వెండితెర క్రాంతి కిరణం...!

- April 06, 2025 , by Maagulf
వెండితెర క్రాంతి కిరణం...!

తెలుగు చిత్రసీమలో దర్శకనిర్మాత క్రాంతికుమార్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. బహుముఖ ప్రజ్ఞాశీలిగా సినీరంగంలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన మహిళా పక్షపాతిగా సాగారు. తాను నిర్మించిన చిత్రాలలోనూ, దర్శకత్వం వహించిన సినిమాల్లోనూ మహిళల సమస్యలకు తగిన పరిష్కారం చూపించడమే కాదు, సమాజాన్నీ ఆలోచింపచేసేవారు. దర్శకకుడిగా మంచి పేరును సంపాదించుకున్న ఆయన నిర్మాతగా సైతం రాణించారు. ఆయన సినిమాల ద్వారా పరిచయమైన ఎందరో నటీనటులు చిత్రసీమలో వెలుగుతూ వస్తున్నారు. నేడు టాలీవుడ్ సినీ దిగ్గజం క్రాంతి కుమార్ మీద ప్రత్యేక కథనం..

 క్రాంతికుమార్ పూర్తిపేరు తలశిల క్రాంతికుమార్. 1942, మే 4న ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరులోని సంపన్న రైతు కుటుంబంలో  జన్మించారు. ఎంఏ మరియు ఎల్.ఎల్.బి పూర్తి చేసిన ఆయన చిన్నతనం నుంచే నాటకాలు, సినిమాలు అంటే ఎంతో మక్కువగా ఉండేవారు. మిత్రులతో కలసి సినిమాలు చూసి, వాటి గురించి చర్చిస్తూ కాలం గడిపేవారు. తరువాత ఆయన మిత్రుడు పి.రాఘవరావు నిర్మించిన ‘శారద’తో చిత్రసీమలో అడుగుపెట్టారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మగువల మానసిక సంఘర్షణను రూపొందించిన తీరు జనాన్ని భలేగా ఆకట్టుకుంది.

క్రాంతికుమార్ నిర్మాణంలో వెలుగు చూసిన “ఊర్వశి, జ్యోతి, కల్పన, ఆమెకథ, ప్రాణం ఖరీదు” వంటి చిత్రాలలోనూ మహిళల పలు విలక్షణమైన సమస్యలకు తెరతీశారు. అయితే అవేవీ క్రాంతి కుమార్ కు అంతగా కాసులు తీసుకురాలేదు. ఎన్టీఆర్ హీరోగా దాసరి దర్శకత్వంలో క్రాంతికుమార్ నిర్మించిన ‘సర్దార్ పాపారాయుడు’ అఖండ విజయం సాధించింది. నిర్మాతగా క్రాంతికుమార్ కెరీర్ లో మళ్ళీ అలాంటి సినిమా రాలేదనే చెప్పాలి. తరువాత ఆయన నిర్మించిన ‘న్యాయం కావాలి’లోనూ మగవాడి మోసానికి బలై పోయిన మగువ చేసిన పోరాటాన్ని ప్రధానాంశంగా చూపించారు. ఈ చిత్రంతోనే రాధిక తెలుగు తెరకు పరిచయం కాగా, చిరంజీవికి నటునిగా ఈ సినిమా మంచి గుర్తింపు సంపాదించిపెట్టింది.

చిరంజీవితో క్రాంతి కుమార్ “మోసగాడు, కిరాయిరౌడీలు, ఇది పెళ్ళంటారా,శివుడు శివుడు శివుడు, అగ్నిగుండం, రిక్షావోడు” వంటి చిత్రాలను నిర్మించారు. నిర్మాతగా ఇతరుల దర్శకత్వంలో పలు చిత్రాలు తీసిన క్రాంతికుమార్ ‘స్వాతి’ చిత్రంతో దర్శకుడయ్యారు. ఇక్కడా స్త్రీపక్షపాతిగానే సాగారు. ఇందులో పెళ్ళీడుకు వచ్చిన కూతురు, భర్తలేని తన తల్లికి మరో పెళ్ళి చేయడం ప్రధానాంశం. మరి ముఖ్యంగా 1984లో ఈ అంశాన్ని ఎంచుకోని సినిమా తీయడం చాలా సాహసం. అయితే ‘స్వాతి’ చిత్రాన్ని మహిళలు విశేషంగా ఆదరించారు. ‘స్వాతి’ చిత్రం క్రాంతికుమార్ ను దర్శకునిగా నిలిపింది. ఆ యేటి మేటి చిత్రాల్లో ఒకటిగా నిలచింది. తరువాత ఈ సినిమాను హిందీలోనూ అదే పేరుతో క్రాంతికుమార్ దర్శకత్వంలోనే పునర్నిర్మించారు.

