ఆదర్శ నేత-భాట్టం శ్రీరామమూర్తి
- May 12, 2025
భాట్టం శ్రీరామమూర్తి...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించిన పేరు. సోషలిస్టుగా మొదలై, కాంగ్రెస్ వాదిగా పరిణితి చెంది తెలుగుదేశం నాయకుడిగా రాజకీయ విరమణ తీసుకున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన ఉద్దండనేతగా భాట్టం వెలుగొందారు. పి.వి నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. విశాఖ ఉక్కు మరియు జైఆంధ్ర ఉద్యమాల్లో కీలకమైన పాత్ర పోషించిన నాయకుల్లో వీరు ఒకరు. నేడు ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం భాట్టం శ్రీరామమూర్తి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
భాట్టం శ్రీరామమూర్తి 1926, మే 12న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని విజయనగరం జమీందారీ కింద ఉన్న ధర్మవరం అనే కుగ్రామంలో భాట్టం సన్నయ్య పంతులు, తరుణమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే చదువుల్లో చురుగ్గా రాణిస్తూ విజయనగరం గజపతి రాజులు ఇచ్చే ఉపకారవేతనంతో పై చదువులు చదివారు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తి చేసిన తర్వాత విజయనగరం చేరుకొని అక్కడే హై స్కూల్, ఇంటర్ మరియు డిగ్రీ మరియు లాను పూర్తి చేశారు.
భాట్టం వారు విద్యార్ధి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ తరపున విజయనగరం మహారాజా కళాశాలలో చదువుతున్న రోజుల్లో కాలేజీ విద్యార్ధి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ 196-47 మధ్యలో కాలేజీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలోనే అప్పటి విజయనగరం జమీందారు మహారాజా పూసపాటి విజయరామ గజపతిరాజు (పి.వి.జి.రాజు) గారితో ఏర్పడ్డ పరిచయం ఆయన్ని పూర్తి స్థాయిలో రాజకీయాల్లో క్రియాశీలకం అవుతూ వచ్చారు.
పి.వి.జి.రాజు మద్రాస్ స్టేట్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న సమయంలో భాట్టం వారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సోషలిస్టు పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షణ చేసేవారు. మెంటే పద్మనాభం, తుమ్మల చౌదరి, ఐనంపూడి చక్రధర్, బండారు రత్నసభాపతి వంటి పలువురు సోషలిస్టు నేతలతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. ఉమ్మడి సోషలిస్టు పార్టీలో చీలిక వచ్చిన సమయంలో లోహియా గారి నాయకత్వంలోని సోషలిస్టు పార్టీ వైపు పి.వి.జి.రాజు గారితో కలిసి నిలిచారు. 1955లో లోహియా సోషలిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై 1960 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1960లో మహారాజుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి 1982 వరకు పార్టీని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా ఒకప్పటి సోషలిస్టు పట్టున్న ప్రాంతాల్లో బలోపేతం చేయడంలో తనవంతు పాత్ర పోషించారు. 60వ దశకం మధ్యలో భాట్టం ఏ.ఐ.సి.సి సభ్యుడిగా నియమితుడై దాదాపు 16 ఏళ్ళ పాటు కొనసాగారు. 1967-68 మధ్యలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, ఇదే సమయంలో వచ్చిన విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమంలో సైతం పాల్గొన్నారు. 1957,1962లలో విజయనగరం, 1972,78లలో పరవాడ అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి ప్రాతినిధ్యం వహించారు.
1972లో పి.వి మంత్రివర్గంలో విద్య, సాంస్కృతిక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దీ నెలలకే జైఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో భాగమయ్యారు. పి.వి తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన జలగం మంత్రివర్గంలో 1974-78 వరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1978-81 వరకు మర్రి, అంజయ్య మంత్రివర్గాల్లో సోషల్ వెల్ఫేర్, యువజన సర్వీసులు, ఆర్కియాలజీ, ఎండోమెంట్స్ శాఖలను నిర్వర్తించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భాట్టం వ్యక్తిత్వం నచ్చిన నాటి టీడీపీ అధ్యక్షుడు ఎన్టీఆర్, ఆయన్ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. 1984లో టీడీపీ టిక్కెట్టు మీద వీరు, విశాఖ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టారు. ఎంపీగా రాష్ట్రానికి కావాల్సిన పలు ప్రాజెక్ట్స్ క్లియరెన్స్ లు త్వరతగతిన రావడంలో కీలకంగా వ్యవహరించారు. 1989లో క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలిగారు.
భాట్టం వారు గొప్ప పరిపాలనా దక్షుడిగా కీర్తి గడించారు. సాంఘిక సంక్షేమ మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా బడుగు, బలహీన వర్గాల బాలుర వసతి గృహాలు ఏర్పాటు చేయించారు. వారికి అందాల్సిన ఉపకారవేతనాలు, వివిధ సౌకర్యాలు ఠంచనుగా అందేలా ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టారు. అలా ఏ పదవి చేపట్టినా దానికి తగిన న్యాయం చేయడానికి నిరంతరం శ్రమించేవారు.
అలాగే, మలేసియా రాజధాని కౌలాలంపూర్ పట్టణంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహా సభలకు నాటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు కారణాంతరాలవల్ల వెళ్ళలేక పోవడంతో సాంస్కృతిక శాఖ మంత్రిగా వున్న వీరు ఆ సభల్లో కీలక ప్రసంగాలు చేసి సభికులను తన అసాధారణ వక్తృత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారు. పీవీ మంత్రివర్గంలో వున్న ఈ ఇద్దరు మంత్రుల్ని 'జంట కవులు' అని పిలిచేవాళ్ళు. తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి అయినప్పుడు వీరి శాఖల్ని మార్చి ఒకరిది మరొకరికి కట్టబెట్టారు. 'జలగం గారు మాకు కుండ మార్పిడి చేశారు' అనే వారు వీరు హాస్యోక్తిగా.
