మారిష‌స్‌ చేరుకున్న ప్ర‌ధాని మోడీ

- March 11, 2025 , by Maagulf
మారిష‌స్‌ చేరుకున్న ప్ర‌ధాని మోడీ

మారిష‌స్‌: ప్ర‌ధాని మోడీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు మారిష‌స్ చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో పోర్టు లూయిస్ విమానాశ్ర‌యంలో ఆయ‌నకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మారిష‌స్‌లో ల్యాండ్ అయిన‌ట్లు మోడీ త‌న ఎక్స్ అకౌంట్‌లో వెల్ల‌డించారు. స్నేహితుడు, ప్ర‌ధాని డాక్ట‌ర్ న‌వీన్‌చంద్ర రామ్‌గూల‌మ్‌కు కృతజ్ఞ‌త‌లు తెలిపారు. త‌న ప‌ర్య‌ట‌న ద్వారా మారిష‌స్‌తో అనేక రంగాల్లో కొత్త సంబంధాలు ఏర్ప‌డ‌నున్న‌ట్లు చెప్పారు. అధ్య‌క్షుడు ధ‌ర‌మ్ గోకుల్‌తో భేటీ కానున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఇవాళ సాయంత్రం ఓ క‌మ్యూనిటీ ప్రోగ్రామ్‌లో పాల్గొననున్న‌ట్లు చెప్పారు. భార‌తీయ సంత‌తి ప్ర‌జ‌లు మోడీకి స్వాగ‌తం చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.

బుధ‌వారం మారిష‌స్‌లో 57వ జాతీయ దినోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌వాతు ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భార‌తీయ సైనిక ద‌ళాలు పాల్గొంటున్నాయి. భార‌తీయ నౌకాద‌ళ యుద్ధ విమానంతో పాటు వైమానిక ద‌ళానికి చెందిన ఆకాశ గంగా స్కై డైవింగ్ బృందం పాల్గొన‌నున్న‌ది. హిందూ మ‌హాస‌ముద్రంలో ఉన్న మారిష‌స్‌తో భార‌త్‌కు గాఢ‌మైన బంధం ఉన్న‌ది. ఆఫ్రికా ఖండానికి వెళ్లేందుకు మారిష‌స్‌ను గేట్‌వేగా భావిస్తారు. హిస్ట‌రీ, జియోగ్ర‌ఫీ, క‌ల్చ‌ర్ ద్వారా రెండు దేశాలు క‌నెక్ట్ అయిన‌ట్లు మోడీ తెలిపారు. భార‌తీయ నేవీ, మారిష‌స్ అధికారుల మ‌ధ్య టెక్నిక‌ల్ అగ్రిమెంట్ జ‌ర‌గ‌నున్న‌ది. వాణిజ్యం, సీమాంత‌ర ఆర్థిక నేరాలు, చిన్న‌..మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధి వంటి అంశాల‌పై రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com