సామాజిక సంస్కరణ తాత్వికవేత్త-మహాత్మా బసవేశ్వరుడు
- April 30, 2025
భారతదేశ చరిత్రలో మానవ కల్యాణం కోసం స్వతంత్ర సమాలోచనలు చేసిన మొదటి వ్యక్తి, మూఢాచారాలను ధిక్కరించిన ధీరుడు, అనుభవ మంటపం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన మార్గదర్శకుడు. ‘దేహమే దేవాలయం,‘ ‘చేసే పనే దైవం‘ వంటి సందేశాలతో మానవతా విలువలను ప్రపంచానికి ప్రసాదించారు. కుల, మత, లింగ, వర్గ భేదాలతో కూడిన సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా గళమెత్తిన సమతామూర్తి మహాత్మా బసవేశ్వరుడు. నేడు బసవ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
సమసమాజం శోషణకు గురై సామాజిక వ్యవస్థ బూజుపట్టి, అస్పృశ్యత, జాతి–వర్గ–వర్ణ విభేదాలు, యజ్ఞ యాగాలు, హోమాలు, నరబలి, స్త్రీ–శిశు హత్యలు, బాల్యవివాహాలు, సతీసహగమనం మొదలైన మూఢాచారాలు తాండవిస్తున్న తరుణంలో బసవేశ్వరుడు అనే క్రాంతి పురుషుడు జన్మించారు. క్రీస్తుశకం 1134లో ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బాగేవాడి గ్రామంలో మాదిరాజు, మాదాంబిక దంపతులకు జన్మించారు.
బాల్యం నుంచి మూఢాచారాలను వ్యతిరేకించిన బసవేశ్వరుడు ఎనిమిదవ యేట తండ్రి ఉపనయనం చేయడానికి సిద్ధపడగా, తండ్రి మాటను తిరస్కరించి తన అక్క నాగాంబిక వద్దకు చేరుకున్నారు. అక్కడే గురుకులంలో వేద శాస్త్ర పురాణాలన్నీ అధ్యయనం చేసి దినదిన ప్రవర్ధమానమై ఎదిగిన బసవేశ్వరుడు, బుద్ధిశాలిగా, సాహిత్య, వేద, పురాణ, ఆగమ, సంగీత, గణిత విద్యలన్నింటిలో ప్రావీణుడై పండిత పూర్ణ వ్యక్తిత్వాన్ని సంపాదించారు. ఈ సమయంలోనే దోషరహితమైన ధార్మిక వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.
విద్యాభ్యాసం అనంతరం బిజ్జల చక్రవర్తి దండ నాయకుడైన తన మేనమామ బలదేవర కూతురును వివాహమాడి, స్వయం ఆర్జనతో జీవించే తలంపుతో బిజ్జలుని కొలువులో చేరారు. అపార మేధాసంపన్నుడైన బసవేశ్వరుని నీతి, నిబద్ధత, సమాజసేవను గుర్తించిన బిజ్జల రాజు తన రాజ్యానికి ప్రధానమంత్రిగా ఆయనను నియమించాడు. అనతి కాలంలోనే బసవేశ్వరుడు ఆ రాజ్యంలో నూతన సామాజిక, ధార్మిక సంస్కరణలకు ప్రవేశపెట్టారు. వీటి ప్రచారానికి మంటపాలను నిర్మించి, వాటికి అనుభవ మండపం అని నామకరణం చేశారు. ఈ మండపంలో జాతి, కుల, మత, వర్గ, వర్ణ, లింగ భేదాలకు అతీతంగా స్త్రీ–పురుషులకు సమాన అవకాశాలు కల్పించారు.
మహిళలకు అక్షరాభ్యాసం చేయించి, వేద శాస్త్రాలు నేర్పి, వారికి తన అనుభవ మంటపంలో స్థానం కల్పించారు. ఈ అనుభవ మండపం నేటి మన పార్లమెంట్ వ్యవస్థతో సమానమైంది, అందుకే బసవేశ్వరుడి అనుభవ మండపాన్ని మన దేశ మొదటి పార్లమెంటుగా గుర్తించవచ్చు. ‘ప్రతి మనిషి ఒక ఓటు‘ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు. మహిళలు వేదాలు బోధించి, నిర్ణయ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. ఇష్టలింగ ధారణ ద్వారా ఆధ్యాత్మిక సమానత్వాన్ని నెలకొల్పారు. అస్పృశ్యతను సవాలు చేసిన ఈ వేదిక నేటి పార్లమెంట్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆనాడు బసవేశ్వరుడు అంకురార్పణ చేసిన మహిళల సమాన హక్కులు, నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుండడం, భారత ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్ కల్పించడం ఇప్పటికీ స్ఫూర్తినిస్తున్నాయి.
