అక్షయ తృతీయ...!
- April 30, 2025
హిందూ పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడో రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. అక్షయ అనే పదం నుంచి అక్షయ తృతీయ అనే పదం ఉద్భవించింది. 'ఎన్నటికీ తరిగిపోనిది' అని అర్థం . శుక్ల పక్షంలో తృతీయ రోజున వస్తుంది కాబట్టి తృతీయ. ఈ పండుగ నాడు బంగారం కొంటే భవిష్యత్తులో సంపద, శ్రేయస్సు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఇంకా కొత్త వ్యాపారం, గృహ ప్రవేశం, వివాహం వంటి శుభకార్యాలు, దాతృత్వ కార్యాలూ చేస్తే శుభఫలితాలు దక్కుతాయని అంటారు. నేడు అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక కథనం...
అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే "లక్ష్మీ కుబేర" పూజ చేస్తే ఏడాది మొత్తం శుభ ఫలితాలు కలుగుతాయని పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకం. ముందుగా ఇల్లు మరియు పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత త్వరగా స్నానమాచరించి పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాలి. పూజా మందిరంలో శుభ్రంగా కడిగిన ఒక పీటను ఏర్పాటు చేసుకొని దానిపై బియ్యప్పిండితో ముగ్గు వేసుకోవాలి. ఆ పీట మీద లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత చిత్రపటం దగ్గర ఒక పళ్లెంలో కొన్ని రూపాయి నాణేలు(చిల్లర డబ్బులు) ఉంచాలి.అనంతరం చిత్రపటం ముందుభాగంలో పీట మీద అరటి ఆకును ఏర్పాటు చేసుకోవాలి.
ఆపై పీటకు కుడివైపు చివర భాగంలో అరటి ఆకుపై కొన్ని నవధాన్యాలు పోసి వాటిపై ఒక రాగి చెంబును ఉంచి, అందులో నీళ్లు పోసి కొద్దిగా పసుపు వేసి కలపాలి.ఆ తర్వాత కొన్ని మామిడి ఆకులను తీసుకొని రాగి చెంబులో ఉన్న నీళ్ల మీద ఉంచాలి. అనంతరం ఆ మామిడి ఆకుల మధ్యన పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచాలి. అంటే, చిత్రపటం దగ్గర కలశం ఏర్పాటు చేసుకోవాలి. తదుపరి ఆ కలశం పక్కనే ఒక తమలపాకును ఉంచి దానిపై పసుపుతో చేసిన హరిద్రా గణపతిని ఉంచాలి. ఆ గణపతికి అక్షింతలతో పూజ చేస్తూ గణపతి షోడశ నామాలు(16 నామాలు) చదువుకోవాలి. షోడశ నామాలు చదువుతూ పసుపు గణపతికి పూజ చేశాక హారతి ఇవ్వాలి.
హారతి అనంతరం కలశం పక్కన ఉన్న లక్ష్మీ కుబేర చిత్రపటానికి పసుపు రంగు పూలతో పూజ చేస్తూ ఈ మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఆ మంత్రం ఏమిటంటే, "ఓం ధనధ సౌభాగ్య లక్ష్మి కుబేర వైశ్రవనాయ మమ కార్య సిద్ధిం కురు స్వాహ". ఈ మంత్రాన్ని 21 సార్లు చదివాక లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం నలుగురైదుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన పండ్లతో పాటు పసుపు, కుంకుమ, అరటి పండు, పూలు, జాకెట్ ముక్క ఉంచి తాంబూల వాయినం ఇవ్వాలి. దీన్నే"అక్షయ తృతీయ" నాడు నిర్వహించే "లక్ష్మీ కుబేర పూజ" అనే పేరుతో పిలుస్తారు.
అక్షయ తృతీయ రోజు పూజా మందిరంలో కుబేర ముగ్గు వేసి పూజ చేయడం ద్వారా లక్ష్మీ కుబేరుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందంటున్నారు జ్యోతిష్యులు. ఈ కుబేర ముగ్గు ముగ్గు ఎలా వేయాలో ఇక్కడ చూడండి. లక్ష్మీ కుబేర పూజ చేసే ప్రాంతంలోనే ఒక చిన్న పీట ఏర్పాటు చేసి దానిపై బియ్యప్పిండితో ఒక పెద్ద చతురస్రం గీయాలి. ఆపై ఆ పెద్ద చతురస్రంలో బియ్యప్పిండితో తొమ్మిది చిన్న చిన్న చతురస్రాలను గీసుకోవాలి.
తర్వాత ఆ తొమ్మిది చతురస్రాలలో తడి కుంకుమతో అడ్డంగా ప్రత్యేకమైన సంఖ్యలను రాయాలి. అంటే, పైన మూడు చతురస్రాలలో వరుసగా 27, 20, 25 అని, మధ్య చతురస్రాలలో 22, 24, 26 అని, అడుగున ఉన్న మూడింటిలో వరుసగా 23, 28, 21 అని రాయాలి. ఇలా రాసిన తర్వాత ఆ తొమ్మిది సంఖ్యల మీద 9 రూపాయి నాణేలు ఉంచాలి. ఆపై ఒక్కో నాణెం వద్ద ఒక్కొక్క ఎర్రటి పుష్పం పెట్టాలి. దీన్నే "కుబేర ముగ్గు" అంటారు.
అనంతరం అక్కడ ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి "ఓం సమ్ కుబేరాయ నమః" అని 21 సార్లు చదువుకోవాలి. ఇలా చేస్తే కూడా లక్ష్మీ కుబేరుల అనుగ్రహం సంవత్సరం మొత్తం పొందవచ్చంటున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఇలా లక్ష్మీ కుబేర పూజ నిర్వహించడం, కుబేర ముగ్గు విధివిధానాన్ని పాటించడం ద్వారా ఏడాది మొత్తం సమస్త శుభాలను సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు
అక్షయ తృతీయ నాడు బంగారం లేదా వెండి కొనడం అనేది సంప్రదాయంగా వస్తుంది. బంగారం ...సంపద శ్రేయస్సును సూచిస్తుంది. వెండి స్వచ్ఛత, ఆశీర్వాదాలను సూచిస్తుంది. వీటిపై ఆరోజు పెట్టుబడి పెట్టడం వలన ఆభరణాలు, నాణేలు లేదా అంతులేని సంపద లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున కారు లేదా ద్విచక్ర వాహనం కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది వ్యక్తిగత ఆర్థిక వృద్ధికి సంకేతంగా పరిగణించబడుతుంది. కొన్ని కంపెనీలు అక్షయ తృతీయ రోజున డిస్కౌంట్లను కూడాప్రకటిస్తాయి. భూమిపై పెట్టుబడి పెట్టడానికి అనువైన రోజుగా భావిస్తారు. ఈ రోజు కొన్న ఆస్తి అభివృద్ది చెందుతుందని పురాణాలు చెబుతున్నాయి.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!