జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పలు భాషల్లో ప్రసంగించిన పవన్

- March 14, 2025 , by Maagulf
జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పలు భాషల్లో ప్రసంగించిన పవన్

అమరావతి: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలు భాషల్లో ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించారు. హోలీ పండుగ రోజు జనసేన ఆవిర్భావ సభ జరగడం యాదృచ్ఛికం కాదని, ఇది భగవంతుడి ఆశీస్సుల ఫలితమని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను ప్రజల ముందుంచారు.

భిన్న భాషల్లో ప్రసంగించి అభిమానులను ఆకట్టుకున్న పవన్

తనకు ఏకంగా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని పవన్ తెలిపారు. ఇటీవల తమిళనాడులో షణ్ముఖ యాత్ర చేసినప్పుడు అక్కడి ప్రజలు ఆయన ప్రసంగాలను ఆసక్తిగా చూస్తామని చెప్పిన విషయాన్ని వెల్లడించారు. మహారాష్ట్రలో కూడా తనను పర్యటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కోరారని, హర్యానా నుంచి కూడా ఆహ్వానం అందిందని తెలిపారు.ఎన్డీఏ కూటమి కోసం మహారాష్ట్రలో తన ప్రచారం విజయవంతమైందని, తాను ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఒక్కటి మినహా అన్నిచోట్ల కూటమి విజయం సాధించిందని పవన్ స్పష్టం చేశారు.

భాషా వివాదం పై పవన్ స్పష్టమైన స్పందన

తమిళనాడు కేంద్రంగా హిందీ భాషపై జరుగుతున్న చర్చకు పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందించారు. భారతదేశం రెండు భాషలతో పరిమితం కాకూడదని, బహుభాషా విధానం అనుసరించాలి అని అభిప్రాయపడ్డారు. ప్రజల మధ్య అనురాగం, పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందాలంటే భారతదేశంలో భిన్న భాషలు ప్రాధాన్యత కలిగి ఉండాలని పవన్ వ్యాఖ్యానించారు.

“బోలో భారత్ మాతాకీ జై” అంటూ పవన్ నినాదం

సభ చివరలో పవన్ కల్యాణ్ భారతీయత్వాన్ని నొక్కి చెప్పారు. బహుభాషా విధానం దేశ సమగ్రతకు అవసరమని మరోసారి స్పష్టం చేశారు. అన్ని భాషలను సమానంగా గౌరవించాలని, ప్రజల మధ్య భాషా వివాదాలను పెంచకుండా ఐక్యతను కాపాడుకోవాలని సూచించారు. చివరిగా “బోలో భారత్ మాతాకీ జై” అంటూ నినాదం చేసి, సభలో ఉత్సాహాన్ని నింపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com