ఆదర్శ రాజనీతిజ్ఞుడు-బూర్గుల
- March 13, 2025
బూర్గుల రామకృష్ణారావు...అపర చాణక్యుడిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు గురువు! హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజల ద్వారా ఎన్నికైన మొట్టమొదటి, చిట్టచివరి ముఖ్యమంత్రి కూడా ఆయనే! న్యాయవాదిగా, బహుభాషావేత్తగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజనీతిజ్ఞుడిగా డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు పాత్ర హైదరాబాద్ చరిత్రలో చిరస్మరణీయమైనది. నేడు తెలంగాణ రాజనీతిజ్ఞుడు బూర్గుల రామకృష్ణారావు గారి జయంతి సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం ...
బూర్గుల రామకృష్ణారావు 1899 మార్చి 13న నాటి నైజాం రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి తాలూకాలోని పడకల్ గ్రామంలో నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు రామకృష్ణారావు జన్మించారు.వీరి ఇంటి పేరు పుల్లంరాజు అయినా వీరి స్వగ్రామం బూర్గుల కావటంతో ఆయన ఇంటి పేరు బూర్గులగా స్థిరపడిపోయింది.
రామకృష్ణారావు హైదరాబాద్ ధర్మపంత్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు.1915లో మెట్రిక్ పరీక్ష రాసి, తర్వాత పుణెలోని పెర్గుసన్ కళాశాలలో బీఏ (హానర్స్) డిగ్రీ పూర్తి చేశారు. బొంబాయి వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేసి, హైదరాబాద్‌లోని గొప్ప లాయరుగా పేరొందారు. లాయరుగా ఉచ్ఛస్థితిలో ఉండగా, స్వామీ రామానంద తీర్థ తదితర కాంగ్రెస్ నేతలతో కలసి నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని కీలక పాత్ర పోషించారు. 1912లో వివాహం చేసుకున్న బూర్గుల.. 1920లో భార్య మృతితో, 1924లో ద్వితీయ వివాహం చేసుకున్నారు.
హైదరాబాదులో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన బూర్గుల పేదల పక్షాన నిలిచి కోర్టులో వాదించి సమర్థుడైన న్యాయవాదిగా పేరుపొందారు. ధన సంపాదన కాకుండా ప్రజాహితమే లక్ష్యంగా తన అనన్యమైన వాదన పటిమతో కేసులు వాదించేవారు. అపర చాణక్యుడిగా కీర్తించబడిన పీ.వీ.నరసింహారావు బూర్గుల వారి వద్ద జూనియర్‌గా పనిచేసే ఎంతో నేర్చుకున్నారు. బూర్గుల రామకృష్ణారావు ప్రతిభ విశేషాలు గుర్తించిన నాటి హైదరాబాదు దివాన్ (ప్రధానమంత్రి) సర్ మీర్జా ఇస్మాయిల్ ఆయనకు హైకోర్టు న్యాయమూర్తిగా, న్యాయశాఖాధిపతిగా పదవిని ఇవ్వజూపగా తిరస్కరించారు.
ఒకవైపు పేద ప్రజల న్యాయవాదిగా ఉంటూనే ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం మరియు భూదానోద్యమాలలో పాల్గొన్నారు. బ్రిటిష్ వారి పాలనను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళారు. 1948లో నిజాం నవాబుకు వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో పోలీసు చర్య జరిగిన తర్వాత భారత ప్రభుత్వంచే ముఖ్యమంత్రిగా నియమితులైన ఎంకె.వెల్లోడి ప్రభుత్వంలో బూర్గుల రెవిన్యూ మరియు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పుడే ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 1952లో హైదరాబాదు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో షాద్‌నగర్ నుండి కాంగ్రెస్ శాసనసభ్యుడిగా గెలిచి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్య బద్ధంగా హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల చరిత్రలో నిలిచిపోయారు.
బూర్గుల మంత్రివర్గంలో తెలంగాణ ప్రాంతానికి చెందినవారు నలుగురు, మరఠ్వాడా ప్రాంతానికి చెందినవారు ముగ్గురు, కర్ణాటక ప్రాంతానికి చెందినవారు ఒక్కరు, మొత్తం 8 మంది మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి నలుగురు, మరఠ్వాడా నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఒక్కరు ఉపమంత్రులుగా ఉన్నారు. వ్యవసాయ భూముల చట్టం (1950), హైదరాబాద్ కౌలుదారు చట్టం (1951)లు ఆమోదం పొందాయి. కౌలుదారు హక్కుల్ని రికార్డుచేసే విధానాన్ని ప్రవేశపెట్టారు.1955 జూలై 1న హైదరాబాద్ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేశారు.
