'మేడమీద అబ్బాయి' రివ్యూ

- September 08, 2017 , by Maagulf
'మేడమీద అబ్బాయి' రివ్యూ

చిత్రం:మేడ మీది అబ్బాయి
నటీనటులు: అల్లరి నరేశ్, నిఖిలా విమల్, అవసరాల శ్రీనివాస్, సత్యం రాజేశ్, జయప్రకాశ్, తులసి, సుధ, హైపర్ ఆది, రవి ప్రకాశ్ తదితరులు
సంగీతం: షాన్ రెహమాన్
కెమెరా మెన్:కుంజుని.ఎస్.కుమార్
ఎడిటింగ్:నందమూరి హరి
రచయిత: వినీత్ శ్రీనివాసన్
నిర్మాత:బొప్పన చంద్రశేఖర్
డైరెక్టర్: జి.ప్రజీత్

కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతోన్న అల్లరి నరేశ్, మేడమీద అబ్బాయితో సూపర్ హిట్ కొడతానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మళయాలీ హిట్ ఒరుఒడక్కన్ సెల్ఫీ రీమేక్ గా రూపొందిన ఈసినిమాను, మాతృకను డైరెక్ట్ చేసిన జి.ప్రజితే డైరెక్ట్ చేశారు. దీంతో మేడమీది అబ్బాయి తెలుగులోనూ మంచి హిట్ అవుతుందని ఓ బజ్ స్టార్ట్ అయ్యింది. మరి ఈ బజ్ ను కంటెంట్ తో కరెక్ట్ గా ప్రజెంట్ చేసి, అల్లరి నరేశ్ సక్సెస్ అందుకున్నాడా? లేదా? మేడమీద అబ్బాయి నరేశ్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించాడా? చూద్దాం

కథ:
శ్రీను(అల్లరి నరేశ్) ఇంజనీరింగ్ లో 24బ్యాక్ లాగ్స్ తో చదువుకు స్వస్తి చెప్పి సినిమాల్లోకి వెళ్లాలనుకుంటాడు. రాజమౌళి అసోసియేట్ గా చేరాలని ఇంట్లో పర్మిషన్ అడుగుతుంటాడు. కానీ వాళ్ల నాన్న(జయప్రకాశ్) ఇంజనీరింగ్ పాస్ కాకపోతే, తన కిరాణకొట్లో పొట్లాలు కట్టిస్తాను గానీ, సినిమాల్లోకి పంపించేది లేదని చెబుతాడు. దీంతో ఇంట్లో చెప్పకుండా ఆత్రేయపురం నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతాడు. అక్కడ ట్రైన్ లో పక్కింటి అమ్మాయితో సెల్ఫీ దిగి ఫ్రెండ్ కు వాట్సప్ చేస్తాడు. ఆ వాట్సపే శీను లైఫ్ ను టర్న్ చేస్తుంది. ఊరిలో విలన్ గా మార్చి, పోలీస్ లకు వాంటెడ్ క్రిమినల్ గా మార్చేస్తుంది. ఆ కేసు నుంచి శీను ఎలా బయటపడ్డాడు? అసలు సెల్ఫీకి పోలీస్ కేసుకు సంబంధం ఏంటన్నది మిగిలిన కథ

