సప్తగిరి ఎల్‌ఎల్‌బి సినిమా రివ్యూ

- December 07, 2017 , by Maagulf
సప్తగిరి ఎల్‌ఎల్‌బి సినిమా రివ్యూ

నటీనటులు: సప్తగిరి.. కాశిష్‌ వోహ్రా.. సాయికుమార్‌.. శివప్రసాద్‌.. షకలక శంకర్‌ తదితరులు 
సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌ 
ఛాయాగ్రహణం: సరంగం 
ఎడిటింగ్‌: గౌతంరాజు 
ఫైట్స్‌: విజయ్‌ 
నిర్మాత: డాక్టర్‌ కె.రవి కిరణ్‌ 
బ్యానర్‌: సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
రచన: పరుచూరి బ్రదర్స్‌ 
దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల 
విడుదల తేదీ: 07-12-2017 హాస్యనటుడిగా వెండితెరకు పరిచయమైన సప్తగిరి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. కమెడియన్‌లు కథానాయకులుగా మారడం తెలుగు తెరకు కొత్తమే కాదు. అలా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'తో తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నాడు సప్తగిరి. ఒక పక్క హాస్యనటుడిగా రాణిస్తూనే కథానాయకుడిగానూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే బాలీవుడ్‌లో ఘన విజయాన్ని సాధించిన 'జాలీ ఎల్‌ఎల్‌బి'ని 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'గా రిమేక్‌ చేశాడు. చరణ్‌ లక్కాకుల దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం సప్తగిరి కెరీర్‌కు ఎలాంటి బలాన్ని ఇచ్చింది? మాతృక స్థాయిలో ఆకట్టుకుందా?
కథేంటంటే: సప్తగిరి(సప్తగిరి) ఎల్‌ఎల్‌బి చేస్తాడు. వూరిలో పంచాయతీకి వచ్చిన చిన్న చిన్న గొడవలను తన తెలివితో పరిష్కరిస్తాడు. కానీ, కోర్టులో అడుగుపెడితే ఒక్క కేసూ గెలవలేడు. పట్నం వెళ్తే పెద్ద, పెద్ద కేసులు చూడవచ్చని.. అనుభవం సంపాదించవచ్చని అనుకుంటాడు. అలా పట్నం చేరుకుని లాయర్‌గా తన ప్రాక్టీసు మొదలుపెడతాడు. ఇదే సమయంలో ఓ హిట్‌ అండ్‌ రన్‌ కేసు సప్తగిరిని ఆకర్షిస్తుంది. దాన్ని రాజ్‌పాల్‌(సాయికుమార్‌) వాదించి ఆ కేసును కోర్టులో కొట్టించేస్తాడు. ఆ హిట్‌ అండ్‌ రన్‌ కేసును సప్తగిరి తిరగతోడతాడు. ఒక కీలకమైన సాక్షిని కూడా సంపాదిస్తాడు. అయితే ఇదంతా రాజ్‌పాల్‌ ఆడిన ఎత్తుగడ అని, ఈ సాక్షి వెనుక రాజ్‌పాల్‌ ఉన్నాడన్న సంగతి తెలుస్తుంది. దీంతో రూ.20లక్షలు లంచం తీసుకుని ఆ కేసు నుంచి తప్పుకొంటాడు సప్తగిరి. అప్పటివరకూ సప్తగిరిని దేవుడిలా కొలిచిన జనం చీదరించుకుంటారు. తన తప్పు తెలుసుకున్న సప్తగిరి చనిపోయిన వాళ్లకు న్యాయం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? సప్తగిరి కేసును ఎలా గెలిచాడు? అన్నదే కథ
 