క్రాంతి దర్శకత్వంలో రూపొందిన ‘స్రవంతి’ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ రెండు చిత్రాలకు రాష్ట్ర, కేంద్రప్రభుత్వ అవార్డులు లభించడం విశేషం. చిరంజీవి హీరోగా ‘అగ్నిగుండం’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ‘అరణ్యకాండ, నేటి సిద్ధార్థ” తెరకెక్కించారు. ఇవేవీ జనాన్ని ఆకట్టుకోలేక పోయాయి. తరువాత రాజశేఖర్ తో తీసిన ‘అక్కమొగుడు’ ఆదరణ పొందింది. “అమ్మకొడుకు, భలే పెళ్ళాం, సరిగమలు, పాడుతా తీయగా, అరుంధతి, 9 నెలలు”వంటి చిత్రాలు కూడా క్రాంతి కుమార్ దర్శకత్వంలో వెలుగు చూశాయి. కానీ, ఇవేవీ కమర్షియల్‌గా అంత విజయాన్ని చవిచూడలేదు.

ఏయన్నార్ ప్రధాన పాత్రధారిగా క్రాంతి కుమార్ దర్శకత్వంలో వి.ఎమ్.సి. దొరస్వామి రాజు నిర్మించిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ మంచి విజయాన్ని చవిచూసింది. ‘స్వాతి’ తరువాత క్రాంతి కుమార్ దర్శకత్వంలో అంత పెద్దవిజయాన్ని చూసింది ‘ సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రమే! కృత్రిమ గర్భధారణ, సరోగసీ మాతృత్వంపై ‘9 నెలలు’ చిత్రం తెరకెక్కించారు. సౌందర్య, విక్రమ్ జంటగా నటించిన ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

స్త్రీకీ ఓ మనసుందని, శరీరం ఉందని వాటిని గౌరవించాలని చలం రచనలు చాటుతూ ఉంటాయి. స్త్రీ పక్షపాతిగా సాగిన చలం ఆ రోజుల్లో ఎందరో మహిళలు బయటకు చెప్పుకోలేకపోయినా, వారి అభిమాన రచయిత! అదే తీరున తాను నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాలలో స్త్రీ సమస్యలను ఇతివృత్తాలుగా ఎంచుకున్నారు దర్శకనిర్మాత టి.క్రాంతికుమార్. అందువల్లే క్రాంతికుమార్ ను ‘వెండితెర చలం’ అని పిలుస్తారు. నిర్మాతగా ఆయన తొలి చిత్రం ‘శారద’లోనూ, దర్శకునిగా చివరి చిత్రం ‘9 నెలలు’లోనూ మహిళల సమస్యలను ఆవిష్కరించి స్త్రీ పక్షపాతిగానే నిలిచారు. తాను నిర్మించిన కమర్షియల్ మూవీస్ లోనూ మహిళల సమస్యలను అంతో ఇంతో చర్చించడానికే తపించేవారు.

చలం పుస్తకం అనగానే చాలామంది పాఠకులు ఆయన రాసిన ‘మైదానం’ పేరు చెబుతూ ఉంటారు. కానీ, క్రాంతి కుమార్ కు చలం రాసిన ‘మ్యూజింగ్స్’ అంటే వల్లమాలిన ఇష్టం. ఆ పుస్తకాన్ని పదే పదే చదివేవాడినని క్రాంతి కుమార్ గారు పదే పదే చెప్పేవారు. చలం గారి కథల్లో ‘స్త్రీలు- ఆర్థిక పరిస్థితులు’ అన్న అంశాలు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అదే తీరున సినిమాల్లోనూ స్త్రీలకు ఆర్థిక  స్వేచ్ఛ ఉంటే వారి భావాలు సైతం ఉన్నతంగా సాగుతాయని చూపించారు. ఆయన తీసిన  “శారద, ఊర్వశి, జ్యోతి, ఆమెకథ, కల్పన, ప్రాణం ఖరీదు, న్యాయం కావాలి” పలు  చిత్రాలను చూస్తే ఆయన స్త్రీ పక్షపాతం ఎలాంటిదో ఇట్టే అర్థమై పోతుంది. ఏది ఏమైనా తన చిత్రాలలో స్త్రీమూర్తుల పక్షాన నిలచి, వారి మనసు గెలిచిన క్రాంతి కుమార్ గారు 2003, మే 9న కన్నుమూశారు.    

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)         

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com