ముస్లింల అభివృద్ధికి కృషి

- March 28, 2025 , by Maagulf
ముస్లింల అభివృద్ధికి కృషి

అమరావతి: రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడటమే కాకుండా ముస్లింలను అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యాన విజయవాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లిం మతపెద్దలతో కలిసి ముందుగా ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి హయాంలోనే ముస్లింలకు మేలు జరిగిందని, ఉర్దూను రెండో భాషగా చేశామని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి మక్కాకు వెళ్లేందుకు హజ్‌ భవనం నిర్మించామని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పి3) విధానం వల్ల రోడ్లు, టెలీ కమ్యూనికేషన్‌, విద్యుత్‌ ప్రాజెక్టులు వంటి వసతులు వచ్చాయని, వీటి ద్వారా కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా, ఇంకా పేదవాళ్లు ఉన్నారని చెప్పారు. మూడు పూటలా సరైన తిండి లేకుండా, పిల్లలకు సరైన చదువు లేకుండా ఆర్థిక అసమానతలతో జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. పేదలతోనే తాను ఉండాలని జీవితాశయంగా ఎంచుకున్నానని వెల్లడించారు. ఆర్థికంగా బాగున్నవారు పేదలకు సాయం చేయడం ఖురాన్‌ మంచి గుణం నేర్పిందన్నారు. అందుకే పి4 విధానం తీసుకొచ్చామన్నారు. నూటికి నూరుశాతం పేదలకు పైకి తీసుకొచ్చేందుకు ఈ నెల 30న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. ముస్లిములలో ఉన్న పేదలను అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. పి4 కార్యక్రమం ద్వారా డబ్బులు ఉండే 10శాతం మంది అట్టడుగున ఉన్న 20శాతం మంది పేదలకు సహకారం అందించేలా ‘మార్గదర్శి బంగారు కుటుంబం’ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌, ఎమ్మెల్యే నజీర్‌, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

బాయ్ కట్‌ చేసిన వక్ఫ్‌ప్రొటెక్షన్‌ జెఎసి

రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్‌ విందును ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ ప్రొటెక్షన్‌ జెఎసి బాయ్ కట్‌ చేసింది. కేంద్రప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్‌ చట్ట సవరణలకు వ్యతిరేకంగా స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఇఫ్తార్‌ విందులు ఇవ్వడాన్ని రాష్ట్రంలోని ముస్లిం ప్రజలు హర్షించరని జెఎసి ఒక ప్రకటనలో తెలిపింది. ఎంఎ చిష్టి (ఆవాజ్‌ ప్రధాన కార్యదర్శి), కెంఎంఎ సుభాన్‌ (వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), సయ్యద్‌ అఫసర్‌ (ఇన్‌సాఫ్‌ కార్యదర్శి), సూఫీ ఇమ్రాన్‌ (నౌ అవర్‌ హిస్టరీ), బాజీ (ముస్లిం ఐక్యవేదిక కార్యదర్శి), సలావుద్దీన్‌, ఎస్‌కె భాషా ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com