ఐక్యరాజ్యసమితిలో హిందీకి మరింత ప్రాధాన్యం

- March 18, 2025 , by Maagulf
ఐక్యరాజ్యసమితిలో హిందీకి మరింత ప్రాధాన్యం

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో హిందీ భాష వినియోగాన్ని ప్రోత్సహించే ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు  యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత భారతీయ రాయబారి కార్యాలయ ప్రధాన అధికారి పర్వతనేని హరీష్‌తో న్యూయార్క్‌లోని ఆయన కార్యాలయంలో సమావేశయ్యారు.హిందీ వినియోగానికి సంబంధించిన అనేక అంశాలను వీరిరువురు చర్చించారు.ఐక్యరాజ్యసమితి నుంచి హిందీలో వార్తలను ప్రసారం చేయడంతో పాటు హిందీ భాషను మరింత మందికి చేరువ చేసే ప్రాజెక్టును మరో 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమానికి భారత్ ప్రతి ఏడాది ₹13 కోట్లు అందజేస్తుందని, ప్రస్తుతం వెబ్‌సైట్ ద్వారా కొనసాగుతోన్న ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఒక ప్రత్యేక యాప్ ద్వారా మరింత బలోపేతం చేయాలని యోచన జరుగుతోందని తెలిపారు.

ఆచార్య యార్లగడ్డ మాట్లాడుతూ, విదేశాంగమంత్రిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన తొలి నేత అని, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కూడా హిందీలో ప్రసంగించారని గుర్తుచేశారు.అలాగే, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల సమయంలో వివిధ దేశాధినేతలతో హిందీలోనే చర్చలు జరుపుతున్నారని తెలిపారు.ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషలు అధికార భాషలుగా ఉన్నాయని, హిందీని కూడా అధికార భాషగా గుర్తింపు పొందేలా చేయడం అటల్ బిహారీ వాజ్‌పేయి కలగా ఉందని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com