భాట్టం వారు పాత్రికేయ రంగంలో సైతం రాణించారు. 1947-48 మధ్యలో జయభారత్ పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే వివిధ పత్రికల్లో కాలమ్స్ రాసేవారు. 1969లో ప్రజారథం వార పత్రికకు ఎడిటర్‌గా కొద్దీ కాలం పనిచేసిన తర్వాత 1969లో ఆంధ్రజనత పత్రిక ఎడిటర్ జి.సి.కొండయ్య గారి ఆహ్వానం మేరకు ఆ పత్రికకు రాయడం మొదలు పెట్టి 1970లో పత్రిక ఎడిటర్ అయ్యారు. 1970-72 వరకు ఆంధ్ర జనత పత్రికను దిగ్విజయంగా నిర్వహించారు. రాజకీయాల నుంచి వైదొలిగిన తర్వాత కూడా పత్రికలకు కాలమ్స్ రాస్తూ వచ్చారు.
భాట్టం వారు తన జీవిత కాలంలో 4 పుస్తకాలను రచించారు. వాటిలో తన సన్నిహితుల కోరిక మేరకు తన ఆత్మ కధ రాశారు. దానికి అయన పెట్టుకున్నపేరు 'స్వేచ్చాభారతం'. సాధారణంగా రాజకీయ నాయకులు రాసే తమ ఆత్మ కధల్లో 'ఆత్మ స్తుతి పరనింద' తొణికిసలాడతాయి. కానీ భాట్టం తరహానే వేరు. ఆయన అన్ని విషయాలు చాలా నిక్కచ్చిగా రాసుకున్నారు. చివర్లో తనకు తానే 'తుది పలుకులు' కూడా రాసుకున్నారు. 'కోహం (నేనెవర్ని) అంటూ పుట్టావు. సోహం (నేనే నువ్వు అంటే భగవంతుడు) అంటూ ఆ ఎరుకతో మరణించు. పుట్టిన చోటు చేరడానికి ఏడుపెందుకు?'. ఒకనాటి రాజకీయ సహచరుడు, ముఖ్య స్నేహితుడైన మండలి వెంకట కృష్ణారావు కుమారుడు, మాజీ మంత్రి మరియు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఈ గ్రంధానికి 'ముందు మాట' రాశారు.
రాజకీయాల్లో డబ్బుకు దూరంగా, ప్రజలకు దగ్గరగా గడిపిన చరిత్ర భాట్టం వారిది. హోదాలు కోరుకోలేదు. ఆస్తులు కూడబెట్టలేదు. విశాఖపట్నంలో ఏ చిన్న ఇంట్లో వున్నారో, జీవిత చరమాంకం వరకు అదే ఇంట్లో గడిపారు. మంత్రిగా వున్నప్పుడు అత్యంత నిరాడంబరంగా కుమారుడు విద్యాసాగర్ పెళ్లి చేశారు. తాను నమ్మింది ఆచరించి చూపడం అన్నది తన పెళ్ళిలో కూడా ప్రదర్శించి చూపారు. ఆయనది కులాంతర వివాహం. మద్దూరి అన్నపూర్ణయ్య గారి పౌరోహిత్యంలో శ్రీమతి సత్యవతితో జరిగిన ఆ పెండ్లితంతుకైన ఖర్చు కేవలం పదిహేను రూపాయలు.
ఏళ్ళు మీద పడి, కాళ్ళూ చేతులూ సరిగా ఆడని వాళ్లు కూడా పదవులకోసం వెంపర్లాడుతున్న ఈ రోజుల్లో భాట్టం వంటి వారిని ఊహించుకోవడం కూడా కష్టం. అంతేకాదు, అయన తన కుటుంబ సభ్యులనెవ్వరినీ రాజకీయాల్లో ప్రోత్సహించలేదు. తన టిక్కెట్టు తన భార్యకు ఇమ్మని కూడా దేబిరించలేదు. ఆ పుణ్యాత్మురాలు సత్యవతి గారు కూడా భర్తకు తగ్గ భార్య. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా, ఆశయాలకు తగినట్టుగా ఆయన వెంట నడిచారు.
'కాలో హ్యయం నిరవధి:, విపులాచ పృధ్వీ'. విశాలమైన విశ్వంలో, అనంతమైన కాలంలో అసంఖ్యాక ప్రజానీకం పుడుతూ వుంటుంది. గిడుతూ వుంటుంది. వాళ్ళంతా ఎవరికి తెలుసు ? కొద్ది మంది పేర్లే మనం తలచుకుంటూ వుంటాం.' ఆ కొద్దిమందిలో ఒకరైన భాట్టం శ్రీరామమూర్తి గారు 2015, జూలై 6న అనారోగ్యంతో కన్నుమూశారు. 'తానమ్మిన సత్యాన్నే బోధించిన ధీశాలి, బోధించిన సత్యాన్నే పాటించిన వ్రతశీలి' అనే దానికి నిలువెత్తు నిర్వచనం భాట్టం శ్రీరామమూర్తి. నిండు జీవితం గడిపి, గడిపిన జీవితానికి చరితార్ధత కల్పించిన ధన్యజీవి.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్‌లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..