ఎలా ఉందంటే: బాలీవుడ్‌లో విడుదలైన ఘన విజయాన్ని అందుకున్న 'జాలీ ఎల్‌ఎల్‌బి'కి ఇది రిమేక్‌. కథలోని కీ పాయింట్‌, అందులోని సన్నివేశాలకు మాతృకను ఫాలో అయిపోయారు. కామెడీ, యాక్షన్‌ సన్నివేశాలు, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఇవన్నీ సప్తగిరి కోసం జోడించారు. అవి మెప్పిస్తాయి. డ్యానుల్లో సప్తగిరి ఈజ్‌ చూపించాడు. తొలిపాటలో షాకింగ్‌ స్టెప్స్‌ కూడా వేశాడు. సప్తగిరి నుంచి వినోదం కోరుకుంటారని భావించిన దర్శకుడు దానికి తగ్గట్టుగా సన్నివేశాలను సృష్టించుకున్నాడు. సాయికుమార్‌ ఎంట్రీతో కథలో వేగం వచ్చింది. కోర్టుకు సంబంధించిన సన్నివేశాలన్నీ 'జాలీ ఎల్‌ఎల్‌బి' తరహాలోనే సాగాయి. మాతృక చూసిన వారికి ఆ ఫీల్‌ తగ్గకుండా ప్రతీ ఒక్కరూ రాణించే ప్రయత్నం చేశారు. చివరి 40 నిమిషాల పాటు జరిగే కోర్టు సన్నివేశాలు ఈ సినిమాకు ప్రాణం. సాయికుమార్‌, సప్తగిరి, శివప్రసాద్‌ పోటాపోటీగా నటించి ఈ ఘట్టాన్ని రక్తికట్టించారు. రైతుల ఎలిమెంట్‌ మాతృకలో లేదు. దాన్ని జోడించడం వల్ల పరుచూరి బ్రదర్స్‌ కాస్త ఎమోషనల్‌ టచ్‌ ఇవ్వగలిగారు. కొన్ని సంభాషణలను యథాతథంగా వాడుకున్నారు.
ఎవరెలా చేశారంటే: 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'తో హీరోగా మారిన సప్తగిరి చేసిన ద్వితీయ ప్రయత్నం ఇది. డ్యాన్సుల్లో, డైలాగ్‌లు చెప్పటంలో తన ప్రతిభను చూపించాడు. చివరి 40నిమిషాల్లో సాయికుమార్‌తో పోటీపడి నటించాడు. హుషారు, ఎమోషన్‌ రెండింటినీ పండించగలిగాడు. బొమన్‌ ఇరానీ చేసిన పాత్రను టచ్‌ చేయడం చాలా కష్టం. కానీ సాయికుమార్‌ ఆ సాహసం చేశారు. బొమన్‌ ఇరానీ నటనకు ఏమాత్రం తగ్గకుండా నటించారు. సుదీర్ఘ విరామం తర్వాత పెద్ద పెద్ద డైలాగ్‌లను చాలా అలవోకగా చెప్పేశారు. 'జాలీ ఎల్‌ఎల్‌బి' చూడని వారికి ఈ సినిమాలో సాయికుమార్‌ ప్రధాన హీరో అనిపిస్తుంది. శివ ప్రసాద్‌ నటనా ఆకట్టుకునేలా సాగింది. కథానాయికకు పెద్ద ప్రాధాన్యం లేదు. ఆమె చాలా సాధారణంగా కనిపించింది.
సాంకేతికంగా: ఇలాంటి కథలను రిమేక్‌ చేయటం చాలా కష్టం. మార్పులు ఎక్కువ చేస్తే కథలో ఫీల్‌ తగ్గిపోతుంది. దర్శకుడు దాన్ని చాలా జాగ్రత్తగా డీల్‌ చేశాడు. కోర్టులో జరిగే సన్నివేశాలను సమర్థంగా తెరకెక్కించాడు. కథా గమనానికి పాటలు అడ్డుపడినట్లు అనిపిస్తుంది. సినిమా ఉన్నతంగా తీర్చిదిద్దారు. పరుచూరి బ్రదర్స్‌ సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
 
బలాలు 
+ కోర్టు సన్నివేశాలు 
+ సాయికుమార్‌ 
+ సప్తగిరి డ్యాన్సులు
బలహీనతలు 
- పాటలు 
- తెలిసిన కథే కావటం
చివరిగా: సప్తగిరి ఎల్‌ఎల్‌బి ప్రేక్షకుల 'కోర్టులో' గెలిచాడు 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com