కువైట్ దేశంలో భిక్షాటన చేస్తున్న ధనవంతుడి అరెస్ట్

- July 12, 2015 , by Maagulf
కువైట్ దేశంలో భిక్షాటన చేస్తున్న ధనవంతుడి అరెస్ట్

ఆయనకు కావాల్సినంత డబ్బుంది.. అందుకు తగ్గట్టే కొంచెం తిక్క కూడా ఉంది. ఆ తిక్క చేష్టలే ఇప్పుడాయన్ని కటకటాలపాలు చేశాయి. బ్యాంక్ అకౌంట్ లో కోటానుకోట్ల నగదు ఉంచుకుని కూడా బిచ్చమెత్తుకుంటూ పోలీసులకు దొరికిపోయిన ఆ వ్యక్తి సంగతేంటో చూద్దాం.. ఆదివారం సాయంత్రం.. ముస్లింలు ఉపవాసాలు విడిచే సమయం.. కువైట్ నగరంలో పేరుమోసిన మసీదు వద్ద.. కొద్దిగా చిరిగిన బట్టలతో ఓ వ్యక్తి నించున్నాడు. 'ధర్మం చెయ్యండి బాబయ్యా..' అంటూ తనదైన భాషలో నమాజ్ కు వెళ్లొస్తున్నవారందరినీ అర్ధిస్తున్నాడు. ఇది గమనించిన పోలీసులు ఒక్క ఉదుటన అక్కడికి చేరుకుని అతణ్ని అరెస్టు చేశారు. కువైట్ దేశంలో భిక్షాటన నిశేధం. ఒక్క కువైటే కాదు గల్ఫ్ కో- ఆపరేషన్ కౌన్సిల్ లోని బెహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ, యూఏఈ వంటి దేశాల్లోనూ అడుక్కోవడం చట్టవ్యతిరేకం. అలా అతడ్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తర్వాత అసలు కథ మొదలైంది. సదరు వ్యక్తి పేరు, చిరునామా ఇతర వివరాలు తెలుసుకున్న పోలీసులు.. పనిలోపనిగా అతడి బ్యాంకు ఖాతా వివరాలనూ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఆ విదేశీ బిక్షగాడి అకౌంట్ లో ఐదువేల కువైట్ దినార్లు (మన కరెన్సీలో దాదాపు 10 కోట్లు) ఉన్నాయి. ఇంత డబ్బూ పెట్టుకుని ఎందుకురా అడుక్కుంటున్నావ్? అని పోలీసులు అడిగితే.. 'దానం తీసుకుంటే పుణ్యం దక్కుతుందిగా' అంటూ తలతిక్క సమాధానాలు చెప్పాడు. దీంతో అతనిపై మరింత బలమైన కేసులు మోపేందుకు సిద్ధమవుతున్నారు కువైట్ పోలీసులు. ఆసియా సహా ఇతర ప్రాంతాల నుంచి వెళ్లి కువైట్ లో భిక్షాటన చేస్తోన్న 22 మందిని ఆ దేశం గత ఏప్రిల్ లో వెనక్కి వెళ్లగొట్టడం గమనార్హం.

 

--(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com