Maa Gulf
నిరుద్యోగ ఉపాధ్యాయులకు శుభవార్త.!

తెలంగాణలో ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శనివారం సాయంత్రం విడుదల చేసింది. టీఆర్‌టీ ద్వారా 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మొత్తం ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసింది. టీఆర్‌టీకి మొత్తం నాలుగు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఫిబ్రవరిలో పరీక్ష తేదీలు ప్రకటన 
స్కూల్‌ అసిస్టెంట్లు 1941, పీఈటీ 416 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు (వ్యాయామ విద్య) 9, భాషా పండితులు 1011, ఎస్‌జీటీ 5,415 పోస్టుల చొప్పున భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి నవంబర్‌ 30 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, భాషా పండితుల పోస్టులకు టెట్‌ 20శాతం వెయిటేజీ కల్పించనున్నారు. తెలంగాణలో 31 జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.