తూనే యాడ్స్ మేనేజర్‌గా లండన్ నగరంలో సుదీర్ఘ కాలం పనిచేశారు. థరూర్ ఢిల్లీ కాలేజీ రోజుల్లో విద్యార్ధి రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ఆ తర్వాత ఇంటెర్నేష్నల్ రీలేషన్స్ విభాగంలో పీహెచ్‌డీని పూర్తి చేసి 1979లో ఐక్యరాజ్యసమితిలో కీలకమైన అంతర్జాతీయ పునరావాస విభాగంలో చేరారు. అక్కడ ఒక్కో మెట్టు ఎక్కుతూ సహాయ కార్యదర్శిగా ఎదిగారు. జెనీవా, యూరోప్ మరియు సింగపూర్ దేశాల్లో పనిచేశారు.

1989లో పునరావాస విభాగం నుంచి న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల విభాగంలో చేరిన థరూర్ పలు శాంతియుత ఆపరేషన్ల అమలులో కీలక పాత్ర పోషించారు. 1996లో కమ్యూనికేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ విభాగం డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1997లో కోఫీ అన్నన్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. అన్నన్ శిష్యరికంలో ఐక్యరాజ్యసమితి పనితీరును, సమితిలోని శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలతో వ్యవహారలించాల్సిన వైఖరిని ఆకళింపు చేసుకున్నారు.

అన్నన్ హయాంలోనే థరూర్ ఐక్యరాజ్యసమితి సహాయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రోగ్రాం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. 2006 ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎన్నికల్లో పాల్గొని దక్షిణ కొరియాకు చెందిన బాన్ కీ మూన్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2007 ప్రారంభంలోనే తన సహ్యకార్యదర్శి పదవికి రాజీనామా చేసి ఇండియా వచ్చేశారు.

అంతర్జాతీయ వ్యవహారాల్లో, విదేశాంగ రంగంలో విశేషమైన అనుభవం ఉన్న థరూర్ ను తమ పార్టీలో చేరమని కాంగ్రెస్, సిపిఎం, భాజపా పార్టీలు ఆహ్వానం పలకగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి 2009 లోక్ సభ ఎన్నికల్లో కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి 2014,2019,2024లలో సైతం వరసగా ఎన్నికయ్యారు. 

2009లో యూపీఏ2 ప్రభుత్వంలో విదేశాంగశాఖ సహాయ మంత్రిగా 2010 వరకు పనిచేశారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ మరియు వ్యక్తిగత వివాదాల వల్ల రెండేళ్ల పాటు సాధారణ ఎంపీగా కొనసాగినప్పటికి 2012లో తిరిగి కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2014 వరకు ఆ బాధ్యతల్లో ఉన్నారు.

2014 , 2019 మరియు 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైనప్పటికి థరూర్ ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంట్లో కాంగ్రెస్ తరపున సమర్థవంతంగా ప్రజల తరపున వాదనలు వినిపించడంలో థరూర్ ఎప్పుడు వెనుకంజ వేయలేదు. మోడీ ప్రభుత్వంలో దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగిత గురించి ప్రభుత్వాన్ని విమర్శించారు. అలాగే, ప్రభుత్వం అమలు చేస్తున్న ద్వైపాక్షిక విదేశాంగ విధానాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రభుత్వం దారితప్పుతున్న సమయంలో సరి చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉన్నట్లే దేశ ప్రయోజనాలను సాధించడంలో కృషి చేస్తున్న పాలకులకు మద్దతుగా నిలవాల్సిన రెండు బాధ్యతలు ప్రతిపక్షాలపై ఉందని థరూర్ అనేక సార్లు పేర్కొన్నారు.

రాజకీయాల్లో బిజీగా ఉండే థరూర్‌కు సాహిత్య రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. రచయితగా 20కి పైగా పుస్తకాలను రాసిన థరూర్ పలు ప్రముఖ సాహిత్య అవార్డులను అందుకున్నారు. ఆయన సమకాలీన అమాశాలపై వివిధ తరచుగా పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో కాలమ్స్ రాస్తూ ఉంటారు. థరూర్ దేశవ్యాప్తంగా నిర్వహించే పలు రైటర్, మేధోమథన వర్క్ షాప్స్‌లో తరచూ పాల్గొంటూ వస్తున్నారు.

శశి థరూర్ లిబర్ సెక్యులర్ భావజాలం కలిగిన రాజకీయవేత్త. ప్రపంచమంతా శాంతి సౌఖ్యాతలతో వర్ధిలాల్లని ఆకాంక్షించే వ్యక్తి. మత కలహాలు, తీవ్రవాదం వల్ల లాభం కంటే నష్టమే మానవాళికి ఎక్కువగా జరిగిందని పేర్కొన్నారు. ఈనాడు ఇండియాలో అభివృద్ధి, ఆర్థిక భద్రత, ఉపాధి కల్పన వంటి ప్రధాన అంశాల మీద కాకుండా కులాలు, మతాలు మీద రాజకీయాలు నడవడం భారతదేశ రాజకీయాల తిరోగమన స్థితికి తార్కాణం అని పలు సందర్భాల్లో థరూర్ అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా సమకాలీన భారతదేశ రాజకీయాల్లో థరూర్ వంటి రాజకీయ మేధావి అవసరం చాలా ఉందనేది మాత్రం నిజం. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com