భారత ఆధ్యాత్మిక వేత్త-శ్రీశ్రీ రవిశంకర్
- May 13, 2025
కోట్లాది మంది మానసిక రోగాలతో సతమవుతున్న ప్రస్తుత తరుణంలో ఆధ్యాత్మికత అవసరం ఇంతకు ముందు కన్నా ఎక్కువ ఉంది. ఆధ్యాత్మికత ద్వారా పొందే ప్రయోజనాన్ని జాతి, వర్గ, కులమతాలకు అతీతంగా అందరికీ అందే విశిష్ఠ కార్యాన్ని తన భుజస్కంధాలకు ఎత్తుకున్నారు భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్. నేడు భారత ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం..
గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ 1956, మే 13వ తేదీన తమిళనాడులోని పాపనాశంలో ఆర్.ఎస్.వెంకట రత్నం, విశాలాక్షి దంపతులకు జన్మించారు. రవిశంకర్ బెంగళూరు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. నాలుగేళ్ల వయసులో రవిశంకర్ భగవద్గీత చదవడం ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి ధ్యానం పట్ల ఆసక్తి ఉండేది. వేద సాహిత్యం, భౌతిక శాస్త్ర విషయాలను అభ్యసించారు.
గ్రాడ్యుయేషన్ తరువాత రవిశంకర్ మహర్షి మహేష్ యోగి శిష్యుడిగా మరి ఆయనతో కలిసి ప్రయాణించారు. ప్రసంగాలు చెయ్యడం, వేద శాస్త్రాలపై సమావేశాలు ఏర్పాటు చేయడం, భావాతీత ధ్యానం, ఆయుర్వేద కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటివి చేశారు. 1982లో కర్ణాటకలోని షిమోగాలో శ్రీశ్రీ పదిరోజుల పాటు మౌనం పాటించారు. దీని తరువాత సుదర్శన క్రియ పుట్టింది. సుదర్శన క్రియ అనేది చాలా ప్రజాదరణ పొందిన జీవన కళ. ఇది ఒక శ్వాస ప్రక్రియ.
1983లో స్విట్జర్లాండ్‌లో రవిశంకర్ తన మొట్టమొదటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సును నిర్వహించారు. ఇప్పటి వరకూ 156 దేశాలలో సుమారు 45 కోట్ల మంది ప్రజలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సు ద్వారా సుదర్శన క్రియను నేర్చుకున్నారు. ఆ క్రియ తరువాత అలసట తగ్గి ఎంతో తాజాగా ఉందనే విషయాన్ని గుర్తించారు. నిమ్‌హాన్స్ పరిశోధకుల ప్రకారం సుదర్శన క్రియ ప్రభావం ఒత్తిడిని తగ్గించే మందుల ప్రభావంతో సమానంగా ఉందని నిర్ధారించారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా లక్షల మందికి గల మానసిక వేదనను శ్రీశ్రీ తొలగించారు. వీరు ఏటా దాదాపు 40 దేశాలలో పర్యటిస్తూ, ఏడాదిలో దాదాపు 180 రోజుల పాటు యాత్రలో ఉంటారు. శ్రీశ్రీ భారతదేశంతో పాటు ఇతర దేశాలలో కూడా శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తుంటారు. ఈ నాలుగు దశాబ్దాల్లో విద్యా రంగం మొదలుకుని సంక్షోభ నివారణ దాకా అనేక విభాగాల్లో సేవలు అందించారు. వీరు కొలంబియా అతర్యుద్ధం నుంచి కశ్మీర్, ఈశాన్య భారత దేశం దాకా ఎన్నో ఘర్షణలలో అన్ని వర్గాలను కలుపుకుపోయి శాంతిస్థాపనకు కృషి చేశారు.
రైతుల ఆత్మహత్యలను నివారించి, ఉత్పాదకతను పెంపొందించేందుకు ప్రకృతి సిద్దమైన వ్యవసాయం చేయాలని శ్రీశ్రీ రవిశంకర్ పిలుపునిచ్చారు. రసాయన ఎరువులు వాడకుండా పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి పంటలు పండించే ఈ విధానం అనతి కాలంలోనే చాలా ప్రాచుర్యం పొందింది. ఈ విధానంలో వ్యవసాయం చేయడానికి ఇప్పుడు 22 లక్షల మంది రైతులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా శిక్షణ పొందారు.ప్రపంచ శాంతి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న శ్రీశ్రీ రవిశంకర్ ను పలు పురస్కారాలతో సత్కరించారు. 2016లో భారత ప్రభుత్వం ఆయన్ని దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం "పద్మవిభూషణ్" తో సత్కరించింది.
గురుదేవ్ రవిశంకర్ శాస్త్రీయ సంగీతంలో కూడా నిపుణులు. వీణ వాయించడంలో నిష్ణాతులు. సుమారు ఏడు భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. అమెరికన్, కెనడియన్ నగరాల లీగ్‌లో, డెట్రాయిట్ మేయర్ జూలై 7ని శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవంగా ప్రకటించారు. ఈ ప్రదేశాలలో ప్రతి సంవత్సరం జూలై 7న శ్రీ శ్రీ రవిశంకర్ దివస్ జరుపుకుంటారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'