గాలివానకు అల్లకల్లోలమైన ఏ.పి

- May 01, 2018 , by Maagulf
గాలివానకు అల్లకల్లోలమైన ఏ.పి

అమరావతి:ఈదురు గాలులు, అకాలవర్షంతో ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలమయ్యింది. కోస్తాంధ్ర జిల్లాల్లో మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. విజయవాడ, అమరావతి, గుంటూరుల్లో అయితే.. సాయంత్రం నాలుగింటికే చీకట్లు కమ్ముకున్నాయి. దట్టమైన మేఘాలు అలుముకోవడంతో పాటు  పలుచోట్ల పిడుగులు కూడా పడడంతో జనం భయాందోళనకు గురయ్యారు. 

అమరావతి సచివాలయ ప్రాంతంలో సాయంత్రమే చీకటైపోయింది. దట్టమైన మేఘాలు ఒక్కసారిగా కమ్మేయడంతో.. అమరావతి ప్రాంతమంతా అంధకారంలోకి వెళ్లిపోయింది. ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురవడంతో సచివాలయం దగ్గర ఉన్న వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గుంటూరులోనూ ఇదే పరిస్థితి. ఉరుముల శబ్దాలతో నగరమంతా హోరెత్తిపోయింది. పిడుగులు పడుతుండడంతో జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈదురు గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయడంతో.. గుంటూరు అంతా చీకటిమయం అయ్యింది. 

పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులకు పెదవేగి మండలంలో తాటి చెట్టు విరిగిపడింది. రోడ్డుపై వెళ్తున్న బైక్‌పై పడడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జంగారెడ్డి గూడెంలో మామిడి, జీడిమామిడి తోటలతో పాటు, పొగాకు, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. 

ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.   శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో  పిడుగులు ఉధృతంగా పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పార్వతీపురం, కురుపాం, గజపతినగరం, ఇచ్చాపురం, పలాస, ఆమదాలవలస, శ్రీకాకుళంలోనూ ఈదురు గాలులతో కూడిన  వర్షం పడింది. విశాఖలో మధ్యాహ్నానికి వర్షం తగ్గడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com