రివ్యూ: మెర్క్యురీ

- April 14, 2018 , by Maagulf
రివ్యూ: మెర్క్యురీ

చిత్రం: మెర్క్యురీ

నటీనటులు: ప్రభుదేవా.. సనత్‌రెడ్డి.. ఇందూజ.. దీపక్ పరమేశ్‌.. పురుషోత్తమ్.. అనీశ్ పద్మనాభన్..రమ్య నంబీశన్‌ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణ్‌
ఛాయాగ్రహణం: తిరునవుకరసు
కూర్పు: వివేక్ హర్షన్‌ 
నిర్మాత: కార్తికేయన్ సంతానం.. జయనితిల్‌ 
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు
బ్యానర్‌: స్టోన్‌బెంచ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పెన్‌ ఇండియా లిమిటెడ్‌ పతాకం
విడుదల తేదీ: 13-04-2018

దాదాపు 30ఏళ్ల కిందట కమల్‌హాసన్‌-సింగితం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్పకవిమానం' అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా తీసిన ఆయన సినిమా అప్పట్లో ఓ సంచలనం. అయితే పంచ్ డైలాగ్‌లు, హీరో-విలన్ల అరుపులు లేకుండా ఈ రోజుల్లో సినిమా ఊహించలేం. ఫక్తు మాస్ కమర్షియల్ సినిమాలు వస్తున్న నేటి రోజుల్లో పుష్పకవిమానం నాటి రోజులను గుర్తు చేస్తూ ఓ సినిమా తీయడం అంటే సాహసమే. అలాంటి ప్రయత్నమే 'మెర్క్యురీ'. తమిళంలో విభిన్న చిత్రాలను తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. పైగా అందులో ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరుగాంచిన ప్రభు దేవా నటించడం మరో విశేషం. మరి మాటలు లేకుండా వచ్చిన ఈ హారర్ థ్రిలర్ల్ ఎలా ఉంది? కార్తీక్ సుబ్బరాజు చేసిన ప్రయత్నం ఆకట్టుకుందా!

కథేంటంటే: ఓ అయిదుగురు స్నేహితులు. వాళ్లకు వినిపించదు.. మాటలు రావు. తమ స్నేహితురాలి పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవాలని సరదాగా కారులో బయటకు వెళ్తారు. పొరపాటున ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో గుడ్డివాడైన ప్రభుదేవా చనిపోతాడు. ఆ శవాన్ని తీసుకెళ్లి పాడుబడిన ఫ్యాక్టరీలో పాతిపెడతారు. మరుసటి రోజు వెళ్లి చూస్తే అక్కడ శవం కనిపించదు. శవంతో పాటు స్నేహితుల్లో ఒకరైన యువతి కూడా మాయం అవుతుంది. మరి ఆ శవం ఏమైంది? ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లింది? చనిపోయిన వ్యక్తి ఆత్మలా వచ్చి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే కథ.

ఎలా ఉందంటే: ఇది ఒక మూకీ సినిమా. పుష్పక విమానం తర్వాత చేసిన ప్రయోగమిది. పుష్పకవిమానంలో ఎవరూ మూగవారు కాదు. కానీ, వాళ్ల మధ్య మాట్లాడే అవసరం రాదు. కానీ ఇక్కడ దర్శకుడు అయిదుగురిని చెవిటి, మూగవాళ్లగా మార్చేశాడు. ఆత్మకు కూడా కళ్లు కనిపించవు. మాట్లాడలేదు. ఇలాంటి సబ్జెట్లు తీయడం కష్టం. దాన్ని కార్తీక్ సుబ్బరాజు బాగానే డీల్ చేశాడనిపిస్తుంది. ఒక ఆత్మ తనని చంపిన వారిపై పగ తీర్చుకోవాలనుకోవడం హారర్ సినిమాల్లో సర్వసాధారణం. మాటలు లేకపోవడమే ఈ సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. శవం మాయం కావడం దగ్గరి నుంచి థ్రిల్లింగ్ ఎపిసోడ్‌లు మొదలవుతాయి. ద్వితీయార్ధం మొత్తం ఒక పాడు పడిన ఫ్యాక్టరీలో జరుగుతుంది. అక్కడ సన్నివేశాలన్నీ ఉత్కంఠ కలిగిస్తాయి. కళ్లులేని దెయ్యం.. నోరులేని వ్యక్తులు ఎలా తప్పించుకున్నారన్నదే ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దారు. పతాక సన్నివేశాలు గుండెలను హత్తుకునేలా తీర్చిదిద్దాడు. ఆత్మలకు కూడా ఎమోషన్ ఉంటుందని చెప్పేందుకు కొన్ని సన్నివేశాలను రాసుకొన్నాడు దర్శకుడు. కథను ముగించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. హారర్ థ్రిల్లర్ కథల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. దానికి దర్శకుడు ఎమోషన్ కూడా జోడించాడు. ఈ సినిమాలో మాటలు లేవన్న సంగతి ప్రేక్షకుడు మర్చిపోయి కథలో లీనమై పోయేలా సన్నివేశాలను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ విషయంలో కార్తీక్ సుబ్బరాజు పనితనం ఆకట్టుకుంటుంది. కొన్ని హాలీవుడ్ సినిమా ఛాయలు మెర్క్యురీలో కనిపించినా, ఇలాంటి కథను ఈ తరహాలో డీల్ చేయడం సాహసమనే చెప్పాలి.

ఎవరెలా చేశారంటే: ప్రభుదేవాకు స్నేహితులుగా కనిపించిన వారు అందరూ కొత్తవారే. కానీ, వారి అభినయం ఆకట్టుకుంటుంది. ఈ కథకు మూలం ప్రభుదేవా. ఒక సైకోలా, ఓ ఆత్మలా, మనసున్న మనిషిలా అతని నటన ఆకట్టుకుంటుంది. సంతోష్ నారాయణ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. తిరునవుకరసు ఛాయాగ్రహణం సినిమాకు మరో బలం. మంచు పొగల నేపథ్యంలో తీసిన సన్నివేశాలు ఛాయాగ్రాహకుడి పనితీరుకు నిదర్శనంగా నిలుస్తాయి. కొన్ని కొన్ని షాట్స్ షాకింగ్‌గా అనిపిస్తాయి. నిడివి కూడా చాలా తక్కువ. గంటా నలభై నిమిషాల్లో ముగిసే కథ. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా షార్ప్‌గా చూపించగలిగాడు. ఆత్మలు, దెయ్యాల కథలు చాలా వచ్చినా, వాటిలో మెర్క్యురీ ప్రత్యేకంగా నిలుస్తుంది.

బలాలు: 
నేపథ్యం
ప్రభుదేవా నటన
సాంకేతిక నిపుణుల పనితనం

బలహీనతలు 
- హారర్ నేపథ్యం తక్కువ
- నటులు తెలుగువారు కాకపోవడం
చివరిగా: మెర్క్యురీ ఓ మంచి ప్రయత్నం.

మాగల్ఫ్.కామ్ రివ్యూ: 2.75/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com