సినిమా రివ్యూ: ‘రెట్రో’.!

- May 01, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘రెట్రో’.!

సూర్య, పూజా హెగ్దే కాంబినేషన్‌లో కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన సినిమానే ‘రెట్రో’. ‘పేట’, ‘జిగర్తాండ ట్రిపుల్ ఎక్స్’ తదితర సినిమాల్ని తెరకెక్కించిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో ఒకింత అంచనాలు నెలకొన్నాయ్. అయితే, ప్రచార చిత్రాలతో ఏమంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. ఒకింత కన్‌ఫ్యూజనే క్రియేట్ చేశారు. మరి, సినిమా చూశాకా ఆ కన్‌ప్యూజన్‌కి ఓ దారి దొరికిందా.? అంటే అసలు ‘రెట్రో’ సినిమా కథేంటో తెలుసుకోవల్సిందే.!

కథ: గట్టిగా చెప్పాలంటే ఇదో  గ్యాంగ్‌స్టర్ కథ. గతంలో ఈ తరహా కాన్సెప్టులు చాలానే చూసేశాం. అనగనగా ఓ గ్యాంగ్‌స్టర్.. ప్రేమించిన అమ్మాయ్ కోసం హింసకు దూరమై ప్రశాంతమైన జీవితం గడుపుతున్న తనకు అనుకోకి కారణాలతో ఆ హింస వైపు మళ్లీ వెళ్లాల్సి రావడం ఆ క్రమంలో అతడు ఎదుర్కొనే పరిస్థితుల సారాంశమే ఈ కధాంశం.

పారి అలియాస్ పార్వేల్ కన్నన్ (సూర్య) చిన్నతనంలోనే తల్లితండ్రిని కోల్పోయి అనాధగా బతుకుతాడు. తన భార్య కోసం ఇష్టం లేకపోయినా తిలక్ అనే ఓ గ్యాంగ్ ‌స్టర్ పారిని దత్తత తీసుకుంటాడు. ఒకానొక సందర్భంలో శత్రువుల నుంచి కాపాడడంతో అప్పటి నుంచీ తన సొంత కొడుకులాగే ప్రేమ పెంచుకుంటాడు తిలక్, పారిపై. అలా తిలక్ వారసుడిగా పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు పారి. రుక్మిణి (పూజా హెగ్ధే)ని తొలి చూపులోనే ప్రేమించి పెళ్లాడతాడు పారి. హింస అంటే ఇష్టం లేని రుక్మిణి, పారిని వాటన్నింటికీ దూరంగా తీసుకెళ్లిపోతుంది. కానీ, గతం వెంటాడుతూనే వుంటుంది పారిని. అలా ఓ సారి అనుకోని పరిస్థితుల్లో జైలుకెళ్లాల్సి వస్తుంది. అదే సమయంలో రుక్మిణి మిస్సవుతుంది. జైలు నుంచి విడుదలై తన భార్య జాడ కోసం వెతుకుతున్న పారి, తిలక్‌కి శత్రువుగా ఎందుకు మారాల్సి వచ్చింది.? వద్దనుకున్న హింసాత్మక జీవితంలోకి ఎందుకు మళ్లీ వెళ్లాల్సి వచ్చింది.? ఆ ఐలండ్‌లోని జడల ముని గుడికీ, అక్కడి ఓ రకమైన తెగకీ, పారికీ వున్న సంబంధం ఏంటీ.? రుక్మిణిని తిరిగి దక్కించుకున్నాడా.? ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవల్సి వచ్చింది పారి.? ఇవన్నీ తెలియాలంటే ‘రెట్రో సినిమా ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
సూర్య అంటే కేవలం తమిళ హీరో మాత్రమే కాదు.. తెలుగు హీరో కూడా.. అనేంతలా తన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో  ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. సూర్య గత చిత్రాలు కూడా తెలుగులో మంచి ఆదరణే దక్కించుకున్నాయ్. ముఖ్యంగా ఈ మధ్య సూర్య విభిన్నతరహా చిత్రాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. గతంలో వచ్చిన ‘కంగువ’ మూవీ అదే తరహాకి చెందింది. ఇప్పుడు ‘రెట్రో’ కూడా. టైటిల్‌కి తగ్గట్లుగానే అనేక రకాల రెట్రో లుక్స్‌లో కనిపించి మెప్పించాడు సూర్య. గ్యాంగ్‌స్టర్‌గా, ఐలాండ్‌లో లాపింగ్ డాక్టర్ చాప్లిన్‌గా తనదైన శైలిలో పర్‌ఫామెన్స్ ఇచ్చాడు. రుక్మిణి పాత్రలో పూజా హెగ్ధే డీ గ్లామర్ రోల్‌లో కనిపించింది. పాత్ర పరంగా తన వరకూ న్యాయం చేసింది కానీ, లుక్స్ పరంగా కాస్త ఎబ్బెట్టుగా కనిపించిందన్న అభిప్రాయాలు ఆమె అభిమానుల నుంచి వినిపిస్తున్నాయ్. సీనియర్ నటుడు జోజూ జార్జ్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. 

సాంకేతిక వర్గం పనితీరు:
కార్తీక్ సుబ్బరాజ్ సినిమాల్లో యాక్షన్‌తో పాటూ, ఓ అణచివేతకు గురైన వర్గానికి సంబంధించిన కథ నిగూఢంగా దాగి వుంటుంది. ఆ తెగను కాపాడే నాయకుడిగా హీరో క్యారెక్టర్‌ని డిజైన్ చేస్తుంటాడు. ఈ సినిమాలోనూ సూర్య పాత్ర అలాగే వుంటుంది. గ్యాంగ్‌స్టర్‌గా పరిచయం చేసినప్పటికీ సెకండాఫ్‌లో సినిమా వేరే టర్న్ తీసుకుంటుంది. ఐలాండ్‌ని పాలించే ఓ రాజు.. అక్కడి ప్రజలను చిత్ర హింసలకు గురి చేస్తుంటాడు. ఆ ప్రజలకూ, సూర్యకీ వున్న గతం.. అలా ముడి పడిన గతంతో అక్కడి ప్రజల్ని కాపాడేందుకు ఆ శక్తివంతమైన రాజుతో సూర్య చేసే యుద్ధం.. ఆకట్టుకుంటాయ్. అయితే, కథ, కథనంలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం.. తర్వాత ఏం జరుగుతుంది.? అనేది ఊహకు అందేలా అనిపించడం.. అచ్చంగా అదే తెరపై జరుగుతుండడం.. మింగుడు పడదు. తాను అనుకున్న కథని ప్రేక్షకుడికి కన్విన్సింగ్‌గా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ బాగా తడబడ్డాడనిపిస్తుంది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ జస్ట్ ఓకే. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదనిపిస్తుంది. టైటిల్‌కి తగ్గట్టుగా 1960 - 1983 మధ్య కాలాన్ని మ్యాచ్ చేయడంలో సినిమాటోగ్రఫీ బాగుంది. టైమ్ లెంగ్త్ చాలా మైనస్ ఈ సినిమాకి. సాగతీతలా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఓకే.

ప్లస్ పాయింట్స్: 
సూర్య నటన, అక్కడక్కడా కొన్ని యాక్షన్ ఘట్టాలు..

మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ, బోరింగ్ అండ్ కన్‌ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లే.. నిడివి.. 

ఫైనల్‌గా:
‘రెట్రో’ పరమ రొటీన్ రొట్ట కొట్టుడు యవ్వారమ్.! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com