ఈ చట్టంలో భూస్వామి తన సొంత సేద్యం కోసం తన కింద ఉంచుకోవాల్సిన భూ విస్తీర్ణ కమతాన్ని 5 రెట్లుగా నిర్ణయించారు. ఈ చట్టాన్ని బూర్గుల ప్రభుత్వం కొంత సవరించింది. ఈ చట్టానికి సంబంధించిన బిల్లు 1954 ఏప్రిల్‌లో హైదరాబాద్ శాసనసభలో చర్చకురాగా.. బూర్గుల ఉర్దూలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. దేశంలోనే భూకమతాలపై గరిష్ట పరిమితి విధించిన మొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల ప్రసిద్ధిచెందారు.ఆయన చేపట్టిన భూసంస్కరణలు దేశానికే ఆదర్శవంతమైనాయి.
ఆచార్య వినోబాభావే ప్రారంభించిన శాంతియాత్ర కాలినడకన శివరాంపల్లి నుంచి పోచంపల్లి (నల్లగొండ జిల్లా)కి చేరుకుంది. హరిజనుల కోసం 100 ఎకరాల్ని వెదిరే రామచంద్రారెడ్ది దానం చేశాడు. ఈ విధంగా పాదయాత్ర ఫలితంగా రెండు నెలల సమయంలోనే 12 ఎకరాల భూమి దానంగా లభించింది. ఈ భూదానోద్యమాన్ని నాటి రెవెన్యూ మంత్రి బూర్గుల సమర్థించారు. దానంగా ఇవ్వబడిన భూమిని పేదలకు పంచడం కోసం వినోబాభావే సర్వోదయ భూయజ్ఞం హైదరాబాద్ లాండ్ రెవెన్యూ స్పెషల్ రూల్స్ తయారు చేయించిన బూర్గుల గెజిట్ ప్రకటింపజేయడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా భూదాన సేకరణకు సంబంధించి, ప్రభుత్వం ఈ విధంగా నియమావళిని రూపొందించింది.
విద్యారంగంలో కూడా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. అప్పటివరకు తెలుగు వారికి ఉర్దూ బోధన భాషగా ఉండేది. దానిని రద్దు చేసి తెలుగు మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించారు. జిల్లాల్లో ఉపాధ్యాయులకు శిక్షణా సౌకర్యాలు కల్పించారు. మొదటి తరగతి నుంచి మాతృభాష, 3వ తరగతి నుంచి హిందీని రెండో భాషగా, 5వ తరగతి నుంచి ఆంగ్లాన్ని తృతీయ భాషగా ప్రవేశపెట్టారు. అంటే త్రిభాషా సూత్రాన్ని అనుసరించారు. ప్రాథమిక పాఠశాలల సంఖ్య 4 వేల నుంచి 14 వేలకు పెరిగింది. రాధాకృష్ణ కమిషన్ సిఫారసును అనుసరించి కళాశాలల్లో 3 ఏండ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టారు.
వరంగల్, హైదరాబాద్ నగరాల్లో విశ్వవిద్యాలయ స్థాపనకు అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ రాష్ట్రంలోని మూడు భాషా ప్రాంతాల్లో శిక్షణా కళాశాలలు, వ్యవసాయ కళాశాలలు, పశుసంవర్థక కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలను స్థాపించారు. వెల్లోడి మంత్రివర్గంలో రెవెన్యూ, విద్యాశాఖల మంత్రిగా ఉన్న బూర్గుల.. జిల్లాకు ఒక కళాశాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోగల అసఫియా స్టేట్ లైబ్రరీ పేరును హైదరాబాద్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా మార్చారు.
తెలుగు భాష మాట్లాడే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్ని కలపాలా? వద్దా? అనే విషయంలో అనేక తర్జనభర్జనలు జరిగాయి. కొండా వెంకటరంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి.నరసింగరావులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు స్పష్టం చేసింది. తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన మేరకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి మద్దతు ఇచ్చి తన పదవిని త్యాగం చేశారు. ఆ తర్వాత కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగారు.
బూర్గుల వారు గొప్ప పరిపాలకుడే కాక సాహితీవేత్త కూడా ! తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారశీక, సంస్కృత భాషల్లో బూర్గులకు ప్రావీణ్యం ఉంది. సంస్కృతంలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీ శృంగగిరి శారదాకృతి, శ్రీరామస్తవం, తెలుగులో కృష్ణశతకం పుష్పాంజలి తోకచుక్క మొదలైన పద్య కవితలను, అనువాద రచనలు, సాహితీ వ్యాసాలను, ఎన్నో గ్రంథాలకు పీఠికలను రాశారు. ఇంగ్లీషులో కూడా ఎన్నో కవితలు రాశారు. పారసీక వాజ్మయ చరిత్రను రాశారు. ఒక రాజకీయవేత్తలో ఇంత గొప్ప సాహితీవేత్త ఉండడం చాలా అరుదు. అందుకే మహాకవి దాశరథి సంస్కృత శ్లోకం, పారశీ, గజల్ తెలుగు పద్యం, వెరసి బూర్గుల అని బూర్గుల వారిని విమర్శించారు. జీవితకాలం తాను నమ్మిన విలువలకు కట్టుబడిన బూర్గుల రామకృష్ణారావు 1967,సెప్టెంబర్ 14న తుదిశ్వాస విడిచారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్‌లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!