విశ్లేషణ:
సెల్ఫీ ఇప్పుడు యూత్ కు ఓ హాబిట్ లా మారిపోయింది. ప్రతీ మూమెంట్ ను సెల్పీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం డైలీ లైఫ్ లో ఓ భాగం అయిపోయింది. ఆ పాయింట్ ను చూస్ చేసుకోవడం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఇక ఆ సెల్పీ వెనుక ఫేస్ బుక్, ఇంటర్నెట్ ప్రేమలతో మోసపోయే అమ్మాయి స్టోరీని తీసుకుని ఇవాళ సొసైటీలో జరుగుతున్న కాంటెంపరరీ పాయింట్ ను తీసుకున్నాడు దర్శకుడు. ఇంజనీరింగ్ బ్యాక్ డ్రాప్, సినిమాల్లోకి వెళ్లాలనుకునే హీరో క్యారెక్టర్ తో సినిమాను చాలా ఫన్ గా మలచాలనుకున్నాడు దర్శకుడు. తాను అనుకున్నది కొంత వరకు తియ్యగలిగినా ఫస్టాఫ్ లో వచ్చే కామెడీ నవ్వించదు గానీ, కొంచెం చిరాకు పెడుతుంది. కామెడీ కోసమే డైలాగులు, సన్నివేశాలు పెట్టినట్లు కనిపిస్తుంది. అయితే ఫస్టాఫ్ లో హీరోను పరిచయం చెయ్యడానికి, నరేశ్ కు ఉన్న కామెడీ హీరో ఇమేజ్ ను ఎలివేట్ చెయ్యడానికి ఎక్కువ టైం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. అయితే హీరోయిన్ తో సెల్ఫీ దిగి, ఆ సెల్ఫీతో ఊరివాళ్లముందు విలన్ గా మారిపోయి, ఆ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసుకోవడానికి మొదలు పెట్టే మిషన్ తో సెకండ్ ఆఫ్ కొంచెం ఇంట్రస్టింగ్ గా సాగుతుంది. పోలీస్ కేసులో ఇరుక్కోవడం, బయటకు వెళ్తే గుర్తుపట్టి పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని అతిగా భయపడి ప్రైవేట్ డిటెక్టివ్ దగ్గరకు వెళ్లడం, వాళ్లు అందరూ కలిసి హీరోయిన్ ను వెతికే సన్నివేశాలు ఇంట్రస్టింగ్ గా కనిపిస్తాయి. అక్కడ హీరోయిన్ ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తిని లవ్ చేసి ఇంటి నుంచి, పారిపోయిందని తెలుసుకుని ఆ వ్యక్తిని పట్టుకోవడానికి వెళ్లే సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. అయితే స్టోరీ లైన్ లో రీఫ్రెషింగ్ గా కనిపించిన ఈ సినిమా ఎగ్జిక్యుషన్ లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. అల్లరి నరేశ్, హైపర్ ఆది, అవసరాల శ్రీనివాస్ ఇలా స్క్రీప్ పై కామెడీ పండించేవాళ్లు ఉన్నా, ఎంటర్టైన్ చెయ్యలేకపోయింది. ఏదో సినిమా చూస్తున్నాం అంటే చూస్తున్నాం అన్నట్లుగా సాగుతుంది. ఏదో మిస్ అయిన ఫీల్ కూడా వస్తుంది. దీనికితోడు హైపర్ ఆది డైలాగులు అన్నీ జబర్ధస్త్ కామెడీ షోని ఇక్కడ కూడా అతికించారా? అన్నట్లుగా ఉంటుంది. దీంతో మేదమీద అబ్బాయి కొంచెం బోరింగ్ కూడా కనిపిస్తాడు. ఇక ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే అల్లరి నరేశ్ మేడమీద అబ్బాయి గా కనిపించడానికి కొంచెం కష్టపడినట్లుగానే కనిపించింది. తన బాడీ లాంగ్వేజ్ నుంచి యాక్టింగ్ వరకు అన్నింటా మునుపటి ఈజ్ మిస్ అయిన ఫీల్ వస్తుంది. అయితే తన టైమింగ్ తో కామెడీ చెయ్యడానికి నరేశ్ బాగానే ప్రయత్నించాడు. ఇక హీరోయిన్ నిఖిలా విమల్ తన పాత్ర పరిధి మేరకు బాగానే చేసింది. అవసరాల శ్రీనివాస్ డిటెక్టివ్ యుగంధర్ గా కొత్తగా కనిపించలేదు గానీ ఓకె అనిపించుకున్నాడు. హైపర్ ఆది యాక్టర్ కమ్ డైలాగ్ రైటర్ గా రెండు పాత్రలు పోషించాడు గానీ తన జబర్ధస్త్ మార్క్ నుంచి బయటపడలేకపోవడంతో, ప్రేక్షకులకు కొత్త ఫీల్ క్రియేట్ కాలేదు. సత్యం రాజేశ్, తులసి, సుధ, జయప్రకాశ్ వీళ్ల పాత్రలు పెద్దగా ప్రభావం చూపించకపోయినా, ఉన్నంత వరకు ఓకే అనిపిస్తాయి. టెక్నికల్ టీం విషయానికి వస్తే షాన్ రెహ్మాన్ మ్యూజిక్ సినిమాకు సరిపోయింది. మాతృకకు సంగీతాన్ని అందించిన రెహ్మాన్ ఇక్కడ కూడా తన మార్క్ చూపించాడు. నోట్లోన వేలు పెడితే సాంగ్ బాగుంది. కెమెరా వర్క్ ఓకే. అయితే మేడమీద అబ్బాయి టైటిల్ కు మాత్రం  ఈకథ న్యాయం చేయలేకపోయిందనే చెప్పాలి. నరేశ్ మేడమీద గదిలో ఉన్నా, అక్కడి నుంచి శీను పాత్ర బైనాక్యులర్ తో ఓ సీన్ లో కనిపించడం తప్ప ఏం చేయలేదు. మొత్తంగా మేడమీద అబ్బాయి కామెడీ చెయ్యడంలో కొంచెం తడబడ్డా, నరేశ్ ఏం చేశాడో చూద్దాం అనుకునే ప్రేక్షకులు ఎవరైనా ఉంటే సినిమాకు వెళ్లొచ్చు.

చివరగా:మేడమీద అబ్బాయి కొత్తగా అనిపించాడు.  
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com