బసవన్న స్థాపించిన లింగాయత ధర్మం సమానత్వం, న్యాయానికి ప్రతీక. ‘శ్రమే పూజ, కాయకమే కైలాసం‘ సిద్ధాంతంతో బాల్య వివాహాలు, సతీసహగమనం, నరబలి, పశుబలి వంటి మూఢాచారాలను నిర్మూలించారు. ఇష్టలింగ ధారణ ద్వారా ప్రతి భక్తుని స్వాతంత్య్రాన్ని, కులాంతర వివాహాలను, దళితుల ఆలయ ప్రవేశాన్ని ప్రోత్సహించారు. ‘పుట్టుకతో కాదు, కర్మతో గొప్పతనం‘ అంటూసమానత్వాన్ని బలపరిచారు. నిరాకార శివుడే సర్వేశ్వరుడని, శివతత్వ ప్రచారంతో లింగాయత ధర్మానికి బీజం వేశారు. శాఖాహారాన్ని స్వీకరించి, సహజ శివయోగాన్ని ప్రసరింపజేశారు.
బసవేశ్వరుడు 64 లక్షలకు పైగా వచనాలు రాసినప్పటికీ, కొన్ని వేలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ‘కాయకమే కైలాసం‘, ‘జ్ఞానమే గురువు‘ వంటి వచనాలు కుల వ్యవస్థను ఛేదించి, ప్రేమ, సమానత్వం, న్యాయ విలువలను వ్యాప్తి చేశాయి. ఈ వచనాలు మానవతా మార్గాన్ని చూపాయి, సమాజాన్ని సరిదిద్దాయి, ధర్మం అంటే నిజాయితీ అని బోధించాయి. సమాజంలో పేరుకుపోయిన వైదిక, సనాతన, మూఢాచారాలను బసవేశ్వరుడు తన రచనల ద్వారా ఖండించారు.
బిజ్జల రాజ్యంలో సాంఘిక సంస్కరణలు అమల్లో భాగంగా వర్ణాంతర వివాహాలు చేయడంతో కొందరు ఆయనని తీవ్రంగా వ్యతిరేకించారు. బసవేశ్వరుని నూతన సంవిధానం కొందరికి కంటగింపుగా మారడంతో వారంతా ఏకమై ఆయనను బిజ్జల రాజు చేత దేశ బహిష్కరణ గావించారు. అక్కడి నుంచి కూడల సంగమం చేరుకొని, అక్కడే 1196లో పరమాత్మ సన్నిధికి చేరుకున్నారు. నేడు ఆ కూడల సంగమం వీరశైవ లింగాయతుల పవిత్ర క్షేత్రంగా బాసిల్లుతున్నది.
మహాత్మా బసవేశ్వరుల గొప్పతనాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం పార్లమెంటు ప్రాంగణంలో బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 2006లో ఐదు రూపాయలు, 100 రూపాయల నాణాలను బసవేశ్వరుని బొమ్మతో ముద్రించి, ఆ మహాత్ముని స్మరించుకుంది. తెలంగాణ వాసి డాక్టర్ నీరజాపాటిల్ ఎంతో కృషి చేసి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా లండన్‌లో బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుని జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. ట్యాంక్ బండ్‌పై ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే గాక, బసవేశ్వర చరిత్రను పాఠ్యాంశంగా చేర్పించి, నేటి పౌరులకు ఆ మహాత్ముని గొప్పతనాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నది.
సమాజంలో ఉన్న వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి, సామాజిక, ధార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టిన బసవన్న చూపిన మార్గం కేవలం "భక్తి మార్గం కాదు, అది సమాజానికి మార్పు తీసుకు రాబోయే మార్గం". నేటి సమాజంలో ప్రేమ, సమానత్వం, మానవ హక్కుల పరి రక్షణ కోసం, కుల, మత, లింగ వివక్షను తొలగించి బసవేశ్వరుని ఆశయాల సాధన నిర్మాణానికి ప్రతి ఒక్కరం కృషి చేయాలి.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!