ఏపీ: రక్షణ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

- May 07, 2025 , by Maagulf
ఏపీ: రక్షణ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్ర‌మూక‌ల‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలు, పౌర రక్షణ కార్యకలాపాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు రాజధాని అమరావతిలో సమీక్ష నిర్వహించారు.

సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, వివిధ శాఖల అధికారులతో పాటు… నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, టూరిజం, ఎండోమెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, హెల్త్, ఆర్ అండ్ బీ సహా వివిధ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, సంసిద్ధతపై సమావేశంలో చర్చించారు. మాక్ డ్రిల్స్ నిర్వహించడం, పరిస్థితి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం గురించి కూడా సమావేశంలో చర్చించారు. ఊహించని ఘటనలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలను అప్రమత్తం చేయడం వంటి అంశాలపై సమావేశంలో సమీక్షించారు.

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కృష్ణా జిల్లా తీరప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై యుద్ధం జరిగే అవకాశం ఉండటంతో… కేంద్రం విశాఖపట్నం, హైదరాబాద్‌లను కేటగిరీ 2లో చేర్చింది. ఈ సమయంలో, తీరప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు.

సముద్ర మార్గం గుండా ఉగ్రవాదులు జిల్లాలోకి రాకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. జిల్లాలో 110.కి.లో మీటర్ల సముద్ర తీరం ఉండగా.. జిల్లా పరిధిలో 3 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. పాలకాయతిప్ప(కోడూరు మండలం), గిలకలదిండి(మచిలీపట్నం మండలం), ఒర్లగొందితిప్ప(కృత్తివెన్ను మండలం) మెరైన్ పీఎస్ పరిధిలో 150 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సముద్ర తీర గ్రామంలో మెరైన్ పోలీసులతో పాటు రెండు డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నారు. తీర గ్రామాల ప్రజలను సైతం మెరైన్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com